న్యూఢిల్లీ: ఆహార ధరలు ఇటు రిటైల్‌గానూ, అటు టోకుగానూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం జూలైకి సంబంధించి సోమవారం వెలువరించిన గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44%గా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.
సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4% వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6% అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్స్‌గా పరిగణించాల్సి ఉంటుంది. తాజా సమీక్షా నెలలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71% ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. 2022 ఏప్రిల్‌లో 7.79% రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆ స్థాయికి మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఫుడ్ బాస్కెట్ 11.51 శాతం అప్
వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51 %గా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 4.55 శాతం. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలైలో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13% పెరిగినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది.
టోకు సూచీ మైనస్ 1.36 శాతం...
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో వరుసగా నాల్గవనెల మైనస్‌లోనే కొనసాగింది. టోకు సూచీ బాస్కెట్ మొత్తంగా చూస్తే జూలై ధరలు అసలు పెరగకపోగా మైనస్ 1.36 శాతంగా నమోదయ్యింది. ఈ ధోరణిని ప్రతి ద్రవ్యోల్బణంగా పరిగణిస్తారు. కాగా, సూచీలో కీలక విభాగమైన ఫుడ్ బాస్కెట్‌లో ధరల స్పీడ్ మాత్రం ఏకంగా 14.25% ఎగసింది (గత ఏడాది జూలై ధరలతో పోలి్చ). ఒక్క కూరగాయల ధరలు భారీగా 62.12% ఎగశాయి. తృణ ధాన్యాలు, పప్పు దినుసుల ధరలు వరుసగా 8.31%, 9.59% చొప్పున పెరిగాయి. ఇక మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, కెమికల్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్, జౌళి ధరలు మాత్రం తగ్గాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదే ధోరణిలో ఆహార ధరలు పెరిగితే, టోకున ధరలు ప్రతి ద్రవ్యోల్బణం నుంచి ద్రవ్యోల్బణం బాటకు మారతాయని కేర్‌ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment