‘బంగారు తల్లి’ ఆపసోపాలు!
రిజిస్టర్ చేసుకున్న తల్లులు 13,337 మంది
- మొదటి విడతగా రూ.2500 జమ 5,234 మందికే
- కోడ్ నేపథ్యంలో మిగిలిన వారికి మొండిచేయి
- ఇప్పటికీ 8,335 మందికి ఎదురుచూపులే
- ప్రభుత్వం మారడంతో పథకంపై నీలినీడలు
డోన్‌లోని పాతపేటకు చెందిన శ్రీదేవి, రామకృష్ణ దంపతులకు 3.7.2013న మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. శ్రీదేవికి పుట్టినిల్లయిన గూడూరులో ఆధార్ కార్డు ఉంది. దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు నెంబర్ ఒకటే ఉంటుంది. బంగారుతల్లి పథకం కింద లబ్ధి పొందేందుకు డోన్‌లోనే ఆధార్ నమోదు చేసుకోవాలనే మెలిక పెట్టడంతో గత రెండు నెలలుగా ఈ దంపతుల అవస్థలు వర్ణనాతీతం.
కర్నూలు(కలెక్టరేట్): ‘బంగారు తల్లి’కి ప్రోత్సాహం కరువైంది. గత ఏడాది మే ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. చట్టబద్ధత కూడా కల్పించింది. ఆడంబరంగా ప్రవేశపెట్టిన ఈ పథకం క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో బంగారు తల్లి అమలు ఏ మలుపు తిరుగుతుందోననే సందిగ్ధం నెలకొంది.
ఎన్నికల ముందు కోడ్ అమల్లోకి రావడంతో పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పేరిట బ్యాంకుల్లో రూ.2,500 ప్రకారం జమ చేయడం కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ ఎత్తేసినా పథకం గాడిలో పడని పరిస్థితి. బంగారు తల్లి పథకంతో లబ్ధి పొందేందుకు చిన్నారి జన్మించిన 21 రోజుల్లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఆసుపత్రిలో కాన్పు అయినా తగిన డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించుకొని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకున్న వెంటనే బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతుంది. ఇంట్లో కాన్పు అయితే ఈ మొత్తం అందదు.
ఇప్పటి వరకు జిల్లాలో 13,569 మంది బంగారు తల్లి పథకం కింద రిజిస్టర్ కాగా 13,337 మంది డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయ్యాయి. ఇందులో 2,921 మంది మహిళలు ఇంట్లోనే ప్రసవించారు. ఆసుపత్రిలోనే కాన్పు కావాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా వేలల్లో కాన్పులు ఇళ్లలోనే జరుగుతుండటం అధికారుల పనితీరుకు నిదర్శనం. అన్ని డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలో రూ.2,500 ప్రకారం జమ కావాల్సి ఉండగా.. 5,234 మందికి మాత్రమే ఆ మొత్తం అందింది. మిగిలిన వారు ఆ మొత్తం ఎప్పుడు జమ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు.
‘బంగారు తల్లి’కి అందించే మొత్తం రూ.1,55,500
బంగారు తల్లి కింద నమోదైన వారికి చివరిగా రూ.1,55,500 అందుతుంది. అయితే టీకాలు వేయించడం మొదలు పాపను క్రమం తప్పకుండా చదివించాల్సి ఉంటుంది. విధిగా పరీక్షలో పాస్ కావాలి. ఇందుకు అవసరమైన ధ్రువీకరణలు తప్పనిసరి. ఇలా నిబంధనల ప్రకారం డిగ్రీ వరకు చదివితేనే రూ.1,55,500 అందనుంది.
28 మండలాల్లో పురోగతి అధ్వానం
జిల్లాలో 53 మండలాలు ఉండగా 28 మండలాల్లో బంగారు తల్లి అమలులో పురోగతి అధ్వానంగా ఉంది. ఈ మండలాల్లో గతేడాది మే ఒకటి తర్వాత పుట్టిన ఆడ పిల్లల్లో చాలా మంది బంగారు తల్లి కింద నమోదు కాలేకపోయారు. ఇందుకు సకాలంలో బర్త్ సర్టిఫికెట్ లభించకపోవడం, ఇతర ధ్రువపత్రాలు లేకపోవడం కారణంగా తెలుస్తోంది. ఓర్వకల్లులో 317, ఆదోని 369, కౌతాళం 197, మంత్రాలయం 226, సి.బెళగల్ 324, నందవరం 302, హాలహర్వి 137, నందికొట్కూరు 148, కృష్ణగిరి 254, కర్నూలు 378, తుగ్గలి 244, చిప్పగిరి 128, గోనెగండ్ల 367, మిడుతూరు 227, కొలిమిగుండ్ల 219, పెద్దకడుబూరు 317, కల్లూరు 246, కోడుమూరు 212, పగిడ్యాల 182, పాములపాడు 254, గడివేముల 224, గూడూరు 136, జూపాడుబంగ్లా 211, ఆలూరు 242, చాగలమర్రి 183, హొళగుంద 197, అవుకు 248, పత్తికొండ మండలంలో 429 ప్రకారం ‘బంగారు తల్లి’ కింద నమోదు చేసుకున్నారు. వీరితో 70 శాతం మందికి మొదటి విడత పరిహారం అందకపోవడం గమనార్హం.