bangaru thali scheme
-
‘మా ఇంటి’కి రావా.. ‘మహాలక్ష్మి’!
సాక్షి, మచిలీపట్నం : బాలిక భవితకు బాటలు వేయాలన్న తలంపుతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ చేసిన బంగారు తల్లి (ప్రస్తుతం ‘మా ఇంటి మహాలక్ష్మి’) పథకానికి బాలారిష్టాలు వీడటం లేదు. ప్రభుత్వాలు మారా యి.. పథకం పేరు మారింది.. కానీ బాలిక భవి ష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పథకానికి మంగళం పాడే దిశగా అడుగులు పడ్డాయి. వెరసి మూడున్నరేళ్లుగా పథకంలో లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకునే వెబ్సైట్ తెరుచుకోకుండా పోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా 22 వేల మంది దరఖాస్తు చేసి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. బంగారు తల్లి పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో ఒక్కొక్కరికి రూ.2,500 జమ చేసిన డబ్బులు మినహా మళ్లీ నయా పైసా కూడా ఇవ్వలేదు. పథకం ఉద్దేశం ఏంటంటే.. బాలికా శిశు మరణాలు, బాల్య వివాహాలను అరికట్టి బాలికల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం ప్రవేశపెట్టారు. ఒక ఆడపిల్లతో ఆపరేషన్ చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇద్దరు ఆడ పిల్లలకు ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు రూ.30 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన మరణాంతరం పలు ఘటనలు, మార్పులు చోటు చేసుకున్నాయి. మహానేత పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2013 మే 1 వ తేదీన బంగారు తల్లి బాలికా అభ్యుదయ సాధికారిత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. అర్హులు.., అందే సాయం! పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఐసీడీఎస్, ఐకేపీ ద్వారా అర్హులను ఎంపిక చేసి పాప పుట్టిన మరుక్షణమే తొలి విడతగా రూ.2,500, రెండేళ్ల రెమ్మూనరేషన్, వైద్య సేవల కోసం ఏడాదికి రూ.వెయ్యి మంజూరు చేస్తారు. పాపకు 3, 4, 5 ఏళ్ల వయసుకు రాగానే పౌష్టికాహారం నిమిత్తం ఏడాదికి రూ.1,500, విద్యాభ్యాసం నిమిత్తం ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు అందజేస్తారు. విద్యాభ్యాసం నిమిత్తం 6, 7, 8 తరగతుల్లో రూ.2,500.. 9, 10 తరగతుల్లో రూ.3,000, ఇంటర్లో ఏడాదికి రూ.3,500, డిగ్రీలో ఏడాదికి రూ.4 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్‌లోనే చదువు ఆపేస్తే రూ.50 వేలు చొప్పున జమ చేయాలని నిర్ణయించారు. నాలుగేళ్లుగా ముప్పుతిప్పలు.. పథకం ప్రారంభ సమయంలో జిల్లాలో 22 వేల మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పారితోషికంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనంతరం ఎన్నికలు నిర్వహించడం.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పథకం అమలు విషయమై పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పథకం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారికే సాయం అందే సూచనలు కనిపిం చడం లేదు. మూడున్నరేళ్లుగా వేలాది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వారు వెబ్సైట్ ఎప్పుడు తెరుచుకుంటుందా? తమ పిల్లల పేర్లు నమోదు చేసుకుందామా? అని ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులపై స్పష్టత కరువు.. తొలుత ఐకేపీ ఆధ్వర్యంలో పథకం అమలవుతుందని అధికారులు స్పష్టీకరించారు. అనంతరం ఐసీడీఎస్ ద్వారా సాయం అందుతుందని, ఆ మేరకు విధి విధానాలను సైతం రూపకల్పన చేశామని పాలకులు, అధికారులు సెలవిచ్చారు. తీరా చూస్తే నాలుగేళ్లుగా వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని, ఐసీడీఎస్ అధికారులు సైతం అది తమ పథకం కాదని సమాధానమిస్తుండటంతో లబ్ధిదా రులు తమ గోడు ఎవరి వద్ద వెళ్ల బోసుకోవాలా? అని ఆందోళన చెందుతున్నారు. విధి విధానాలురూపొందాల్సి ఉంది పథకం ఏ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయాలి, తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాది లబ్ధిదారులకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. నిధులు విడుదలైన వెంటనే అర్హులకు అందేలా చూస్తాం. – కృష్ణకుమారి, ఐసీడీఎస్ పీడీ -
‘మా ఇంటి మహాలక్ష్మి’కి మంగళం..!
విజయనగరం ఫోర్ట్: డ్వాక్రా మహిళలను రుణాల భారంతో ముంచేసిన చంద్రబాబు సర్కారు.. ఆడపిల్లలకు ఆధారమైన బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరుమార్చి మంగళం పాడేసింది. నాలుగేళ్లుగా ఒక్క పైసాను కేటాయించకుండా ఆడబడ్డలకు ఆదరవు లేకుండా చేసేసింది. పిల్లల తల్లిదండ్రులను ఆవేదనలోకి నెట్టేసింది. ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల పుడితే రూ.లక్ష, ఇద్దరు పిల్లలు పుడితే రూ.60 వేలు చొప్పన ఇచ్చేవారు. అయితే, వైఎస్సార్ మరణానంతరం గద్దెనెక్కిన కిరణ్ సర్కార్ బాలికా సంరక్షణ పథకాన్ని బంగారుతల్లి పథకంగా మార్చింది. చట్టాన్ని సైతం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం మాఇంటి మహాలక్ష్మి పథకంగా పేరు మార్చి ఒక్క పైసా నిధులు విదల్చకుండా మరుగున పడేసింది. నాలుగేళ్లుగా పథకానికి విధివిధానాలు ఖరారు చేయలేదు. దరఖాస్తు చేసేందుకు వీలులేకుండా చేసేసింది. పథకం అమలైతే... బంగారు తల్లి పథకం అమలులో ఉన్న సమయంలో ఆడపిల్లల జనన ధ్రువపత్రంతో దరఖాస్తు చేసుకున్న వెంటనే రూ.2500 చెల్లించేవారు. ఇలా రెండేళ్ల వరకు ఇస్తారు. 3 నుంచి 5 ఏళ్లు లోపు వారికి అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఏటా రూ.1500 చెల్లించాలి. 6 నుంచి 10 ఏళ్ల వరకు ఏటా ప్రభుత్వ పాఠశాలల ద్వారా రూ.2 వేలు ఇవ్వాలి. 11 నుంచి 13 ఏళ్ల వరకు 6,7 తరగతి చదివే సమయంలో ఏటా రూ.2500 చెల్లించాలి. 14 నుంచి 15 ఏళ్లలోపు వారికి ఏటా రూ.3,500, 16 నుంచి 17 ఏళ్లు వరకు ఇంటర్ చదివే సమయంలో ఏటా రూ.3,500, 18 నుంచి 21 ఏళ్ల వరకు ఏటా రూ.4 వేలు, 21 ఏళ్లు వచ్చిన అనంతరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధిస్తే రూ.5 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.1,55,500 అందించాలి. 30 వేల మంది ఎదురు చూపు ఈ నాలుగు ఏళ్ల కాలంలో జిల్లాలో సుమారు 30 వేలు మంది ఆడపిల్లలు జన్మించారు. వారంతా పథకోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వారికి పథకం అందకుండా పోయింది. విధివిధానాలు లేవు.. మా ఇంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం నుంచి రాలేదు. దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదు.– ఏఈ రాబర్ట్స్, పీడీ, ఐసీడీఎస్ -
‘బంగారు తల్లి’ ఆపసోపాలు!
రిజిస్టర్ చేసుకున్న తల్లులు 13,337 మంది - మొదటి విడతగా రూ.2500 జమ 5,234 మందికే - కోడ్ నేపథ్యంలో మిగిలిన వారికి మొండిచేయి - ఇప్పటికీ 8,335 మందికి ఎదురుచూపులే - ప్రభుత్వం మారడంతో పథకంపై నీలినీడలు డోన్‌లోని పాతపేటకు చెందిన శ్రీదేవి, రామకృష్ణ దంపతులకు 3.7.2013న మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. శ్రీదేవికి పుట్టినిల్లయిన గూడూరులో ఆధార్ కార్డు ఉంది. దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు నెంబర్ ఒకటే ఉంటుంది. బంగారుతల్లి పథకం కింద లబ్ధి పొందేందుకు డోన్‌లోనే ఆధార్ నమోదు చేసుకోవాలనే మెలిక పెట్టడంతో గత రెండు నెలలుగా ఈ దంపతుల అవస్థలు వర్ణనాతీతం. కర్నూలు(కలెక్టరేట్): ‘బంగారు తల్లి’కి ప్రోత్సాహం కరువైంది. గత ఏడాది మే ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. చట్టబద్ధత కూడా కల్పించింది. ఆడంబరంగా ప్రవేశపెట్టిన ఈ పథకం క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో బంగారు తల్లి అమలు ఏ మలుపు తిరుగుతుందోననే సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ముందు కోడ్ అమల్లోకి రావడంతో పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పేరిట బ్యాంకుల్లో రూ.2,500 ప్రకారం జమ చేయడం కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ ఎత్తేసినా పథకం గాడిలో పడని పరిస్థితి. బంగారు తల్లి పథకంతో లబ్ధి పొందేందుకు చిన్నారి జన్మించిన 21 రోజుల్లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఆసుపత్రిలో కాన్పు అయినా తగిన డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న వెంటనే బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతుంది. ఇంట్లో కాన్పు అయితే ఈ మొత్తం అందదు. ఇప్పటి వరకు జిల్లాలో 13,569 మంది బంగారు తల్లి పథకం కింద రిజిస్టర్ కాగా 13,337 మంది డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయి. ఇందులో 2,921 మంది మహిళలు ఇంట్లోనే ప్రసవించారు. ఆసుపత్రిలోనే కాన్పు కావాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా వేలల్లో కాన్పులు ఇళ్లలోనే జరుగుతుండటం అధికారుల పనితీరుకు నిదర్శనం. అన్ని డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలో రూ.2,500 ప్రకారం జమ కావాల్సి ఉండగా.. 5,234 మందికి మాత్రమే ఆ మొత్తం అందింది. మిగిలిన వారు ఆ మొత్తం ఎప్పుడు జమ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ‘బంగారు తల్లి’కి అందించే మొత్తం రూ.1,55,500 బంగారు తల్లి కింద నమోదైన వారికి చివరిగా రూ.1,55,500 అందుతుంది. అయితే టీకాలు వేయించడం మొదలు పాపను క్రమం తప్పకుండా చదివించాల్సి ఉంటుంది. విధిగా పరీక్షలో పాస్ కావాలి. ఇందుకు అవసరమైన ధ్రువీకరణలు తప్పనిసరి. ఇలా నిబంధనల ప్రకారం డిగ్రీ వరకు చదివితేనే రూ.1,55,500 అందనుంది. 28 మండలాల్లో పురోగతి అధ్వానం జిల్లాలో 53 మండలాలు ఉండగా 28 మండలాల్లో బంగారు తల్లి అమలులో పురోగతి అధ్వానంగా ఉంది. ఈ మండలాల్లో గతేడాది మే ఒకటి తర్వాత పుట్టిన ఆడ పిల్లల్లో చాలా మంది బంగారు తల్లి కింద నమోదు కాలేకపోయారు. ఇందుకు సకాలంలో బర్త్ సర్టిఫికెట్ లభించకపోవడం, ఇతర ధ్రువపత్రాలు లేకపోవడం కారణంగా తెలుస్తోంది. ఓర్వకల్లులో 317, ఆదోని 369, కౌతాళం 197, మంత్రాలయం 226, సి.బెళగల్ 324, నందవరం 302, హాలహర్వి 137, నందికొట్కూరు 148, కృష్ణగిరి 254, కర్నూలు 378, తుగ్గలి 244, చిప్పగిరి 128, గోనెగండ్ల 367, మిడుతూరు 227, కొలిమిగుండ్ల 219, పెద్దకడుబూరు 317, కల్లూరు 246, కోడుమూరు 212, పగిడ్యాల 182, పాములపాడు 254, గడివేముల 224, గూడూరు 136, జూపాడుబంగ్లా 211, ఆలూరు 242, చాగలమర్రి 183, హొళగుంద 197, అవుకు 248, పత్తికొండ మండలంలో 429 ప్రకారం ‘బంగారు తల్లి’ కింద నమోదు చేసుకున్నారు. వీరితో 70 శాతం మందికి మొదటి విడత పరిహారం అందకపోవడం గమనార్హం. -
పథకాలపై అవగాహన పెంచండి
‘బంగారుతల్లి’ని సమర్థవంతంగా అమలు చేయండి 2013 మే 1వ తేదీ తర్వాత జన్మించిన ప్రతి ఆడపిల్లనూ బంగారుతల్లి పథకంలో నమోదు చేయాలన్నారు. వారికి రూ.2,500 తొలి విడతగా జమ చేయాలన్నారు. పథకం వర్తింపునకు జనన ధుృవీకరణ, రేషన్ కార్డు, ఆధార్, బిడ్డతో కలిగిన ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ వివరాలు అవసరం అవుతాయన్నారు. ఏలూరు, న్యూస్‌లైన్ : పేదలకు ఆసరాగా నిలుస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహనకు మహిళా సమాఖ్యలు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ అభిప్రాయపడ్డారు. సత్రంపాడులోని టీటీడీసీలో శుక్రవారం 113వ జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాలపై దాదాపు 4 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. పలు సూచనలు, సలహాలు అందించారు. పేదల ఆర్థికాభివృద్ధితో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఇందిరాక్రాంతి పథం రూపొందించిందన్నారు. ఆశయాల అమలుకు మహిళా సమాఖ్యలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐకేపీ రుణాలు, పెన్షన్లు, బంగారుతల్లి, రుణా లు తిరిగి చెల్లింపు, గ్రూపు ఖాతాలు, పొదుపు తీరు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతినెలా 10 మండలాల్లో జిల్లా సమాఖ్యకు చెందిన ఆయా కమిటీలు పర్యటించి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు, రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ‘సునందిని’ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో 6 వేల 430 కృత్రిమ గర్భోత్పత్తి ఆడదూడలు, సంకరజాతి దూడలు కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామన్నారు. వాటికి 32 నెలలు వయస్సు వచ్చేంత వరకు దాణా, మందులు, వ్యాక్సిన్లు, బీమా సౌక్యర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందుంచండి జిల్లాలో స్వయం సహాయక గ్రూపులకు రుణాలు అందించడం, పెన్షన్లు పంపిణీ, బంగారుతల్లి తదితర కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమంలో ఉంచడంలో మహిళా సమాఖ్యలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జనవరి 26 నుంచి పాలసేకరణ చేపట్టాలి జిల్లాలో రూ.16 కోట్లతో ఏర్పాటు చేసిన 19 బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కావాలన్నారు. పాలసేకరణలో సంబంధిత స్వయం సహాయక సంఘాలు నిమగ్నం కావాలన్నారు. జిల్లాలో నిర్మల్ భారత్ అభియాన్ కింద 70 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం రూ. 9100 సబ్సిడీగా అందిస్తున్నదని, ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో డీఆర్ డీఏ పీడీ వై.రామకృష్ణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జీవమణి, పశుసంవర్థకశాఖ జేడీ కె.జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు.