
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు రాష్ట్రంలో ఉల్లి ధరలపై రాజకీయాలు ఘాటెక్కాయి. ఉల్లి ధరల పెరుగుదలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఉల్లిగడ్డలతో తయారుచేసిన దండను చేపట్టి తేజస్వి యాదవ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగ సమస్యలతో సామాన్యుడు సతమతమవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, యువత, వ్యాపారులు ఆహారంపై ఖర్చును భరించే స్థితిలో లేరని, చిరు వ్యాపారులను బీజేపీ దెబ్బతీసిందని తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు.
ఉల్లి దండలతో నిరసన తెలుపుతున్న ఫోటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఉల్లి ధర 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉండగా ఉల్లి గురించి మాట్లాడిన వారంతా ఇప్పుడు కిలో 80 రూపాయలు దాటడంతో మౌనం దాల్చారని అన్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలను యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చిన తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఉపాథి కల్పన కీలక అంశమని పునరుద్ఘాటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.