కూరగాయలకూ.. ఉద్యమ సెగ
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగతో రాజధాని నగరంలో కూరగాయల ధరలు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పచ్చిమిర్చి, ఉల్లి దిగుమతి నిలిచిపోయింది. బెంగళూరు నుంచి బీన్స్, క్యారెట్, క్యాబేజి సరఫరా ఆగిపోయింది. దీంతో నగరంలో కూరగాయలకు కొరత రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు.
ప్రస్తుతం మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా కేజీ రూ.40-80ల వరకు ధర పలుకుతున్నాయి. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే పచ్చిమిర్చి, ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో ఆకాశానికి ఎగబాకాయి. బుధవారం ఉదయం గుడిమల్కాపూర్‌లోని రిటైల్ మార్కెట్లో కేజీ రూ.100లు వసూలు చేశారు. కర్నూలు ప్రాంతం నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోవడంతో ఉల్లి ధరల్లో కూడా అనూహ్యంగా మార్పు కన్పిస్తోంది. సాధారణంగా ఇళ్లలో వినియోగించే గ్రేడ్-2 రకం ఉల్లిని సైతం కేజీ రూ.40-50ల ప్రకారం విక్రయిస్తున్నారు.
మార్కెట్లో రూ.500లు వెచ్చిస్తే కూడా కనీసం చేసంచి నిండని పరిస్థితి ఏర్పడింది. రైతుబజార్లలో సైతం కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్య, పేద వర్గాల వారు విలవిల్లాడిపోతున్నారు. నగరంలోని 10 రైతుబజార్లకు నిత్యం 8వేల క్వింటాళ్లకు పైగా వచ్చే కూరగాయలు బుధవారం కేవలం 4వేల క్వింటాళ్లే వచ్చాయి. బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ హోల్‌సేల్ మార్కెట్లకు అన్నిరకాల కూరగాయల దిగుమతి తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం హోల్‌సేల్ మార్కెట్లకు 20వేల క్వింటాళ్లకు మించి సరుకు రాలేదని తెలిపారు. ఈ కొరత ప్రభావం క్రమేపీ ధరలపైపడుతూ ఐదు రోజులుగా కూరగాయల రేట్లు పెరగడం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఇలాగే కొనసాగితే... రానున్న రోజుల్లో కొన్ని రకాల కూరగాయలు కేజీ రూ.100లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెటింగ్ శాఖ ధరలు బోర్డులకే పరిమితం..
మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ధరలు రైతు బజార్లలో బోర్డులకే పరిమితమవుతున్నాయి. సమీప హోల్‌సేల్ మార్కెట్‌లో ఉన్న ధరలను బట్టి వ్యాపారులకు కొంత లాభం వచ్చేలా మార్కెటింగ్ శాఖ రైతు బజార్లలో ధరలను నిర్ణయిస్తుంది. రైతు బజారులో అదే ధరకు కూరగాయలను రైతులు (వ్యాపారులు) విక్రయించాలి. అయితే ఇక్కడ బోర్డుల్లో ఉన్న ధర కంటే కిలోకు అయిదు నుంచి పది రూపాయల ఎక్కువ ధరలకు రైతు బజార్లలో వ్యాపారులు కూరగాయలను అమ్ముతున్నారు. ఎస్టేట్ ఆఫీసరుకు ఫిర్యాదు చేస్తామని వినియోగదారులు చెప్పినా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు.
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు...
ఇతర ప్రాంతాల నుంచి సరుకు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే నగరమంతా అదే పరిస్థితి ఉండాలి. కానీ నగరంలో ఒక ప్రాంతానికీ, మరో ప్రాంతానికి మధ్య కూరగాయల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ‘‘నిజంగా బయట నుంచి సరుకులు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే రైతు బజార్లలోనూ భారీగా ధరలు పెరగాలి. అయితే రైతు బజార్లలో కొంత మేరకే ధరలు పెరిగి బయట మార్కెట్‌లో ఎక్కువ పెరిగింది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడమే కారణం. ఈ వ్యవహారాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణం’’ అని అధికారులే అంటున్నారు.
గతంలో కూరగాయల ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతు బజార్లలో సరసమైన ధరలకు కూరగాయలను సరఫరా చేసేది. మార్కెటింగ్ శాఖకు ఇందుకోసం నిధులు కేటాయించేది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రులు సచివాలయానికే రావడంలేదని, అధికార యంత్రాంగం నిద్రపోతోందని, దీంతో కూరగాయల వ్యాపారులకు కళ్లెం వేసేవారే లేరన్న విమర్శలు ఉన్నాయి. ‘‘అన్ని ధరలూ ఇలా పెరిగిపోతే జనం ఏమి తిని బతకాలి. రూ. 300 తీసుకొస్తే వారానికి సరిపడా కూరగాయలు రావడంలేదు. ఇలాగైతే జనం బతికేదెలా? ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడంలేదు. మంత్రులు వారి సంపాదన గురించి తప్ప జనం ఇబ్బందులను పరిష్కరిద్దామని ఆలోచించడంలేదు’’ అని విజయనగర్ కాలనీకి చెందిన విమల ఆగ్రహం వ్యక్తం చేశారు.