సాక్షి, హైదరాబాద్: రైతన్న మరోసారి మోసపోయాడు. వ్యవసాయానికి వడ్డీ లేని రుణాలంటూ అదరగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తేసింది. బ్యాంకర్లు రైతుల ముక్కు పిండి అసలు, వడ్డీ కలిపి రుణాలు వసూలు చేస్తున్నారు. లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ మాఫీ పథకం అంటూ గతంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తీసుకున్న రుణాలకు అసలు చెల్లిస్తే సరిపోతుందని, ఆ రుణంపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. దాంతో రైతులు వడ్డీ లేని రుణాలపై ఆశలు పెంచుకున్నారు.
ప్రస్తుతం రబీ సీజన్ ముగిసి పంటలు చేతికి వస్తుండడంతో.. తీసుకున్న రుణాలను చెల్లించడానికి రైతులు సిద్ధమవుతున్నారు. కానీ.. రుణం చెల్లించటానికి బ్యాంకులకు వెళ్లిన రైతాంగానికి ఊహించని దెబ్బ తగులుతోంది. అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సిందేనని వారిపై బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. అసలే సరైన సమయంలో వర్షాలు పడక, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని పెట్టిన ఖర్చులూ తిరిగి రాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలపై ఇది పిడుగుపాటే అవుతోంది. రుణాలను వడ్డీతో సహా చెల్లించాలంటే పంటనంతా తెగనమ్మగా వచ్చిన సొమ్ముతో పాటు ఇంకా ప్రైవేటుగా అప్పులు చేసి మరీ కట్టాల్సిన దుస్థితి దాపురించింది. చేతిలో చిల్లిగవ్వ మిగలక కుటుంబం గడిచే దారి తెలియక రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ఏడాది లోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ అన్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది రైతులు రూ. 47,647 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వడ్డీ మాఫీ పథకాన్ని మొదలు పెట్టిన సమయంలో రైతులు తీసుకున్న పంట రుణాలను మార్చి 31వ తేదీ లోపు చె ల్లించాలని ఒక నిబంధన పెట్టారు. అలాంటి వారికే వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ నిబంధన కారణంగా చాలా మంది రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే చర్చ జరిగింది. దాంతో రైతులు తీసుకున్న రుణాలను సంవత్సరం లోపు చెల్లించాలనేనిబంధన పెట్టారు. అంటే.. మార్చి నెలాఖరు గడువును తొలగించి.. తీసుకున్న రుణాలను ఏడాదిలోపు చెల్లించిన వారు.. వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా నిబంధనలు మార్చారు.
సర్కారు లేకపోతే పథకాలు అమలు కావట...
అయితే.. ప్రస్తుతం బ్యాంకు అధికారులు ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. రుణాలను తిరిగి చెల్లించడానికి వచ్చిన రైతుల నుంచి వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రన్నించిన రైతులకు నిరాశే మిగులుతున్నది. ప్రస్తుతం ప్రభుత్వమే లేనప్పుడు.. పథకాలు ఏలా అమల్లో ఉంటాయని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాంతో చేసేది లేక చాలా మంది రైతులు ఉన్నదంతా ఊడ్చి అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తున్నారు. లేదంటే కొత్త రుణాలు తీసుకోవటానికి ఇబ్బందులు వస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.
రుణామాఫీపై రైతుల ఆశలు...
మరోవైపు వ్యవసాయ రుణం అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తుండటంతో కొంత మంది రైతులు మాత్రం రుణాలు చెల్లించడం మానేశారు. ఎలాగూ వడ్డీ చెల్లించాల్సి ఉన్నందున మరో నెల రోజుల పాటు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు.
కిరణ్ సర్కారు ఢోకా జేసింది...
పత్తి పంట సాగు జేయడానికి రూ. 75 వేలు బ్యాంకు లోను తీసుకున్న. అష్టకష్టాలు పడి పంట సాగుజేసిన. నిరుడు మస్తువానలు పడి పంట పాైడైపోయింది. ఎవుసం కోసం చేసిన అప్పులు కుప్పైనయ్. బ్యాంకోళ్లేమో అప్పుకట్టాలంటండ్లు. పంటలు నష్టపోయిన రైతులకు వడ్డీ మాఫీ జేత్తమని కిరణ్ సర్కారు ఢోకా జేసింది. పంటలు పండక అప్పుపాలై తిప్పలు పడ్తున్నం.
- గంగిశెట్టి ఆశయ్య, నెన్నెల, ఆదిలాబాద్ జిల్లా
మొత్తం కట్టాలంటున్నారు...
గతేడాది బ్యాంకులో రూ. 60 వేలు రుణం తీసుకున్న. పంట రుణం తీసుకున్న రైతులకు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తమని చెప్పింది. కాని బ్యాంకోళ్లు మాత్రం డబ్బులు కట్టాల్సిందేనని చెప్పుతండ్లు. పంటలు కూడా అంతంత మాత్రంగానే పండినయ్. రైతుల కష్టాలు గుర్తించి తీసుకున్న బ్యాంకు అప్పు, వడ్డీ మాఫీ చేయాలే.
- బోరిగామ కిష్టయ్య, జన్కాపూర్, ఆదిలాబాద్ జిల్లా
వడ్డీ మాఫీ పేరుతో మోసగించారు...
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల లోపు పంట రుణానికి వడ్డీ మాఫీ కావడం లేదు. బ్యాంకర్లు పంట రుణాలకు వడ్డీని వసూలు చేస్తున్నారు. దీనివల్ల లక్ష రూపాయల పంట రుణానికి సుమారు రూ. 8 వేల భారం పడుతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్నా మాకు దక్కిందేమీ లేదు. వడ్డీ మాఫీ ఉంటుందని, దాంతో కొంతలో కొంతైనా ఆర్థిక భారం తగ్గుతుందని ఆశిస్తే, నిరాశే మిగులుతోంది.
- గాదెపల్లి గంగారెడ్డి, జాన్కంపేట్, నిజామాబాద్ జిల్లా
రైతులంటే అంత అలుసా?
రైతులంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి అలుసుగా మారింది. రైతులకు ప్రకటించిన పంట రుణాల వడ్డీ మాఫీ అమలును పట్టించుకోలేదు. వడ్డీ మాఫీ అవుతుందని, దానివల్ల పంటనష్టం నుంచి కొద్దిమేరకు గట్టెక్కుతామని ఆశించాం. ఒక చేతితో ఇచ్చి, మరో చేతితో లాక్కున్నట్లయింది. రైతులంటే ఇంత అలుసా?
- కొలిప్యాక బాల్‌రెడ్డి, జాన్కంపేట్, నిజామాబాద్ జిల్లా
ఇదేం దారుణమో అర్థం కావటం లేదు
సాగుకోసం గత ఏడాది రూ. లక్ష అప్పు తీసుకున్నా. ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తామంది. వడ్డీ కట్టకుండా అసలు కడితే సరిపోతుందని నాటి ముఖ్యమంత్రే చెప్పారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదేం దారుణమో అర్థం కావడం లేదు.
- ముదుసూరి సత్యనారాయణరాజు, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా
వెళ్లి కిరణ్‌నే అడగమంటున్నారు...
వడ్డీ లేని రుణాలు అంటూ అప్పట్లో బ్యాంకు అధికారులు చెప్పగా రూ. 30 వేలు రుణం తీసుకున్నాను. ప్రస్తుతం బ్యాంకు అధికారులు అప్పు, వడ్డీ రెండూ కట్టాల్సిందేంటున్నారు. కిరణ్ వడ్డీలేని రుణాలు అని చెప్పారు కదా అని బ్యాంకు అధికారులను అడిగితే వారు ‘కిరణ్‌నే అడుగుపో’ అని విదిలించేస్తున్నారు.
- బట్టీ వన్నూరప్ప, రాప్తాడు, అనంతపురం జిల్లా
బూటకపు మాటలే...
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండి రైతుల రుణాలకు వడ్డీలను మాఫీ చేస్తానని చెప్పిన మాటలు అన్నీ బూటకమే. ఆయన ఇచ్చిన జీవోలను బ్యాంకర్లు బుట్టదాఖలు చేశారు. రైతులకు ఇచ్చిన రుణాలను సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు మాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ సర్కారు మాట తప్పింది. ఒకపక్క వడగండ్లు, భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఏం చేయలో తోచని స్థితిలో ఉండగా.. బ్యాంకర్లు వడ్డీలు వసూలు చేస్తుంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మొదటగా రుణాలు ఇవ్వకపోయినా సరేకాని వచ్చిన పంటకు గిట్టుబా టు ధరను అందిస్తే రైతులకు రుణాలు అవసరం ఉండవు. ఇచ్చిన రుణాలకు వడ్డీలు వసులు చేస్తున్న బ్యాంకర్లు వెంటనే ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.
- వి.ప్రభాకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి