పథకాలపై అవగాహన పెంచండి | need awareness on schemes | Sakshi
Sakshi News home page

పథకాలపై అవగాహన పెంచండి

Published Sat, Jan 11 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

need awareness on schemes


 ‘బంగారుతల్లి’ని సమర్థవంతంగా అమలు చేయండి
 2013 మే 1వ తేదీ తర్వాత జన్మించిన ప్రతి ఆడపిల్లనూ బంగారుతల్లి పథకంలో నమోదు చేయాలన్నారు.  వారికి రూ.2,500 తొలి విడతగా జమ చేయాలన్నారు. పథకం వర్తింపునకు జనన ధుృవీకరణ, రేషన్ కార్డు, ఆధార్, బిడ్డతో కలిగిన ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ వివరాలు అవసరం అవుతాయన్నారు.
 
 ఏలూరు, న్యూస్‌లైన్ :
 పేదలకు ఆసరాగా నిలుస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహనకు మహిళా సమాఖ్యలు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ అభిప్రాయపడ్డారు. సత్రంపాడులోని టీటీడీసీలో శుక్రవారం 113వ జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాలపై దాదాపు 4 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. పలు సూచనలు, సలహాలు అందించారు. పేదల ఆర్థికాభివృద్ధితో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఇందిరాక్రాంతి పథం రూపొందించిందన్నారు. ఆశయాల అమలుకు మహిళా సమాఖ్యలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐకేపీ రుణాలు, పెన్షన్లు, బంగారుతల్లి, రుణా లు తిరిగి చెల్లింపు, గ్రూపు ఖాతాలు, పొదుపు తీరు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతినెలా 10 మండలాల్లో జిల్లా సమాఖ్యకు చెందిన ఆయా కమిటీలు పర్యటించి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు, రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ‘సునందిని’ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో 6 వేల 430 కృత్రిమ గర్భోత్పత్తి ఆడదూడలు, సంకరజాతి దూడలు కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామన్నారు. వాటికి 32 నెలలు వయస్సు వచ్చేంత వరకు దాణా, మందులు, వ్యాక్సిన్లు, బీమా సౌక్యర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
 
 జిల్లాను అన్నిరంగాల్లో ముందుంచండి
 జిల్లాలో స్వయం సహాయక గ్రూపులకు రుణాలు అందించడం, పెన్షన్లు పంపిణీ, బంగారుతల్లి తదితర కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమంలో ఉంచడంలో మహిళా సమాఖ్యలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు.
 
 జనవరి 26 నుంచి పాలసేకరణ చేపట్టాలి
 జిల్లాలో రూ.16 కోట్లతో ఏర్పాటు చేసిన 19 బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కావాలన్నారు. పాలసేకరణలో సంబంధిత స్వయం సహాయక సంఘాలు నిమగ్నం కావాలన్నారు. జిల్లాలో నిర్మల్ భారత్ అభియాన్ కింద 70 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం రూ. 9100 సబ్సిడీగా అందిస్తున్నదని, ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో డీఆర్ డీఏ పీడీ వై.రామకృష్ణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జీవమణి, పశుసంవర్థకశాఖ జేడీ కె.జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement