న్యూఢిల్లీ: ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్‌లో 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్‌లో 5.54 శాతంగాను, డిసెంబర్‌లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని తాకడం ఇదే ప్రథమం.
రెండు శాతం అటూ, ఇటూగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్‌కు ప్రభుత్వం నిర్దేశించింది. కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆర్‌బీఐ .. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలనే పరిగణనలోకి తీసుకుంటుంది. ధరల పెరుగుదల భయాల కారణంగానే.. గత డిసెంబర్‌లో జరిగిన పరపతి విధాన సమీక్షలో మరో విడత వడ్డీ రేట్లను తగ్గించకుండా ఆర్‌బీఐ కాస్త విరామమిచ్చింది. ఫిబ్రవరి 6న తదుపరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది.
ఈ తరుణంలో నిర్దేశించుకున్న స్థాయికి మించి ద్రవ్యోల్బణ గణాంకాలు నమోదు కావడంతో రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లపై తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రవ్యోల్బణ గణాంకాలకు సంబంధించి మరిన్ని
వివరాలు చూస్తే..
► 2018 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో కూరగాయల ధరలు అత్యధికంగా 60.5 శాతం ఎగిశాయి.
► మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతం పెరిగింది. 2018 డిసెంబర్‌లో ఇది మైనస్ 2.65 శాతంగా ఉండగా, గతేడాది నవంబర్‌లో 10.01 శాతంగా ఉంది.
► పప్పుల ధరలు 15.44 శాతం, మాంసం.. చేపల రేట్లు 10 శాతం పెరిగాయి.
రేట్ల కోతకు మరింత విరామం..
ఇప్పటికే ఎకానమీ మందగమనంలో ఉన్న తరుణంలో ద్రవ్యోల్బణం కూడా ఎగియడం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత తగ్గించడానికి ఆస్కారం లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఇది స్టాగ్‌ఫ్లేషన్ (అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన పరిస్థితి)కి దారి తీయొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2020 ఆఖరు త్రైమాసికం దాకా రిజర్వ్ బ్యాంక్ మరో దఫా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జనవరిలో ద్రవ్యోల్బణం గణాంకాలు గణనీయంగా కరెక్షన్‌కు లోను కావొచ్చని, అయినప్పటికీ ఆర్‌బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు కొన్నాళ్ల పాటు విరామం తప్పకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.
బాబోయ్ ధరలు!
Published Tue, Jan 14 2020 5:58 AM | Last Updated on Tue, Jan 14 2020 5:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment