బిర్యానీకి ప్రత్యేకం.. ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ
గ్రేటర్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు పెరగడంతో జోరుగా విక్రయాలు
రోజుకు 12 వేల క్వింటాళ్ల బాస్మతి బియ్యం వినియోగం
ఎగుమతులు తగ్గడంతో సాధారణ బియ్యం ధరకే అందుబాటులో..
సాక్షి హైదరాబాద్: ఒక్కప్పుడు నవాబులు, ధనికుల ఇళ్లల్లో బాస్మతి బియ్యం వినియోగించేవారు. ఇప్పుడు ధరలు అందుబాటులోకి రావడంతో దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బాస్మతిని వినియోగిస్తున్నారు. నాడు బిర్యానీకే పరిమితంకాగా, ఇప్పుడు అన్ని రకాల వంటకాల్లో వినియోగిస్తున్నారు. మొదటి రకం సాధారణ బియ్యం కిలో ధర దాదాపు రూ. 70–80 ఉంది. అదే బాస్మతి హోల్‌సేల్ ధర కూడా దాదాపు అంతే. దీంతో నగరంలో బాస్మతి బియ్యం వినియోగం ఎక్కువైంది. గతంలో బిర్యానీ కోసం బాస్మతిని తప్పక వాడేవారు.
కానీ, నేడు బగారా, పల్వా, లెమన్, కిచిడి, జీరా రైస్‌తోపాటు అన్ని రకాల వంటకాల్లో బాస్మతిని వినియోగిస్తున్నారు.
ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ
ధరలు తగ్గడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల మార్కెట్‌లకు భారీ ఎత్తున బాస్మతి బియ్యం దిగుమతి అవుతోంది. బాస్మతి వరి పండే ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి భారీగా దిగుమతులు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్లన్నీ కూడా బాస్మతిని ఈ మార్కెట్‌ల నుంచే కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా, ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. రిటైల్ మార్కెట్‌లో స్టీమ్ కేజీ బాస్మతి బియ్యం రూ.50 నుంచి రూ.65 వరకు లభిస్తున్నాయి. అదే రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.80–110 వరకు ధర పలుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పండే బాస్మతి వినియోగం ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తక్కువ. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ బాస్మతికి హబ్‌గా మారింది. దేశంలో ఢిల్లీ తరువాత గ్రేటర్‌లోనే ఎక్కువ వినయోగం ఉందని బేగంబజార్ వ్యాపారులు చెబుతున్నారు.
సాధారణ బియ్యం ధరకే బాస్మతి
బాస్మతి ఎక్కువగా పంజాబ్‌లో పండిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బియ్యం వినియోగం తక్కువ.. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. దీంతో హైదరాబాద్‌లో వినియోగం ఎక్కువ. మరోవైపు బాస్మతిని బిర్యానీలో తప్పక వినియోగిస్తారు. అయితే కోవిడ్ తరువాత బాస్మతి ఎగుమతులు అంతగా లేవు. దీంతో ధరలు చాలా కిందికి దిగి వచ్చాయి. సాధారణ బియ్యం ధరలకే బాస్మతి మార్కెట్‌లో లభిస్తోంది.
– రాజ్‌కుమార్ ఠాండన్, కశ్మీర్‌హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్
Comments
Please login to add a commentAdd a comment