సారీ.. నో ఆనియన్‌ ! | No Onion Board In Restaurants Due To Onion Price Hike | Sakshi
Sakshi News home page

సారీ.. నో ఆనియన్‌ !

Published Tue, Dec 10 2019 9:28 AM | Last Updated on Tue, Dec 10 2019 9:28 AM

No Onion Board In Restaurants Due To Onion Price Hike - Sakshi

సాక్షి,  సనత్‌నగర్‌ : ఉల్లి.. ఇటు వంటింట్లోనే కాదు అటు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ కొండెక్కి కూర్చుంది. ధరలో సెంచరీ దాటేసిన దీనిని పట్టుకునేందుకు ఎవరి తరమూ కావట్లేదు. ఇప్పటికే ఇళ్లల్లో చాలా మటుకు ఉల్లికి స్వస్తి పలకగా, ఆ దిశగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు సైతం పయనిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు ఏకంగా బిర్యానీలో ఉచితంగా ఇచ్చే ఆనియన్‌ సలాడ్‌కు ప్రత్యేక రేటు నిర్ణయించేశాయి. మరికొన్ని మొత్తంగా ఉల్లికి టాటా చెప్పేసి కీర, క్యారెట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేస్తున్నాయి. ఇక పలు హోటళ్లలో ఆనియన్‌ దోశ ఊసే ఎత్తడం లేదు. కొన్ని రోజుల పాటు ఉల్లితో ముడిపడి ఉన్న ఆహార పదార్థాలకు తాత్కాలిక బ్రేక్‌ వేస్తే మంచిదన్న అభిప్రాయానికొచ్చేశారు. ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్‌ వరకు.. హోటల్, రెస్టారెంట్‌ వంటకాలు ఎక్కువగా ఆనియన్‌తో ముడిపడి ఉంటాయి. ఆహార ప్రియులు ఎక్కువగా ఆనియన్‌ తెప్పించుకుని మరీ తమకిష్టమైన వంటకాలతో కలిపి భుజించడం షరామామూలు. ఇక బిర్యానీకి ఆనియన్‌ కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఉల్లి ధరలు కొండెక్కి కూర్చోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వాటి వాడకాన్ని తగ్గించేశారు. ఇక అంతగా వినియోగదారులను పోగొట్టుకోవడం ఇష్టం లేక అంతగా అవసరమైతే కొసరి కొసరి అందిస్తున్నారు. అది కూడా ఆనియన్‌ దోశ అయితేనే. బిర్యానీ, చపాతి, పరోటా ఇలా తదితర వంటకాల్లో ఉచితంగా ఇచ్చే ఆనియన్‌కు దాదాపుగా గుడ్‌బై చెప్పేశారు. ఇక ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో అయితే ఉల్లి ప్రసక్తే లేకుండాపోయింది.

మలక్‌పేట మార్కెట్‌కు 18 వేల సంచులు 
చాదర్‌ఘాట్‌: కొండెక్కిన ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని మార్కెట్‌ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.రవికుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లి ధరలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్నూలు, కర్ణాటక, మహబూబ్‌నగర్‌ల నుంచి మలక్‌పేట మార్కెట్‌కు సోమవారం 18 వేల బ్యాగులు వచ్చాయన్నారు. క్వింటాకు రూ.4వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతున్నట్లు చెప్పారు. కిలో ఉల్లి రూ.60 నుంచి 80 వరకు మార్కెట్‌లో లభ్యమవుతోందన్నారు. ఈజిప్ట్‌ నుంచి ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రానికి వెయ్యి క్వింటాళ్ల ఉల్లి దిగుమతి కానున్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్, గ్రేడ్‌ 3 సెక్రటరీ నరేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉప్మా దోశకు డిమాండ్‌..  
పెరిగిన ఆనియన్‌ ధరలు ఉప్మా దోశకు డిమాండ్‌ను పెంచాయి. దోశలో ఏదో ఒకటి మిక్స్‌ చేసి తింటే గానీ మజా ఉండదని ఆహారప్రియులు చెప్పేమాట. ఈ క్రమంలో ఉల్లికి బదులుగా ఉప్మాను జత చేసి హోటల్‌ నిర్వాహకులు అందిస్తున్నారు. ఉప్మా దోశ సాధారణమే అయినప్పటికీ ఉల్లి పెరుగుదలతో ఎక్కువ మంది మెనూలో ఉప్మా దోశ
చేరిపోయింది. 

కీర, క్యారెట్‌తో సరి.. 
ఒకప్పుడు ఉల్లి కంటే కీర, క్యారెట్‌ల ధర ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. క్యారెట్, కీరల కంటే ఉల్లి డబుల్, త్రిపుల్‌ స్థాయిలో పెరగడంతో బిర్యానీ హోటళ్లు ఇప్పుడు ఆనియన్‌ను పక్కనపెట్టేశాయి. దీని స్థానంలో కీరను అందిస్తుండగా.. మరికొన్ని హోటళ్లు దానికి క్యారెట్‌ కూడా జతచేసి అందిస్తున్నాయి. చిన్న చిన్న హోటళ్ల దగ్గర నుంచి బడా రెస్టారెంట్ల వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద మొత్తంలోఆనియన్‌ తెచ్చి ఉచితంగా అందించే పరిస్థితి లేదని, ఒకప్పుడు సిల్వర్‌గా భావించే ఉల్లి ఇప్పుడు బంగారం సరసన చేరిపోయిందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆచితూచి కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 

ఆనియన్‌ దోశ ఆపేశాం.. 
గతంలో బిర్యానీ, చపాతీ, పరోటా తదితర వంటకాలతో పాటు ఆనియన్‌ కూడా ఇచ్చేవాళ్లం. ధరలు పెరిగినప్పటి నుంచి ప్రస్తుతం ఆనియన్‌ను ఆపేశాం. ఈ పరిస్థితిని కస్టమర్లు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక ఆనియన్‌ దోశ అడిగినప్పుడు ఉప్మా దోశ గానీ లేక ప్లేన్‌ దోశ గానీ తీసుకోమని చెబుతున్నాం. కస్టమర్‌ పట్టుబడితే తప్ప ఆనియన్‌ దోశకు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు.
– శ్రీనివాస్, అభి టిఫిన్స్, వివేకానందనగర్‌ 

రూ.4వేల భారం.. 
మొన్నటివరకు హోల్‌సేల్‌గా క్వింటాల్‌ ఉల్లిపాయలను వెయ్యి రూపాయలకు తీసుకునేవాణ్ణి. ప్రస్తుతం పెరిగిన ధరతో అదే క్వింటాల్‌ ఉల్లిపాయలను రూ.10 వేలకు తీసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రస్తుతం కస్టమర్లను పోగోట్టుకోవడం ఇష్టం లేక 50 కిలోలు మాత్రమే తీసుకుంటున్నాను. అయినా నాలుగు వేల రూపాయలకుపైగా భారం పడుతోంది. ధరలు పెంచితే వినియోగదారులు ఎక్కడ దూరం అవుతారోనని ఆ ఊసే ఎత్తడం లేదు.  
– వీరేశప్ప, ఉడిపి గ్రాండ్‌ హోటల్, కూకట్‌పల్లి  

వినియోగదారులు అర్థం చేసుకోవాలి.. 
మార్కెట్‌క వెళితే కిలో రూ.140 ఉండడంతో వెనక్కి తిరిగివచ్చేశాం. కొన్ని రోజులు ఆనియన్‌ దోశను ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకే హోటల్‌కు వచ్చిన కస్టమర్లకు ప్లేన్‌ దోశ, ఉప్మా దోశను మాత్రమే అందిస్తున్నాం. వినియోగదారులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ఉల్లి దోశ జోలికి వెళ్లడం లేదు. ప్రజలు కూడా ఉల్లి వాడకాన్ని
కొద్ది రోజులు నిలిపి చేస్తే ధరలు దిగి దిగి వస్తాయనే విశ్వసిస్తున్నాం.   
– భవాని, ఇడ్లీ ప్యూర్‌ వెజ్‌ అండ్‌ రెస్టారెంట్‌ 

కాసిన్ని తక్కువ ఇస్తున్నాం.. 
మార్కెట్‌లో ఉల్లి ధరలు చూస్తుంటే మతిపోతోంది. కానీ కస్టమర్లకు ఇవ్వక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చినన్ని కాకపోయినా ఇప్పుడు కాస్త తక్కువ చేసి ఇస్తున్నాం. కొంత మంది కస్టమర్లు మళ్లీ కావాలని అడుగుతున్నారు. ధరలు తగ్గితే బాగుంటుంది. ఇవే ధరలు కొనసాగితే ఉల్లి లేకుండానే వంటలు చేయాల్సి వస్తుంది. 
– కుసుమ, చంద్రహవేలిహోటల్‌ నిర్వాహకురాలు, జూబ్లీహిల్స్‌ 

క్యాబేజీ తురుము.. క్యారెట్‌ ముక్కలు 
బంజారాహిల్స్‌: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లిగడ్డ పకోడీలో ఉల్లికి బదులు క్యాబేజీ, కాలిఫ్లవర్‌ వాడుతున్నారు. కట్‌మిర్చికి ఉల్లిపాయలు ఇవ్వడం మానేశారు. బిర్యానీ పక్కన కీర, నిమ్మకాయ ముక్కలు పెడుతున్నారు. ఇక కొన్ని హోటళ్లలో తమవద్ద ఉల్లిపాయలు లభించవని బోర్డులు ఏర్పాటు చేశారు. 

బిర్యానీ ముద్ద దిగడం లేదు
బిర్యానీలోకి ఆనియన్‌ అడిగితే క్యాబేజీ తురుముతో పాటు కీరదోస ముక్కలు ఇస్తున్నారు. ఆనియన్‌ లేకపోతే బిర్యానీ తినడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో బిర్యానీ తినలేక రోటీ తిని పోవాల్సి వస్తోంది. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఇస్తామని చెబుతున్నా ఆనియన్‌ సలాడ్‌ మాత్రం ఇవ్వడం లేదు.
– సాయి, కృష్ణానగర్‌


ఓ హోటల్‌లో ఆనియన్‌ సలాడ్‌కు రూ.25 చెల్లించాలని పెట్టిన బోర్డు 

తక్కువ ఇస్తున్నారు..
రెస్టారెంట్లలో ఏది ఆర్డర్‌ చేసినా సలాడ్‌లో ఉల్లిపాయ ముక్కలు తక్కువగా ఇస్తున్నారు. మళ్లీ కావాలని అడిగినా స్పందించడం లేదు. చాలీచాలని ఉల్లిపాయలతో కాస్త అసంతృప్తిగానే కడుపు నింపుకోవాల్సివస్తోంది. బయట మార్కెట్‌లో ఉల్లి ధరల ప్రభావం ఇంట్లో ఉండేవారితో పాటు మాలాగే రెస్టారెంట్లకు వచ్చేవారికి కూడా కనిపిస్తోంది.  – శ్రీశైలం, జూబ్లీహిల్స్‌ 

మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాం.. 
ఆనియన్‌ లేదని కస్టమర్లకు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాం.. బోర్డులు కూడా పెట్టేశాం. బిర్యానీలో ఉల్లిపాయలకు బదులుగా కీరదోస ముక్కలను అందిస్తున్నాం. గత 15 రోజుల నుంచే ఇదే తరహాలో మా కస్టమర్లను బుజ్జగించాల్సి వస్తోంది. కొంత మంది ఆనియన్‌ లేదంటే బిర్యానీ తినకుండానే వెళ్లిపోతున్నారు.. – వాజిద్, గ్రీన్‌ బావర్చి హోటల్‌ యజమాని, కృష్ణానగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement