అలో....లక్ష్మణా !
Published Thu, Jan 16 2014 4:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు బొత్స సోదరుడు లక్ష్మణరావు ఇప్పుడు గుదిబండగా మారారు. ఎమ్మెల్యే తీరు పై గుర్రుగా ఉన్న నాయకులను తనవైపు తిప్పుకొనేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. అవసరమైతే టీడీపీ నేతలను కూడా మం చి చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. అప్పలనాయుడికి చెక్ పెట్టి నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు లక్ష్మణరావు స్కెచ్ గీస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయం గమనించిన కార్యకర్తలు, నేతలు అయోమయానికి గురవు తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :నెల్లిమర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సోదరుడు లక్ష్మణరావు మధ్య చిచ్చు రేగుతోంది. రానున్న ఎన్నికల నాటికి ఎమ్మెల్యే బడ్డుకొండకు ఎసరు పెట్టే పరిస్థితి కనిపిస్తోం ది. ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో లక్ష్మణరావు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను పార్టీ శ్రేణులు నిశితంగా గ మనిస్తున్నాయి. వీరి స్వార్థ రాజకీయాల కోసం మనమంతా పనిచేయాలా? అన్న ఆలోచనలో కేడర్ ఉన్నట్టు తెలిసింది. విసిగివేశారిన వారు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు.
అసలే రోజురోజుకూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇందులో ఉంటే భవి ష్యత్ ఉండదని కేడర్ పక్కచూపు చూస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో వలే నెల్లిమర్లలో కూడా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న పార్టీకి ఇప్పుడు గ్రూపుల గోల మొదలైంది. పాత నాయకులను చిన్న చూపు చూస్తూ కొత్త వారిని ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రోత్సహిస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికన్నా కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్లలో ఇద్దరు, పూసపాటిరేగలో ముగ్గురు, డెంకాడలో ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. వారంతా ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇదే అదనుగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సోదరుడు లక్ష్మణరావు రంగ ప్రవేశం చేసి, బడ్డుకొండకు వ్యతిరేకంగా ఉన్న వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పలనాయుడు, లక్ష్మణరావు ఒకప్పుడు సన్నిహితంగా ఉండేవారు. ఎక్కడ చెడిందో లేదంటే లక్ష్మణరావుకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక పెరిగిందో తెలియదు గాని, కొంతకాలంగా వారి మధ్య సఖ్యత లేదన్నది పార్టీ వర్గాల భోగట్టా. అభిప్రాయ బేధాలు పెరిగి గ్రూపులు కట్టే పరిస్థితికి చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇంకో విశేషమేమిటంటే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలన్న యోచనతో టీడీపీ నేతల్ని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో లక్ష్మణరావు నిమగ్నమయ్యారని, తనకంటూ బలాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ కూడా అందుకు ప్రతివ్యూహాలతో వెళ్తున్నారని తెలిసింది.
అసలే పార్టీ పరిస్థితే అయోమయంగా ఉంటే ఇప్పుడీ గ్రూపుల గోల ఏంటని కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. ఎంతసేపూ తమ కుటుంబంలోని వారికే పదవులు పంచుకుంటున్నారు తప్పా, చాలా ఏళ్లగా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి మధ్య నలిగిపోవడం, ఒకే కుటుంబానికి ఊడిగం చేయడం కన్నా, ప్రజాదరణ గల వైఎస్సార్ సీపీలో చేరడమే మంచిదన్న ఆలోచనకు కేడర్ వస్తోంది. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు అడుగులు వేస్తున్నారు.
Advertisement
Advertisement