ఉల్లి.. దిగిరావే తల్లీ! | Onion Prices Hikes Record Place in Hyderabad market | Sakshi
Sakshi News home page

ఉల్లి.. దిగిరావే తల్లీ!

Published Tue, Dec 3 2019 11:26 AM | Last Updated on Tue, Dec 3 2019 11:26 AM

Onion Prices Hikes Record Place in Hyderabad market - Sakshi

ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కొండెక్కి కూర్చొని దిగిరానంటోంది. దీని ధర రోజురోజుకు పరుగులు తీస్తోంది. బహిరంగ మార్కెట్‌లో సెంచరీ కొట్టేసింది. ఫలితంగా నగరవాసికి కూరలో ఉల్లిగడ్డ కరువైంది. నగరానికి డిమాండ్‌కుసరిపడా దిగుమతి లేకపోవడంతో ధర అమాంతం పెరిగింది. కొంతఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీపై కిలో రూ.40కి విక్రయిస్తోంది. అయితే ఆయా కౌంటర్లకూ డిమాండ్‌కు సరిపడా దిగుమతి లేదు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గడమేఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు.  

సాక్షి,సిటీబ్యూరో/చాదర్‌ఘాట్‌: కూరల్లో వాడే ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది.కొందామంటే కొండెక్కి కూర్చొంది. బంగారం ధర తరహాలో ఉల్లి ధర పరుగులు తీస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో ధర వంద రూపాయలకు చేరువైంది. ఉల్లి నాణ్యతను బట్టి ధర మరింత ఎగబాగుతోంది. సోమవారం మార్కెట్‌లో హోల్‌సేల్‌ కొత్త ఉల్లి ధర కిలో రూ. 85 పలికింది. మార్కెటింగ్‌ శాఖ రైతు బజార్ల ద్వారా ఒక్కొక్కరికి కిలో చొప్పున సబ్సిడీపై కిలో రూ.40 చొప్పున పంపిణీ చేస్తోంది. దీనికోసం కనీసం మూడు గంటలకు పైగా లైన్లో నించోవాల్సి వస్తోంది. అప్పుడైనా దొరుకుతుందా? అంటే అనుమానమే. అది కూడా నాసిరకం ఉండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఉల్లి ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కానరావడం లేవు.

తగ్గిన సాగు విస్తీర్ణం

సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ఈ ప్రభావం తీవ్రంగా పడింది. వాస్తవంగా ఈపాటికి హైదరాబాద్‌ మలక్‌పేట మార్కెట్‌లో  తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజారత్‌  ఉల్లి పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కానీ,గత మూడేళ్లుగా ఉల్లి ధరకు డిమాండ్‌ లేని కారణంగా సాగు విస్తీర్ణం 60 శాతానికి తగ్గు ముఖం పట్టింది. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు సగం పంట దెబ్బతింది. దీంతో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి పాత ఉల్లిగడ్డ మాత్రమే మార్కెట్‌కు తరలి వస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజారత్‌లో ఉల్లి పంట రెండో దశలో ఉంది. చేతికి వచ్చేనాటికి సంక్రాంతి కావచ్చు. ఆ తర్వాత ఉల్లి లభ్యత మార్కెట్‌లో పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉల్లి తిప్పలు తప్పనట్లు తెలుస్తోంది.

నిత్యం పదివేల క్వింటాళ్ల పైనే..
హైదరాబాద్‌ మహానగరానికి ప్రతి నిత్యం పదివేల క్వింటాళ్ల  ఉల్లి డిమాండ్‌ ఉంటుంది. మొన్నటి వరకు డిమాండ్‌కు తగ్గ ఉల్లి చాదర్‌ఘాట్‌ మార్కెట్‌కు వచ్చినప్పటికి సోమవారం ఒకేసారి తగ్గుముఖం పట్టింది. కేవలం 7416 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరుకు రాకపోవడంతో ఉల్లి ధర మరింత పెరిగినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై రూ.40 చొప్పున విక్రయిస్తోంది. నగరంలోని 12 రైతు బజార్లకు కలిపి 8 నుంచి 10 టన్నుల వరకు  సరఫరా చేయడం ఏమూలకూ సరిపోవడం లేదు. మరోవైపు రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లి దొరకడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా ఉన్న ఉల్లిగడ్డలనే సబ్సిడీపై విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

బహిరంగ మార్కెట్లో
నాణ్యమైన ఉల్లి బహిరంగ మార్కెట్లో  భాగనే ధర పలుకుతోంది. హైదరాబాద్‌ మలక్‌పేట మార్కెట్‌లో సోమవారం  గ్రేడ్‌ వన్‌ నాణ్యమైన  ఎండిన పెద్ద ఉల్లి గడ్డ కిలోధర రూ.103 పలిగింది. బహిరంగ మార్కెట్‌లో  రూ.110 నుంచి రూ.115 వరకు పలుకుతుండగా, ముఖ్యంగా సూపర్‌ మార్కెట్లలో కిలో రూ. 119 నుంచి రూ. 130 వరకు విక్రయిస్తున్నారు.    గ్రేడ్‌–2 పచ్చి ఉల్లిగడ్డ బహిరంగ మార్కెట్‌లో రూ. 90 నుంచి 100ల వరకు పలుకుతుంది. కొందరు వ్యాపారులు నాసిరకం ఉల్లిగడ్డకు కూడా ఇదే ధర వర్తింపజేస్తున్నారు.

హోటళ్లలో తగ్గిన వినియోగం..
ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో హోటళ్లలో ఉల్లి వినియోగం తగ్గింది. హోటళ్లలో ఉల్లిదోశలో పూర్తిగా ఉల్లి తగ్గుముఖం పట్టింది. కొన్ని హోటల్స్‌లో ఉల్లిదోశకు ఆర్డర్‌ ఇచ్చినా ఠక్కున లేదనే సమాధానం వస్తోంది. ధర మండుతుండటంతో  వ్యాపారులు ఉల్లి కొనుగోలు తగ్గించేశారు. ఇక పూరీకి అయితే ఉల్లి కూరకు బదులు క్యాబేజీ వండుతున్నారు.  బిర్యానీ ఆర్డర్‌ ఇస్తే ఉల్లిముక్కలు తగ్గించారు. పానీపూరి వ్యాపారుల పరిస్థితి వర్ణనాతీతం. ఉల్లి లేకుండా పానీపూరి తినడం కష్టం. ఉల్లిగడ్డలు లేని కారణంగా చాలామంది తినకుండా వెనక్కి వెళ్లిపోతున్నారని పానీపూరి వ్యాపారులు చెబుతున్నారు.

500 మెట్రిక్‌ టన్నులురావొచ్చు
ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధర పెరిగింది. భారత ప్రభుత్వం ఉల్లి కొరత అధిగమించేందుకు ఈజిప్టు నుంచి తెప్పించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి 500 మెట్రిక్‌ టన్నుల ఉల్లి రావచ్చు.వాటిని రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందిస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.    – జీ. లక్ష్మిబాయి, డైరెక్టర్, మార్కెటింగ్‌ శాఖ,

మేడిపల్లిలో : మేడిపల్లిలోని రైతు బజార్‌లో మూడు రోజుల క్రితం ఉల్లి సబ్సిడీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. రూ.40 కు కిలో చొప్పన ఒక్కొక్కరికి ఒక్క కిలో మాత్రమే అందచేస్తున్నారు. వచ్చిన గంటల్లోన్లే ఉల్లిగడ్డ అయిపోతుంది. మరిన్ని కౌంటర్లు  ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సబ్సిడీకౌంటర్లలో..గగ్గోలు
మీర్‌పేట:  మీర్‌పేట రైతుబజార్‌లో గత శుక్రవారం ఉల్లి విక్రయ సబ్సిడీ కౌంటర్‌ను ప్రారంభించినా.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్సిడీ కౌంటర్‌లో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో వెలవెలబోయింది.  సబ్సిడీ ద్వారా తక్కువ ధరకు ఉల్లిని విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న బడంగ్‌పేట, మీర్‌పేట పరిసర ప్రాంతాల వాసులు రైతుబజార్‌కు రాగా ఉల్లి అందుబాటులో లేదని తెలియడంతో   నిరాశతో వెనుదిరిగారు.  అధికారులు 5 గంటల తరువాత ఉల్లిని తీసుకొచ్చినప్పటికీ నాసిరకంగా ఉండడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉల్లి ఇలా..
తెలంగాణలో 14,273 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, ఈసారి 5417 ఎకరాల విస్తీర్ణంలోనే సాగైంది.
మలక్‌పేట మార్కెట్‌కు గతేడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు  19,56,000 క్వింటాళ్ల ఉల్లి రాగా, ఈసారి 18,66,000 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చింది. దీని బట్టి 90 వేల క్వింటాళ్ల ఉల్లి తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది.
కేవలం నవంబర్‌ మాసం  పరిశీలిస్తే  గతేడాది మూడు లక్షల ఏడువేల క్వింటాళ్లు రాగా, ఈసారి మాత్రం మూడు లక్షల  34 వేల క్వింటాళ్లు వచ్చింది. దీంతో గత నెల 27వేల క్వింటాళ్లు అధింగానే వచ్చినట్లయింది. ధర మాత్రం బాగానే పెరిగింది.
తాజాగా ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో వ్యాపారులంతా ఉల్లిని డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ఉల్లిగడ్డకు విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది.  
రోజుకు 120 లారీలకుపై గా వచ్చే ఉల్లి.. ఇప్పుడు కేవలం 80 లారీలకే పరిమితమైంది.  
ఇదీ ఉల్లి లెక్క (సగటున)  10వేల క్వింటాళ్లు
నగరంలో ప్రతిరోజు డిమాండ్‌  8వేల క్వింటాళ్లు
రోజూ దిగుమతి 810 టన్నులు
నగరంలోనిరైతుబజార్లు  12

కేంద్రానికి ఫుల్‌ డిమాండ్‌
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన సబ్సిడీ ఉల్లి కేంద్రానికి వినియోగదారుల నుంచి మంచి డిమాండ్‌ నెలకొంది. గత నెల 28న రైతుబజార్‌లో ఈ సబ్సిడీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విక్రయ కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.100ల వరకు పలుకుతుండడంతో రైతుబజార్‌లో సబ్సిడీ కింద కిలో రూ.40లకు విక్రయిస్తుండడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. కాగా ఈ రైతుబజార్‌లో రోజుకు 4 క్వింటాళ్ల వరకు విక్రయం సాగుతున్నట్లు ఎస్టేట్‌ అధికారి ముజీబుద్దీన్‌ ఖాన్‌ తెలిపారు. కాగా ఏదేనీ గుర్తింపు కార్డు తెచ్చిన వారికి ఒక్కొక్కరికి కిలో మాత్రమే అందజేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement