మిర్యాలగూడ, న్యూస్‌లైన్
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వరి పంటపై పై-లీన్ తుపాను ప్రభావం పడింది. వాతావరణంలో మార్పులతో తెగుళ్లు షురూ అయ్యాయి. దోమపోటు, మొగితెగులు, ఆకుముడత తెగులు సోకాయి. దీంతో రైతులు వేలాది రూపాయలు మందుల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దోమపోటు ముదిరితే పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టులో రెండేళ్లుగా సాగునీరు లేక పంటలు పండక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది సాగునీటిని విడుదల చేయగా పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న తరుణంలో తుపాను ప్రభావం రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది. వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వాప్తంగా ఖరీఫ్‌లో 1,43,917 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు.
వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి రానుంది. 7 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కానీ దోమపోటు కారణంగా బీపీటీ(సాంబమసూరి) వరి దెబ్బతిని పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పురుగు మందులకు అదనపు డబ్బులు వెచ్చిస్తున్న రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు.
పెరిగిన ఖర్చులు..
ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతాంగానికి ఖర్చులు భారీగా పెరిగాయి. పై-లీన్ తుపానుకు ముందే రైతులు ఎకరానికి 6 కిలోల చొప్పున 240 రూపాయలు వెచ్చించి గుళికలు చల్లారు. ఆ తర్వాత కూడా తెగుళ్లకు ఎకరానికి 500 రూపాయల నుంచి 800 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క రైతు మూడు పర్యాయాలు మందులు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసినందుకు ఎకరానికి మరో 300 అదనంగా ఖర్చు చేస్తున్నారు. సుమారుగా ఎకరానికి ఒకసారి మందు పిచికారి చేస్తేనే రెండు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
వరికి సోకుతున్న తెగుళ్లు ఇవే..
ప్రస్తుతం వరికి ఆకుముడత, మొగితెగులు (కాండం తొలిచే పురుగు), పాముపొడ, దోమపోటు తెగుళ్లు సోకుతున్నాయి. ప్రస్తుతం పై-లీన్ తుపాను కారణంగా దోమపోటు షురూ అయ్యింది. దోమపోటు ఎక్కువైతే పంట దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి.
వాతావరణంలో మార్పు వల్లే తెగుళ్లు : శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ మిర్యాలగూడ
పై-లీన్ తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో వరికి దోమపోటు పెరిగే అవకాశం ఉంది. దోమపోటు పెరిగితే పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రైతులు ముందస్తుగా మందులు పిచికారీ చేసుకుంటే తెగుళ్లు నివారించుకోవచ్చు.
ఆకుముడత తెగులు నివారణకు క్లోరైఫైరీపాస్ గానీ, కినాల్‌పాస్ గానీ ఎకరానికి 400 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి.
మొగితెగులు నివారణకు ఎకరానికి పాస్పామిడాన్ 400 మిల్లీ లీటర్లు గానీ, కార్పాస్‌హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేస్తే తగ్గిపోతుంది.
దోమపోటు నివారణకు ఎస్సీఫ్యాక్ట్ 300 గ్రాములు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా బుప్రోఫాజిన్ 300 మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలి.
పై-లీన్ ఆందోళన
Published Fri, Oct 18 2013 2:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement