సీనియర్లపై భగ్గుమన్న ఆప్
యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్‌లపై ధ్వజం
పార్టీని దెబ్బతీయాలని చూశారని తీవ్ర ఆరోపణలు
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రయత్నించారని మండిపాటు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత పోరు బహిరంగమైంది. పార్టీ సీనియర్లు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై ఇటీవల చర్య తీసుకున్న ఆప్ నాయకత్వం తాజాగా వారిపై తీవ్ర ఆరోపణలు చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి ఆ ఇద్దరినీ తొలగించడానికి కారణాలను అధికారికంగా వెల్లడించింది. యోగేంద్ర, ప్రశాంత్‌లతో పాటు శాంతి భూషణ్ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి కోసం కుట్రపన్నారని ఆరోపించింది.
ఢిల్లీలో ప్రచారం చేయకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్యకర్తలను ప్రశాంత్ నిరుత్సాహపరిచారని విమర్శించింది. ఈమేరకు ఆప్ అగ్ర నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, పంకజ్‌గుప్తా, సంజయ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందుకే మార్చి 4న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వారిపై కఠిన చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. యాదవ్, ప్రశాంత్‌లను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల దృష్టిలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న అభిప్రాయంతోనే ఇంతవరకు ఈ కారణాలను వెల్లడించలేదన్నారు. అయితే మీడియా కథనాలతో పార్టీ నిర్ణయం అప్రజాస్వామికమన్న భావన కలుగుతున్నందు వల్ల అన్ని విషయాలను వెల్లడించక తప్పడం లేదన్నారు. ఎన్నికల్లో ఆప్ ఓడిపోవాలని, అప్పుడే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేలకు దిగుతారని భూషణ్ అన్నట్లు వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీకి 20-22 సీట్లే వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్నికలకు ముందు ఓ నేతతో ఆయన చెప్పినట్లు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ప్రశాంత్, యోగేంద్ర ఖండించారు. దీనిపై త్వరలోనే స్పందిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ మద్దతుదారులు గతంలోనూ తమపై ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు.
నేషనల్ కౌన్సిల్ పై దృష్టి
ఈ నెల 28న జరగనున్న ఆప్ అత్యున్నత నిర్ణాయక విభాగం నేషనల్ కౌన్సిల్ భేటీపై ఆసక్తి నెలకొంది. పీఏసీ నుంచి యాదవ్, భూషణ్ తొలగింపు ఏకగ్రీవం కానందువల్ల తీవ్ర చర్చ జరగొచ్చు. హాజరు కానున్న సీఎం కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.