కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉపకార వేతనం అందని ద్రాక్షగా మారుతోంది. నిన్నటి వరకు ఆధార్‌కార్డు.. బ్యాంకు ఖాతా.. మీసేవ కేంద్రాల్లో పొందిన ధ్రువీకరణ పత్రాల సమర్పణ పేరిట విసిగించారు. తాజాగా బయోమెట్రిక్ సిస్టమ్‌లో వేలి ముద్రలు వేయాలనే నిబంధన విధించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థుల వేలిముద్రల సేకరణకు బయోమెట్రిక్ మిషన్లను ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా.. ప్రైవేట్ కళాశాలలు సొంతంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థుల దరఖాస్తులను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు పరిశీలించి.. వేలిముద్రలతో కూడిన హార్డ్‌కాపీలను సంబంధిత సంక్షేమ శాఖలకు పంపాల్సి ఉంది. అ తర్వాత ఆయా శాఖల్లోని బార్‌కోడ్ ఆధారంగా ఉపకార వేతనాన్ని మంజూరు చేసేందుకు నిర్ణయించారు.
అయితే అధిక శాతం ప్రైవేట్ కళాశాలలకు చెందిన యాజమాన్యాలు ఇప్పటికీ మిషన్లను కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ఫీల్డ్ లెవెల్ అధికారులకు సైతం ప్రభుత్వం ఇప్పటికీ మిషన్లను అందివ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. అన్ని సంక్షేమ శాఖలకు కలిపి 16 నుంచి 20 మిషన్లు జిల్లాకు అవసరమని సంబంధిత అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు పంపినా పట్టించుకున్న దాఖలాల్లేవు. మార్చి నెలతో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కానుండటంతో మిషన్ల కొనుగోలు, హార్డ్ కాపీలను పంపడంలో జరుగుతున్న జాప్యం మొదటికే మోసం తీసుకొస్తుందేమోనన్న అనుమానాలకు తావిస్తోంది.
8వేలకు మించని హార్డ్‌కాపీలు
జిల్లాలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులు దాదాపు లక్ష మంది ఉన్నారు. వీరిలో రెన్యూవల్ విద్యార్థులు 50,165 మంది ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 50,153 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఫ్రెష్ విద్యార్థులు 50,794 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు 45,502 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 8వేల హార్డ్‌కాపీలు మాత్రమే సంబంధిత శాఖలకు అందడం గమనార్హం. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 3430, బీసీ 1951, ఈబీసీ 2639, ఎస్‌టీ విద్యార్థులకు సంబంధించి 121 దరఖాస్తులు మాత్రమే అందాయి. బయో మెట్రిక్ మిషన్ల కొనుగోలు, వాటి వినియోగం తదితర అంశాలకు సంబంధించి జిల్లాలో డివిజన్ల వారీగా ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోతోంది. వారం రోజులు గడచినా పురోగతి లేకపోవడం కళాశాలల నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఉప‘కారం’
Published Wed, Jan 29 2014 3:18 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement