మిల్లర్ల మాయాజాలం! | farmers are facing problems | Sakshi
Sakshi News home page

మిల్లర్ల మాయాజాలం!

Published Fri, Feb 21 2014 1:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

మిల్లర్ల మాయాజాలం! - Sakshi

మిల్లర్ల మాయాజాలం!

 అన్నదాతలకు వరుస కష్టాలు
 నాణ్యత లేదని దర తగ్గింపు
 బ్రోకర్ల ద్వారా కొనుగోళ్లు
 సుమారు రూ.200 కోట్ల మేర సొమ్ము స్వాహా
 
 శ్రీకాకుళం అగ్రికల్చర్, నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్ : వరుస ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గటంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు.. తాజాగా మిల్లర్ల మాయాజాలానికి బలవుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సవాలక్ష ఆంక్ష లు విధించటంతోపాటు నాణ్యత లేదన్న సాకుతో మిల్లర్లు ధర తగ్గిం చేస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. పోనీ.. బహిరంగ మార్కెట్‌లో విక్రయించి అంతో ఇంతో లబ్ధి పొందాలనుకున్నా ఫలితం దక్కటం లేదు. అక్కడ కూడా మిల్లర్ల అండతో దళారులు రాజ్యమేలుతుండటమే దీనికి కారణం.
 
 జిల్లాలో పరిస్థితి..
 జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 2.05 లక్షల హెక్టార్లల్లో వరి సాగు చేశారు. దాదాపు ఆరు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. కానీ వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో పంట దెబ్బతిన డంతో దిగుబడి 4 లక్షల టన్నులకు తగ్గింది. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం జిల్లాలో 73 కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ వీటిద్వారా కొనుగోళ్లు అంతంతమాత్రంగానే జరిగాయి. మరోవైపు 3 లక్షల టన్నుల లెవీ చెల్లించాలని మిల్లర్లకు లక్ష్యం నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు 1.40 లక్షల టన్నుల మేరకే చెల్లించారని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 మిల్లర్లు చేస్తున్నది ఇదీ..
 లాభార్జనే ధ్యేయంగా మిల్లర్లు ఇటు అన్నదాతలను, అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు చెల్లించడం లేదు. దళారుల ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొన్న ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకోవడానికి వ్యూహం పన్నుతున్నారు. అలాగే లెవీ చెల్లించాలనే సాకుతో ఒడిశా నుంచి ధాన్యాన్ని అడ్డదారుల్లో తీసుకువచ్చి రహస్యంగా గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు.
 
 నిబంధనలకు విరుద్ధంగా..
 కేంద్రప్రభుత్వం సడలించిన నిబంధనల ప్రకారం ధాన్యం లో మట్టి, ఇసుక ఒక శాతం.. తాలు గింజలు వగైరా ఒక శాతం..పాడైన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తొలిచిన గింజలు 4 శాతం.. పూర్తిగా పండని, ముడుచుకుపోయిన, నొక్కులు పడిన గింజలు 3 శాతం, తక్కువ రకం గింజల మిశ్రమం గ్రేడ్ ఏ రకంలో 6 శాతం వరకు ఉండవచ్చు. తేమ 17 శాతం వరకూ ఉండొచ్చు. వీటిని మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రైతుల నుంచి తడి సిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేశామని చెప్పి లెవీ చెల్లిస్తున్నారు. ఈ విధంగా ప్రతీ లారీ లోడు వద్ద వేలాది రూపాయలు ప్రయోజనం పొందుతున్నారు. మరోవైపు.. బహిరంగ మార్కెట్‌లో బియ్యం అమ్ముకోవాలనే లక్ష్యంతో లెవీ పూర్తి స్థాయిలో చెల్లించలేమని చేతులెత్తేస్తున్నారు.
 
 నరసన్నపేట కేంద్రంగా దందా
 మిల్లర్ల మాయాజాలం అంతా నరసన్నపేట కేంద్రంగానే జరుగుతోందని రైతులు చెబుతున్నారు. ఎక్కువ మంది మిల్లర్లు, మిల్లర్ల సంఘం నేతలు ఆ ప్రాంతం వారే కావటమే ఇందుకు కారణం. జిల్లాలో ధాన్యం అమ్మకాలు గతేడాది డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో గొడౌన్ల సమస్య తీవ్రంగా ఉండడంతో చాలా మంది రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవడం పరి పాటి. దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లర్లు మోసాలకు పాల్పడ్డారు. బ్రోకర్లను రంగంలోకి దించి ధాన్యం అమ్మకాలు ప్రారంభమైన మొదట్లో 80 కిలోల బస్తాను రూ.850లకే కొనుగోలు చేయిం చారు. వాస్తవానికి సాధారణ రకం ధాన్యానికి రూ.1048, గ్రేడ్-ఎ రకానికి 1076 రూపాయలు చెల్లించాలి. కానీ రూ.850 నుంచి రూ.950 మధ్య చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1.40 లక్షల టన్నుల లెవీ సేకరించారు. ఈ లెక్కన జిల్లాలో దాదాపు రూ. 200 కోట్లను జేబులో వేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement