సాక్షి ప్రతినిధి, ఏలూరు :
వ్యవసాయ భూములను ముంపు ముప్పునుంచి తప్పించడం.. రైతులను నష్టాల నుంచి గట్టెక్కించడమే తన ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అందుకే డెల్టా ఆధునికీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా చేయించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించామని, దానిని క్రమపద్ధతిలో అమలు చేస్తామని తెలిపారు. ఏటా ఖరీఫ్ సీజన్‌లో డెల్టాలో ముంపు సమస్య ఏర్పడుతోందని,డెల్టా ఆధునికీకరణ చేపట్టడమే దీనికి పరిష్కారమని పేర్కొన్నారు. కాలువలతో పాటు డ్రెయిన్ల ఆధునికీకరణ పనులను కూడా ఒకేసారి చేపడతామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
భూసేకరణ తదితర ఎటువంటి ఇబ్బందులు లేని కీలకమైన కొన్ని పనులను గుర్తించామని వాటిని వెంటనే చేపడతామని చెప్పారు. భీమవరం మండలం లోసరి వద్ద రైతులు త్వరగా పంటను ముగించేందుకు సిద్ధమయ్యారని, సాగు పూర్తవగానే అక్కడ పనులు చేపడతామని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు సమీపంలో ఎర్రకాలువపై ఆక్విడెక్టు వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. డెల్టాలో అన్నిచోట్లా రైతులతో మాట్లాడి వారికి ఇబ్బందిలేని రీతిలో పనులు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రైతులు సహకరిస్తే ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తిచేయడానికి అవకాశం కలుగుతుందని, వారు కొంత వెసులుబాటు ఇస్తే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని అన్నా రు. రైతులు సహకారం అందించినా కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పానని తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఆధునికీకరణ పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు.
గ్రామాల్లో పరిశుభ్రతకు చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. ఈ కార్యక్రమం లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 65 వేలకుపైగా మరుగుదొడ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించడానికి ప్రా ధాన్యత ఇస్తామని చెప్పారు. జిల్లాలో బంగారుతల్లి పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని, తద్వారా రోగులకు వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే తన విధి అని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
ముంపు ముప్పు తప్పిస్తాం : కలెక్టర్ సిద్ధార్థజైన్
Published Fri, Nov 8 2013 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement