వావ్‌ బాస్మతి.. బిర్యానీ రైస్‌కు భలే క్రేజ్‌ | Basmati Rice Has Very High Demand In Hyderabad | Sakshi
Sakshi News home page

వావ్‌ బాస్మతి.. బిర్యానీ రైస్‌కు భలే క్రేజ్‌

Dec 29 2020 8:41 AM | Updated on Dec 29 2020 8:59 AM

Basmati Rice Has Very  High Demand In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిర్యానీ అంటేనే బాస్మతి రైస్‌...బాస్మతి రైస్‌ ఉంటేనే బిర్యానీ. చికెన్‌..మటన్‌..వెజ్‌..వెరైటీ ఏదైనా బాస్మతీ రైస్‌తో చేస్తేనే ఆ బిర్యానీకి ఘుమఘుమలాడే వాసన..అద్భుతమైన రుచీ వస్తుంది. ఉత్తరాదిలో పండించే ఈ రకం బియ్యానికి గ్రేటర్‌ వాసులు ఫిదా అవుతున్నారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లు, హోటళ్లు, ఫుడ్‌సెంటర్లు, ఇళ్లల్లోని వారు రోజుకు దాదాపు 12 వేల క్వింటాళ్ల బాస్మతీ బియ్యాన్ని కొంటున్నారంటే..ఇక్కడ ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కప్పుడు నవాబులు, సంపన్నుల ఇళ్లల్లో బాస్మతిని వినియోగించే వారని చెప్పేవారు. ప్రస్తుతం ధరలు అందుబాటులోకి రావడంతో అన్ని వర్గాల ప్రజలు ఈ రైస్‌ను వంటకాల్లో వినియోగిస్తున్నారు. గతంలో బిర్యానీకే పరిమితమైన బాస్మతి బియ్యం నేడు అన్ని రకాల వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇతర దేశాలకు ఎగుమతులు భారీగా తగ్గాయి. దీంతో సాధారణ బియ్యం ధరకే ఇక్కడ విక్రయిస్తున్నారు. వినియోగమూ ఎక్కువైంది.

ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ 
గ్రేటర్‌లో వివాహాలు, వేడుకలు పెరగడంతో బాస్మతిని రికార్డు స్థాయిలో వినియోగిస్తున్నారు. ధరలు తగ్గడంతో జంటనగరాల మార్కెట్లకు భారీ ఎత్తున బాస్మతి బియ్యం దిగుమతి అవుతోంది. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్‌ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్‌ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్ల నిర్వాహకులు ఈ మార్కెట్‌ల నుంచే బాస్మతి రైస్‌ను కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు. ఇక సాధారణ జనం సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్, ఆన్‌లైన్‌లోనూ బాస్మతి రైస్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు లభ్యమవుతుండడంతో ఇళ్లల్లోనూ చికెన్, మటన్‌ బిర్యానీలకు దీన్ని వినియోగిస్తున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా..ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.   పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది.  రిటైల్‌ మార్కెట్‌లో స్టీమ్‌ కేజీ బాస్మతి బియ్యం రూ.50 నుంచి రూ.65 వరకు లభిస్తున్నాయి. రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.80–110 వరకు ధర పలుకుతుంది.ఉత్తరాది రాష్ట్రాల్లో పండే బాస్మతికి ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో వినియోగం తక్కువ.  దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్‌ నగరం బాస్మతికి హబ్‌గా మారింది. దేశంలో ఢిల్లీ తర్వాత  గ్రేటర్‌లో ఎక్కువగా వినియోగం ఉందని బేగంబజార్‌ వ్యాపారులు చెబుతున్నారు.  

 

బాస్మతి ఎక్కువగా పంజాబ్‌లో పండిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బియ్యం వినియోగం తక్కువ. హైదరాబాద్‌ బిర్యానీకి ఫేమస్‌. దీంతో కూడా ఇక్కడ వినియోగం ఎక్కువైంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇతర దేశాలకు ఎగుమతులు అంతగాలేవు. దీంతో ధరలు చాలా తగ్గాయి. మామూలు రైస్‌ రేట్లకే బాస్మతి రైస్‌ను విక్రయిస్తున్నాం.  
– రాజ్‌కుమార్‌ టాండన్, కశ్మీర్‌‌ హౌస్‌ నిర్వాహకుడు, బేగంబజార్‌    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement