సబ్సిడీ హుళక్కేనా?
- ఖరారు కాని వ్యవసాయ యంత్ర పరికరాల ధరలు
- ఎక్కువ సొమ్ముకు కొనుగోలు చేయలేకపోతున్న రైతులు
- పట్టించుకోని ఏపీ ఆగ్రోస్... స్పందించని సర్కారు
- ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా మీనమేషాలు
విశాఖ రూరల్ : ఓ సీజన్‌లో అతివృష్టి, మరో సీజన్‌లో అనావృష్టితో అతలాకుతలమవుతున్న రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రుణమాఫీ హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం సబ్సిడీపై అందించాల్సిన వ్యవసాయ యంత్ర పరికరాలను సమకూర్చడంలోను ఘో రంగా విఫలమవుతోంది.
దాదాపు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా... పరిశ్రమల నుంచి ఏపీ ఆగ్రోస్ కొటేషన్లు స్వీకరించినా... ధర నిర్ణయించకపోవడంతో రైతులకు అందించే సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు ఈ ఏడాదికి లేనట్టేనని తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఈ పరికరాలను ఎ క్కువ సొమ్ము పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వంతో పాటు ఏపీ ఆగ్రోస్ నిర్లక్ష్య ధోరణి కూడా కారణమేనని చిన్న పరిశ్రమల యజమానులు, రైతులు ఆరోపిస్తున్నారు.
50 శాతం సబ్సిడీపై పరికరాలు
ఏటా ఏపీ ఆగ్రోస్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు 40 నుంచి 50 శాతం సబ్సిడీతో అందిస్తుంటారు. జిల్లాలో దాదాపు రూ.9 కోట్ల విలువైన వివిధ రకాల యంత్ర పరికరాలు రైతులకు అందాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రైతులకు చిన్న పరిశ్రమలకు, వ్యవసాయశాఖకు మధ్య ఏపీ ఆగ్రోస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
ఈ పథకం ద్వారా గొర్రు నాగళ్లు, ఫ్లవులు, ఆఫగేజ్ దమ్ముచక్రాలు, రూ.లక్షల విలువ చేసే రోటావేటర్లు, డిస్క్ ఫడ్లర్లు, లెవిల్ బ్లేడులు, వివిధ రకాల కల్టివేటర్లు ఇస్తారు. వీటిలో రోటావేటర్లకు 50 శాతం సబ్సీడీ ఉంటుంది. మిగిలిన వాటికి చిన్న పరిశ్రమల అధిపతులతో ఏపీ ఆగ్రోస్ సంస్థ చర్చించి ధరలు నిర్ణయిస్తుంది. వీటికి దాదాపు 40 నుంచి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ట్రాక్టర్లు ఉన్న రైతులు ఈ సబ్సిడీ పథకాన్ని వినియోగించుకుంటారు.
అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం మండలాల్లో రైతులు ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. రైతులకు అందించే సబ్సిడీలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కేవలం 10 శాతం వాటా మాత్రమే రాష్ర్ట ప్రభుత్వం ఇస్తుంది. ఈ కొద్దిపాటి సబ్సిడీని కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కొటేషన్ల దశ దాటని ఏపీ ఆగ్రోస్ : ఏటా ఏప్రిల్‌లో యంత్ర పరికరాల తయారీదారు నుంచి కొటేషన్లు పొందుతారు. వీటిలో చిన్న పరిశ్రమలతో పాటు పెద్ద పరిశ్రమలుంటాయి. ట్రాక్టర్ వీల్స్, నాగళ్లు వంటివి చిన్న పరిశ్రమలు సరఫరా చేస్తుండగా, రోటావేటర్లు వంటి వాటికి పెద్ద కంపెనీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కొటేషన్లు వేస్తుంటాయి. సాధారణంగా ఈ ప్రక్రియను మే నెలలోనే పూర్తి చేసి అప్పుడే ధర ఖరారు చేస్తారు.
ఈ ఏడాది జూన్ 26 వరకు తయారీదారుల నుంచి కొటేషన్లు ఆహ్వానించినా ఇప్పటి వరకు ధరలు నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడమేనని తెలుస్తోంది. రుణమాఫీ జరగక, కొత్త రుణాలు అందక, యంత్ర పరికరాల సబ్సిడీ నిర్ణయం జరగకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్ రైతాంగానికి శాపంగా పరిణమించింది.