internal strife
-
Lok sabha elections 2024: మళ్లీ ఇందిర
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్‌లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు... ‘జనతా’ బలహీనత ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్‌ని చరణ్ సింగ్ (లోక్‌దళ్), బాబూ జగ్జీవన్‌రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే. ఆనియన్ ఎలక్షన్ హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం! కాంగ్రెస్‌లో మరో చీలిక 1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర! విశేషాలు... ఇందిర దారుణహత్య ► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది. ► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. ► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ► బింద్రన్‌వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు. ఏడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పార్టీ స్థానాలు కాంగ్రెస్ 353 జనతా (ఎస్) 43 సీపీఎం 39 జనతా పార్టీ 31 డీఎంకే 16 కాంగ్రెస్(యూ) 13 సీపీఐ 10 ఇతరులు 28 స్వతంత్రులు 9 – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాళ్ల కలహాలే గెలిపిస్తాయి
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అంతర్గత కలహాలు కర్ణాటకలో తాము తిరిగి గెలిచేందుకు దోహదపడతాయని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు రాజకీయ ప్రత్యర్థులని, ఆ కూటమి విఫలమయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, జేడీఎస్‌లు ఎన్నికల సమయంలో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేశారు. ఇప్పుడు అగ్ర నేతల మధ్య సత్సంబంధాలతో వారు ఓటర్ల మద్దతు పొందలేరు. రెండు పార్టీల మధ్య అంతర్గత కలహాలు ఏర్పడతాయన్నది సుస్పష్టం’ అని అన్నారు. మూణ్నాళ్ల ముచ్చటే: సదానంద గౌడ కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మూడు నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగదని కేంద్రమంత్రి సదానందగౌడ జోస్యం చెప్పారు. ఇరు పార్టీలు అనైతిక పొత్తుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. -
యెమన్ నుంచి చెన్నైకి
చెన్నై, సాక్షి ప్రతినిధి:అంతర్గత పోరుతో అట్టుడికిపోతున్న యెమన్ దేశం నుంచి తమిళనాడుకు చెందిన కుటుంబాలు సురక్షితంగా చెన్నైకి చేరుకున్నాయి. శని వారం ఉదయం రెండు విమానాల్లో 46 కుటుంబాలు వారు చెన్నై విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రైలు, బస్సుల ద్వారా స్వస్థలాకు వెళ్లారు.యెమన్ దేశంలో ఇటీవల ప్రారంభమైన అంతర్గత యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలను నిలువునా హరించి వేస్తోంది. ఏ క్షణాన ఎటునుంచి బాంబులు పడతాయనే భయంతో వేలాది మంది భారతీయులు బతుకుతున్నారు. ఇందులో తమిళనాడుకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. యుద్ధం ప్రారంభం కాగానే ఆదేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని కొందరు సంప్రదించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులను సురక్షితంగా భారత్‌కు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. యెమన్లోని విమానాశ్రయం సైతం తీవ్రవాదుల స్వాధీనంలో ఉన్న కారణంగా భారతీయ విమానాలు అక్కడ దిగే పరిస్థితి లేదు. దీంతో అక్కడికి సమీపంలోని జీపొట్టి అనే విమానాశ్రయానికి భారత్ ఎయి ర్ ఇండియా విమానాలను పంపింది. అక్కడి భారత అధికారులు నౌకల ద్వారా జీపొట్టి విమానాశ్రయానికి, క్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నారు. రెండు యుద్ధవిమానాలు 350 మంది భారతీయులను ఎక్కించుకుని ముంబయి, కొచ్చిలకు శుక్రవారం చేర్చారు. ముంబయికు చేరుకున్న వారిలో తమిళనాడుకు చెందిన 46 మంది ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులుగా ఆప్కో అధికారులు వీరందరికీ స్వాగతం చెప్పి చెన్నై విమాన టిక్కెట్లను అందజేశారు. వీరిలో 37 మంది పురుషులు, 7 మంది స్త్రీలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరిలో 30 మందితో ముంబయిలో శనివారం తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరిన విమానం ఉదయం 7.30 గంటలకు చెన్నైకి చేరుకుంది. 16 మందితో బయలుదేరిన మరో విమానం ఉదయం 8 గంటలకు చెన్నైకి చేరుకుంది. వీరందరికీ చెన్నైలోనూ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎమన్దేశం నుంచి సురక్షితంగా బైటపడిన వారి బంధు మిత్రులు ఆనందభాష్పాలతో ఆలింగనం చేసుకున్నారు. క్షణ..క్షణం..భయం...భయం ః సోమసుందరం ఏ క్షణాన ఏమూల బాంబులు పడుతాయో అర్థంకాక భయంతో బతికామని తెన్కాశీకి చెందిన సోమసుందరం మీడియాతో చెప్పారు. యెమన్దేశం కొరోనాలోని ఒక కంపెనీలో తాను ఉద్యోగం చేస్తున్నానని, తాను పనిచేస్తున్న కంపెనీపై కూడా బాంబుల వర్షం కురియడంతో స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందిగా యాజమాన్యం చెప్పిందని తెలిపారు. అయితే ఎటువెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే మగ్గిపోయామని చెప్పారు. తినడానికి తిండికూడా దొరకని పరిస్థితిలో ఇరుగు పొరుగున ఉన్న తమిళులు ఆహారం పెట్టి ఆదుకున్నారని తెలిపారు. యుద్ద భయంతో కాలం వెళ్లదీస్తున్న అనేక తమిళ కుటుంబాలను రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పదిరోజులుగా నరకం: డాక్టర్ వాణీ వెంకటేశన్ యుద్ధం ప్రారంభమైన పదిరోజుల నుంచి నరకం అనుభవించామని డాక్టర్ వాణీ వెంకటేశన్ చెప్పారు. చెన్నై వెస్ట్ మాంబళానికి తాను భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి యెమన్‌లో నివశిస్తున్నామని తెలిపారు. తాను వైద్యవృత్తిని నిర్వహిస్తుండగా, తన భర్త వెంకటేశన్ ఒకోడా నగరంలోని ఒక కంపెనీలో అధికారిగా ఉన్నారని తెలిపారు. బాంబులు పడడం ప్రారంభమైన తరువాత ప్రాణభయంతో భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నామని, వారి సహకారంతో సురక్షితంగా చెన్నైకి రాగలిగామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
సీనియర్లపై భగ్గుమన్న ఆప్
యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్‌లపై ధ్వజం పార్టీని దెబ్బతీయాలని చూశారని తీవ్ర ఆరోపణలు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రయత్నించారని మండిపాటు న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత పోరు బహిరంగమైంది. పార్టీ సీనియర్లు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై ఇటీవల చర్య తీసుకున్న ఆప్ నాయకత్వం తాజాగా వారిపై తీవ్ర ఆరోపణలు చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి ఆ ఇద్దరినీ తొలగించడానికి కారణాలను అధికారికంగా వెల్లడించింది. యోగేంద్ర, ప్రశాంత్‌లతో పాటు శాంతి భూషణ్ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి కోసం కుట్రపన్నారని ఆరోపించింది. ఢిల్లీలో ప్రచారం చేయకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్యకర్తలను ప్రశాంత్ నిరుత్సాహపరిచారని విమర్శించింది. ఈమేరకు ఆప్ అగ్ర నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, పంకజ్గుప్తా, సంజయ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందుకే మార్చి 4న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వారిపై కఠిన చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. యాదవ్, ప్రశాంత్‌లను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల దృష్టిలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న అభిప్రాయంతోనే ఇంతవరకు ఈ కారణాలను వెల్లడించలేదన్నారు. అయితే మీడియా కథనాలతో పార్టీ నిర్ణయం అప్రజాస్వామికమన్న భావన కలుగుతున్నందు వల్ల అన్ని విషయాలను వెల్లడించక తప్పడం లేదన్నారు. ఎన్నికల్లో ఆప్ ఓడిపోవాలని, అప్పుడే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేలకు దిగుతారని భూషణ్ అన్నట్లు వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీకి 20-22 సీట్లే వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్నికలకు ముందు ఓ నేతతో ఆయన చెప్పినట్లు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ప్రశాంత్, యోగేంద్ర ఖండించారు. దీనిపై త్వరలోనే స్పందిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ మద్దతుదారులు గతంలోనూ తమపై ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. నేషనల్ కౌన్సిల్ పై దృష్టి ఈ నెల 28న జరగనున్న ఆప్ అత్యున్నత నిర్ణాయక విభాగం నేషనల్ కౌన్సిల్ భేటీపై ఆసక్తి నెలకొంది. పీఏసీ నుంచి యాదవ్, భూషణ్ తొలగింపు ఏకగ్రీవం కానందువల్ల తీవ్ర చర్చ జరగొచ్చు. హాజరు కానున్న సీఎం కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. -
‘కమలం’ దిద్దుబాట
కన్నడ తీర్పు ఎటువైపు? ' అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్ నేతలు ' మోడీ గాలితో బీజేపీలో కదనోత్సాహం ' రాష్ర్టమంతటా పుంజుకోని జేడీఎస్ వి. సురేంద్రన్, సాక్షి, బెంగళూరు: అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలు.. వీటి కారణంగానే గత ఏడాది కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఇవే అంశాలు లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను దెబ్బతీస్తాయన్న ఆశతో కమల దళం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఘట్టం కూడా ముగిసిపోవడంతో అన్ని పార్టీలూ ప్రచారంలో తలమునకలుగా ఉన్నాయి. దక్షిణాదిలో అధికారానికి కర్ణాటకను సింహద్వారంగా అభివర్ణిస్తూ వచ్చిన బీజేపీ, 2008లో అధికారం చేపట్టినా, తర్వాత ఐదేళ్లూ నానా అవలక్షణాలతో అభాసు పాలైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయే నాటికి ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. అవినీతి ఆరోపణలతో పార్టీ నుంచి నిష్ర్కమించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి బి.శ్రీరాములు సొంత కుంపట్లు పెట్టుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పుట్టి మునిగింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ‘కమల’నాథులు ‘దిద్దు’బాటలో పడ్డారు. యడ్యూరప్పను, శ్రీరాములును కూడా తిరిగి పార్టీలోకి రప్పించుకున్నారు. యడ్యూరప్పను శివమొగ్గలో, శ్రీరాములును బళ్లారిలో బరిలోకి దించింది. మోడీ జోష్.. రాష్ట్రంలోని ముంబై-కర్ణాటక, కోస్తా, మలెనాడు ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో సంఘ్ పరివార్ క్రియాశీలంగా ఉంది. బీజేపీకి ఆది నుంచీ ఇదే శ్రీరామ రక్ష. మోడీ జోష్ కారణంగా ఈ జిల్లాల్లో పార్టీకి పునరుత్తేజం కలిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేవలం పదకొండు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు తరుముకొచ్చిన నేపథ్యంలో బీజేపీ నేతలు తమ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి మోడీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ కంటే ముందుగానే అభ్యర్థులను సైతం ప్రకటించారు. మోడీ ప్రభంజనానికి తోడు కేంద్రంలోని యూపీఏ-2 సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలు తమకు ఓట్ల వర్షం కురిపిస్తాయని బీజేపీ నాయకులు గట్టి విశ్వాసంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండు సంస్థలు ఇదివరకే రాష్ట్రంలో సర్వే ఫలితాలను వెలువరించాయి. ఇవి తమకు అనుకూలంగా ఉండడం కమలనాథుల్లో ఉత్సాహం నింపింది. యడ్యూరప్ప పునరాగమనంతో లింగాయత్‌లతో కూడిన ఓటు బ్యాంకు తిరిగి పదిలం కావడం బీజేపీకి కలిసొచ్చే అంశం. కాంగ్రెస్‌లో విభేదాలు రాష్ట్రంలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో అదే ఊపును ప్రదర్శించలేకపోతోంది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సిద్ధరామయ్యను కాంగ్రెస్ వాదులు ఇప్పటికీ ‘వలస జీవి’గానే పరిగణిస్తున్నారు. గతంలో జనతా పరివార్‌కు చెందిన సిద్ధ రామయ్య... మంత్రివర్గంలో తన అనుయాయులకే కీలక శాఖలను కట్టబెట్టడం కాంగ్రెస్‌వాదులకు మింగుడు పడడం లేదు. దీనికి తోడు అనాదిగా పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు కూడా సీఎం పదవిని తమ సామాజిక వర్గానికి ఇవ్వలేదని పార్టీపై గుర్రుగా ఉన్నారు. మరో వైపు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కూడా పార్టీలో అసంతృప్తి తేనెతుట్టెను కదిల్చింది. బెంగళూరు సెంట్రల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ కేంద్ర మంత్రి జాఫర్ షరీఫ్ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సంఘ్ పరివార్ బలంగా ఉన్న ఎనిమిది జిల్లాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లభించకపోవడం కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతోంది. పాత మైసూరులో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నా.. జేడీఎస్ నుంచి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదాను ఇచ్చినా.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఆ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో నమ్మకంగా గెలిచే స్థానం ఒక్కటీ కనిపించడం లేదు. గుల్బర్గాలో రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గేతో పాటు చిక్‌బళ్లాపూర్‌లో కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఏటికి ఎదురీదుతున్నారు. తృతీయ ఫ్రంట్ కలలు మాజీ ప్రధాని దేవెగౌడ మళ్లీ తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నారు. అయితే, ఆయన సారథ్యంలోని జేడీఎస్ బలం నానాటికీ క్షీణిస్తోంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో మాండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు సమర్పించుకుంది. 26 స్థానాల్లో పోటీ చేస్తున్న ఈ పార్టీ రెండు లేదా మూడు స్థానాలతో తృప్తి పడాల్సి రావచ్చు. చిక్‌బళ్లా పూర్లో దేవెగౌడ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, వీరప్ప మొయిలీతో తలపడుతున్నారు. పాత మైసూరులో... ఒక్కలిగ సామాజిక వర్గంలో మాత్రమే పట్టు ఉండడం వల్ల జేడీఎస్ ఏ మాత్రం పురోగతి సాధించలేక పోతోంది. విలక్షణ ఓటరు కర్ణాటకలో 4.62 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.55 శాతం, జేడీఎస్‌కు 20.09, బీజేపీకి 19.97, యడ్యూరప్ప నాయకత్వంలోని కేజేపీకి 9.83 శాతం ఓట్లు పోలయ్యాయి. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా యూపీఏకి మద్దతు లభించినా.. కర్ణాటకలో బీజేపీ 19 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను వేర్వేరుగా చూడడంలో కన్నడ ఓటర్లు విలక్షణమైన తీరు ప్రదర్శిస్తున్నారు. మరి ఈసారి యూపీఏ వైపు మొగ్గుతారా లేదా ఎన్డీఏను ఆదరిస్తారో చూడాలి. బిగ్ ఫైట్‌కు సిద్ధం దిగ్గజ నేతలపై పోటీకి సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన ‘అనధికారిక ఒప్పందా’నికి తెరపడినట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఇరుపార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలపై బలమైన అభ్యర్థులను పోటీకి నిలపొద్దనేదే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఆ అనధికారిక ఒప్పందం. అయితే, ఈ సారి ఆ పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. రెండు పార్టీలూ ప్రత్యర్థి దిగ్గజాలపై గట్టి అభ్యర్థులనే బరిలో నిలపాలనుకుంటున్నాయి. గుజరాత్‌లోని వదోదర నుంచి పోటీలో ఉన్న నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాహుల్‌కు సన్నిహితుడైన మధుసూదన్ మిస్త్రీని కాంగ్రెస్ బరిలో దింపింది. వారణాసి నుంచి కూడా మరో సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను పోటీకి నిలపాలని ఆలోచిస్తోందని సమాచారం. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ బరిలో ఉన్న అమృతసర్ నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్‌ను పోటీకి నిలిపింది. దాంతో బీజేపీ కూడా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలపై బలమైన అభ్యర్థులనే పోటీలో నిలపాలనుకుంటోంది. రాహుల్ పోటీ చేస్తున్న అమేథీలో బీజేపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, టీవీనటి ‘స్మృతి ఇరానీ’ని పోటీకి దింపాలనుకుంటోంది. ద్వేష వ్యాపారులు.. ‘మోడీని ముక్కలుగా నరికేస్తా’ అంటూ ఆవేశంగా మాట్లాడి చిక్కుల్లో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ సహ్రాన్‌పూర్ (యూపీ) అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ ఆగ్రహాన్ని కూడా బీజేపీ తనకనుకూలంగా మలచుకుంటోంది. దానితో సహా ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు మోడీపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలన్నింటినీ కలిపి బీజేపీ ‘నఫ్రత్ కే సౌదాగర్’ (ద్వేష వ్యాపారులు) పేరుతో ఒక చిన్న ప్రచార చిత్రాన్ని రూపొందించింది. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీని విమర్శిస్తూ సోనియాగాంధీ చేసిన ‘మృత్యు బేహారీ’(2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ) వ్యాఖ్యను, ఈ ఫిబ్రవరిలో చేసిన ‘అధికారం కోసం మోడీ దేశంలో విషబీజాలు నాటుతున్నాడు’ అన్న వ్యాఖ్యను, గతంలో సల్మాన్ ఖుర్షీద్ చేసిన ‘నపుంసకుడు’ వ్యాఖ్యలను ఈ చిత్రంలో పొందుపర్చారు. రాప్.. ఇది రాఖీ పార్టీ వివాదాల్ని ఇంటిపేరుగా పెట్టుకున్న బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ ‘రాష్ట్రీయ ఆమ్ పార్టీ(రాప్)’ పేరుతో ఓ పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరఫున వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పార్టీకి తాను ఉపాధ్యక్షురాలినని, అధ్యక్షులు వేరే ఉన్నారని చెబుతున్నారు. తన హాట్ ఇమేజ్‌కి గుర్తుగా ఎన్నికల చిహ్నంగా ఆమె ‘పచ్చి మిర్చీ’ని కోరుకుంటున్నారట! లక్షలాదిగా అభిమానులు మీరు రాజకీయాల్లో చేరి, ఎన్నికల్లో పోటీ చేసి దేశాన్ని ఉద్ధరించాల్సిందే అంటూ ఒత్తిడి చేయడంతో తప్పనిసరై రాఖీ ఎన్నికల బరిలో నిలిచారట. పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేయాలని బీజేపీ కోరినా.. బెంగాలీ రాదు.. వారి సమస్యలను అర్థం చేసుకోలేనని చెప్పి తిరస్కరించారు. గెలిస్తే.. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమని, వారికి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తానని రాఖీ చెబుతున్నారు. రాఖీ రంగంలో దిగడంతో మోడీ పోటీలో ఉన్న వారణాసి తర్వాత రెండో పాపులర్ నియోజకవర్గంగా వాయవ్య ముంబై నిలిచింది. ఇప్పటికే ఇక్కడి నుంచి బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్(మహారాష్ట్ర నవనిర్మాణసేన), గురుదాస్ కామత్(కాంగ్రెస్), సినీ నిర్మాత కమాల్ ఆర్ ఖాన్(ఎస్పీ), మయాంక్ గాంధీ(ఆప్)లు బరిలో ఉన్నారు. ఫేస్బుక్ పంచ్‌లు...! ఎన్నికల వేళ సోషల్నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో నెటిజన్లు చురుకుగా ఉన్నారు. రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తున్నారు. అలాంటి వాటిలో బాగా లైకులు పొందుతున్న, షేర్ అవుతున్న కామంట్లు! ‘అన్నది పోస్టు పెయిడ్ పార్టీ, తమ్ముడిది ప్రీ పెయిడ్పార్టీ’ (చిరంజీవి ఎన్నికల అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందే పార్టీని బీజేపీకి అనుబంధం చేయడంపై.) వద్దనుకొంటే ఏం నొక్కాలి బాబూ?! ఐవీఆర్ఎస్ ద్వారా అభ్యర్థుల ఎంపిక - చంద్రబాబు నాయుడు ఫోన్లో బాబు: ‘చంబులింగం కావాలంటే ఒకటి, ఏకలింగం కావాలంటే రెండు, జంబులింగం కావాలంటే మూడు, టింగులింగం కావాలంటే నాలుగు నొక్కండి’ జనం: వీళ్లలో ఎవరూ మాకొద్దు, మీ పార్టీనే వద్దు... దానికి ఏం నొక్కాలి?! బీజేపీ వాళ్లు ‘ఓట్ ఫర్ మోడీ’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే తీరా పోలింగ్ బూత్‌లో మోడీ బొమ్మ కనపడకపోతే ఓటర్లు గందరగోళానికి గురవుతారేమో! (ప్రస్తుత కమలదళం ప్రచారాన్ని చూస్తుంటే మౌడీస్వామ్యం పుణ్యమా అని ఆ పార్టీ గుర్తు ‘కమలం’ అని మరిచిపోయే పరిస్థితి వచ్చిదంటూ ఒక నెటిజన్ సెటైర్) కామెంట్ ప్లీజ్...! తెలుగుదేశం పార్టీని గెలిస్తే చంద్రబాబు నాయుడు... సీమాంధ్రను అమ్మి సింగపూర్‌ను కొనుక్కొంటాడు! కిరణ్‌ను చూస్తే ఏమినిపిస్తోంది? హింసించే రాజు 23వ పులకేశి గుర్తుకొస్తున్నాడు! బాబును చూస్తే ఏమనిపిస్తోంది? మీడియాకు ముద్దుబిడ్డడు అనిపిస్తోంది! చంద్రబాబు సోనియాగాంధీని గాడ్సే అని అంటున్నాడు! మరి రామారావుగారు చంద్రబాబును గాడ్సేతోనూ, ఔరంగజేబుతో పోల్చాడుగా! - సేకరణ: జీవన్ -
అలో....లక్ష్మణా !
నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు బొత్స సోదరుడు లక్ష్మణరావు ఇప్పుడు గుదిబండగా మారారు. ఎమ్మెల్యే తీరు పై గుర్రుగా ఉన్న నాయకులను తనవైపు తిప్పుకొనేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. అవసరమైతే టీడీపీ నేతలను కూడా మం చి చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. అప్పలనాయుడికి చెక్ పెట్టి నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు లక్ష్మణరావు స్కెచ్ గీస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయం గమనించిన కార్యకర్తలు, నేతలు అయోమయానికి గురవు తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం :నెల్లిమర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సోదరుడు లక్ష్మణరావు మధ్య చిచ్చు రేగుతోంది. రానున్న ఎన్నికల నాటికి ఎమ్మెల్యే బడ్డుకొండకు ఎసరు పెట్టే పరిస్థితి కనిపిస్తోం ది. ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో లక్ష్మణరావు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను పార్టీ శ్రేణులు నిశితంగా గ మనిస్తున్నాయి. వీరి స్వార్థ రాజకీయాల కోసం మనమంతా పనిచేయాలా? అన్న ఆలోచనలో కేడర్ ఉన్నట్టు తెలిసింది. విసిగివేశారిన వారు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. అసలే రోజురోజుకూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇందులో ఉంటే భవి ష్యత్ ఉండదని కేడర్ పక్కచూపు చూస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో వలే నెల్లిమర్లలో కూడా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న పార్టీకి ఇప్పుడు గ్రూపుల గోల మొదలైంది. పాత నాయకులను చిన్న చూపు చూస్తూ కొత్త వారిని ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రోత్సహిస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికన్నా కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్లలో ఇద్దరు, పూసపాటిరేగలో ముగ్గురు, డెంకాడలో ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. వారంతా ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదే అదనుగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సోదరుడు లక్ష్మణరావు రంగ ప్రవేశం చేసి, బడ్డుకొండకు వ్యతిరేకంగా ఉన్న వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పలనాయుడు, లక్ష్మణరావు ఒకప్పుడు సన్నిహితంగా ఉండేవారు. ఎక్కడ చెడిందో లేదంటే లక్ష్మణరావుకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక పెరిగిందో తెలియదు గాని, కొంతకాలంగా వారి మధ్య సఖ్యత లేదన్నది పార్టీ వర్గాల భోగట్టా. అభిప్రాయ బేధాలు పెరిగి గ్రూపులు కట్టే పరిస్థితికి చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇంకో విశేషమేమిటంటే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలన్న యోచనతో టీడీపీ నేతల్ని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో లక్ష్మణరావు నిమగ్నమయ్యారని, తనకంటూ బలాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ కూడా అందుకు ప్రతివ్యూహాలతో వెళ్తున్నారని తెలిసింది. అసలే పార్టీ పరిస్థితే అయోమయంగా ఉంటే ఇప్పుడీ గ్రూపుల గోల ఏంటని కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. ఎంతసేపూ తమ కుటుంబంలోని వారికే పదవులు పంచుకుంటున్నారు తప్పా, చాలా ఏళ్లగా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి మధ్య నలిగిపోవడం, ఒకే కుటుంబానికి ఊడిగం చేయడం కన్నా, ప్రజాదరణ గల వైఎస్సార్ సీపీలో చేరడమే మంచిదన్న ఆలోచనకు కేడర్ వస్తోంది. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు అడుగులు వేస్తున్నారు.