వైఎస్సార్‌సీపీలోనే ఉంటా: ఎస్పీవెరైడ్డి
సాగునీటి సమస్యపైనే సీఎంను కలిశా
సాక్షి, హైదరాబాద్: తమ ప్రాంత రైతులకు సాగునీటి కేటాయింపుల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరడం కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశానని, అంతే తప్ప అందులో మరే ఉద్దేశం లేదని వైఎస్సార్‌సీపీ నేత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు. కర్ణాటక రైతులు దౌర్జన్యంగా తుంగభద్ర డ్యామ్ నుంచి కేసీకెనాల్‌కి, రాజోలిబండ, ఆర్డీఎస్‌లకు నీళ్లు బంద్ చేయడంతో ఆ సమస్యను వివరించడం కోసం సీఎంను కలిశానన్నారు. దీనిపై అనవసరంగా కొన్ని వార్తా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరమని ఆయన అన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వదిలి... తనంటత తానే వైఎస్సార్‌సీపీలో చేరానని, అదే పార్టీలో ఉంటానని వివరించారు. ‘జగన్ నాకు చాలా సన్నిహితుడు. రాజశేఖరరెడ్డితో వ్యక్తిగత సంబంధముంది.. నేను మున్సిపల్ చైర్మన్‌గా ఉంటే అది చాలా చిన్న పదవి అని, ఎంపీగా వెళ్లాలని చెప్పి, లోక్‌సభకు పంపించిన మహానుభావుడు. ఆ కుటుంబం మీద మాకు ఎప్పటికీ కృతజ్ఞత భావం ఉంటుంది’ అని అన్నారు. నిజాయితీగా బతికే తన లాంటి రాజకీయ నాయకుడి పై వార్త ప్రసారం చేసే ముందు ఒక్క సారి ఫోన్ చేసి వివరణ అడిగుంటే సమాధానం చెప్పేవాడినన్నారు. ప్రజలకు సంబంధించిన పనుల మీద వెళితే దానిని కూడా వక్రీకరించడం మంచిదికాదన్నారు.