NELLIMARLA constituency
-
అవగాహన ఉంది... ఆచరణలో పెడతా..
పంచాయతీ సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు... జెడ్పీటీసీగా గెలిచారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ స్థానాన్ని అధిరోహించారు. అటు తరువాత ఎమ్మెల్యేగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన యువనాయకుడతను. ఎవరు అధికారంలో ఉన్నా... లౌక్యంతో మెలిగారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. నాడు రాజన్న పాలన చూశారు. ఆయనలోని సంక్షేమ గుణాన్ని గుర్తించారు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు జగనన్నను అనుసరిస్తున్నారు. ఆయనే బడ్డుకొండ అప్పలనాయు డు. నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అలా మొదలైంది... 1989 నుంచి గ్రామ స్థాయి రాజకీయాల్లో మా అన్నయ్య జనార్దన్‌నాయుడు సర్పంచ్‌గా ఉండే వారు. అప్పటినుంచి యాక్టివ్‌గా రాజకీయాల్లో పాల్గొన్నాను. 1991లో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా ను. గ్రామాల్లో మద్యపానం, పేకాట వంటివి కంట్రోల్ చేశాను. అక్కడినుంచి తిరిగి చూసుకోలే దు. వరుసగా మా కుటుంబంలోనివారే విజయం సాధిస్తూ వచ్చారు. తర్వాత జెడ్పీటీసీగా గెలిచా ను. 2006, ఫిబ్రవరి 5న జిల్లాపరిషత్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశాను. 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. చివరి నిమిషంలో మహానేత రాజశేఖరరెడ్డి నన్ను నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. ఆ పోటీలోనూ గెలిచాను. బొత్స సత్యనారాయణ నా వెనుక ఉండి నడిపించారు. దివంగత నేతను కోల్పోయాం. 2014లో నన్ను రమ్మని టీడీపీ వాళ్లు ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్ తరఫునే పోటీచేశా... అయినా 23,500 ఓట్లు పడ్డాయి. జగనన్న బాటలో... వైఎస్సార్సీపీలో చేరిన తరువాత మా నాయకుడు జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేసిన ప్రతీ కార్యక్రమాన్నీ విజయవంతం చేశాను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింట ప్రచారం చేశాను. మాకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్లున్నారు. పెద్దలు బొత్స సత్యనారాయణ, సాంబశివరాజుల సహాయంతో ముందుకు నడుస్తున్నాను. నియోజకవర్గంలో ఏం చేయాలో అవగాహన ఉంది. గెలిపిస్తే అవన్నింటినీ ఆచరించి చూపిస్తా. బాబు పథకాలన్నీ పచ్చనేతలకే... చంద్రబాబు చెపుబుతున్న పసుపు, కుంకుమ పచ్చ నేతలకే అందుతున్నాయి. రైతు రథాలు నిజమైన రైతుకు ఇవ్వలేదు. వారి పార్టీలో ఉండి... ఎవరైతే కమీషన్లు ఇచ్చారో వారికే అందించారు. జన్మభూమి కమిటీ అనేది ఒక బ్రోకరు కమిటీ. ఒక దళారీ కమిటీ. చంద్రబాబు ఇచ్చే రూ.10వేలతో మహిళల పసుపు–కుంకుమలు చల్లగా ఉండవు. బెల్ట్ షాపులన్నీ తీసేస్తామని చెప్పారు. ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 మద్యం బెల్ట్‌షాపులున్నాయి. ఈ ప్రభుత్వంలో నాలుగు మాసాల నుంచి ఉపాధి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బునే బహుశా పసుపు కుంకుమగా అందిస్తున్నారేమో. వైఎస్ హయాంలో 108కి ఫోన్ చేసిన వెంటనే వచ్చేది. ఇప్పుడలా లేదు. ఇవన్నీ వారి వైఫల్యాలకు నిదర్శనాలే. నియోజకవర్గంలో అవినీతి రాజ్యం ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులు, మనవడు కలిసి మూడు తహసీల్దార్ కార్యాలయాలను పంచుకున్నారు. ప్రతీ దానికి ఒక రేటు పెట్టారు. ముఖ్యంగా పాత రోజుల్లో వేసిన లే అవుట్ల యాజమానులను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దోచుకో దాచుకో అన్న చందంగా వ్యవహరించారు. ఆ ఎమ్మెల్యే హయాంలో ఇటు పూసపాటిరేగకు, అటు భోగాపురానికి, ఇటు డెంకాడకు చెందకుండా ప్రభుత్వాస్పత్రిని నిర్మించారు. అది ఎవరికీ ఉపయోగం లేదు. నా హయాంలో ఏ గ్రామానికి ఏం చేశానో చెప్పగలను. వీళ్లు చెప్పలేరు. ఇళ్లు కూడా ముఖాలు చూసి ఇచ్చారు. ఇక్కడి మత్స్యకార ప్రాంతాలున్నాయి. వారికి జెట్టీలు కావాలని అడుగుతున్నారు. నేను వచ్చిన తరువాత అవన్నీ పూర్తి చేస్తాను. పరిశ్రమల వ్యర్థాలతో పడుతున్న అవస్థలను సైతం గట్టెక్కిస్తా. ఇక్కడివారు వలసలు వెళ్లకుండా నిరోధిస్తాను. ఇటీవలే జిల్లా మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి వెళ్లిపోయి అక్కడి వారి చెరలో చిక్కుతున్నారు. ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణకు చెప్పడంతో విజయసాయిరెడ్డి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. మాటతప్పని నేత జగన్ జగన్మోహన్రెడ్డిలో చక్కనైన వ్యూహం ఉంది. ఏం చేస్తే ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తారు. దానినే ఆచరిస్తారు. ఏ నాయకుడైనా పది మందికి ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టేది చేయకూడదు. జగన్ ఆలోచనలతో ఈ రాష్ట్రం పురోగమిస్తుందన్న నమ్మకం ఉంది. ఆయన మా ట తప్పరు.. మడమ తిప్పరు. ఏ సమస్య అయినా ఆయన వింటారు. ఎన్నో సర్వేలు చేసి నాకు సీటు ఇచ్చారు. ఆయన సూచనలతోనే కార్యక్రమాలు చేస్తాను. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను. జగన్‌లో పట్టుదల ఉంది జగన్మోహన్రెడ్డి చాలా పట్టుదలగల వ్యక్తి. ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. తల్లిని, భార్యను కుటుంబాన్ని వదిలి 3648 కిలోమీటర్ల పాదయాత్ర ఎవరికీ సాధ్యం కాదు. రాజశేఖరరెడ్డిని నేను దగ్గరగా చూశాను. ఆయన లక్షణాలన్నీ జగన్‌లో ఉన్నాయి. ఏదీ ఆషామాషీగా చెప్పరు. అవగాహనతోనే ప్రకటిస్తా రు. ఎక్కడ పరిశ్రమలున్నాయో స్థానికంగా ఉన్న వారికి 75 శాతం మందికి ఉద్యోగాలు కల్పించాలని జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో డిగ్రీలు పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారందరికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతానికి అశోక్చేసిందేమీ లేదు అశోక్‌గజపతిరాజు ఎంపీ అయితే జిల్లాకు పరిశ్రమలు తీసుకు వచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తాడనుకున్నాం. కానీ ఆయన ఆ మునిసిపాలిటీకి కూడా న్యాయం చేయలేదు. తన కోటకు మాత్రం కొత్త హంగులు సమకూర్చుకున్నారు. ఎంపీ ల్యాండ్స్ ఏం చేశారో తెలియదు. ఎయిర్ పోర్ట్ భూములు కోల్పోయిన వారికి ఈ రోజు వరకు నగదు అందలేదు. అడిగితే కేసులు బనాయిస్తున్నారు. రైతులకు రావాల్సిన డబ్బుల్లో కూడా కమీషన్లు లాక్కున్నారు. టీడీపీ ఏది చేసినా అవినీతే. నారాయణస్వామినాయుడుకు పదవీ వ్యామోహం ఉంది కాబట్టి వయో భారం వచ్చినా ఇంకా పోటీకి దిగారు. -
చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
సాక్షి, విజయనగరం రూరల్: కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడని, ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, రాష్ట్రంలో వచ్చేది రాజన్న రాజ్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీనటుడు ఫృథ్వీ, సిని హీరో కృష్ణుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా జిల్లా పర్యటనకు వచ్చిన ఫృథ్వీ, కృష్ణుడు, జోగినాయుడు, సినీ, టీవీ ఆర్టిస్టుల బృందం పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫృథ్వీ మాట్లాడుతూ జననేత జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు ఐదు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నాడన్నారు. ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహాకూటమి అని తెలంగాణలో పోటీ చేసి డిపాజిట్లు గల్లంతు చేసుకున్న చంద్రబాబు, రాష్ట్రంలో ఎన్నికల వేళ మాయాకూటమిని కట్టాడన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని గెలిపించాలన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులన్నారు. జిల్లాలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని సినీ నటుడు కృష్ణుడు అన్నారు. విజయనగరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని కోటలో రాణి కావాలో, ఎళ్లవేళలా తోడుండే ప్రజల నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరోయే తప్ప రియల్ హీరో కాదన్నారు. మరో సినీ, టీవీ నటుడు జోగినాయుడు మాట్లాడుతూ కోటల్లో మహారాణులను కాదు మనకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోండని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలకు పొడిచిన వెన్నుపోటుపై ఫృథ్వీ, నటులు ఆలపించిన గేయం ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణతేజ, వర్మ, ఈశ్వర్ కౌషిక్, రాంపండు, తవిటిరాజు, కనకల ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్‌కు మహిళలే అండ నెల్లిమర్ల: వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలే అండ అని ప్రముఖ సినీ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేటలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పృథ్వీరాజ్ తన బృందంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇదిలా ఉంటే వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకు కేఏ పాల్ని తీసుకొచ్చి, ప్రజాశాంతి పార్టీ తరఫున ఒకేలాంటి పేరుగల అభ్యర్థులను పోటీకి నిలబెట్టారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ప్రముఖ నటులు కృష్ణుడు, జోగినాయుడు మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, మండల శాఖ అధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, కె.హర్షవర్ధన్ పాల్గొన్నారు. -
ఎంతటి వారైనా..ఏడుకు తలొంచాల్సిందే..
సాక్షి, నెల్లిమర్ల: నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడోసారి సెంటిమెంట్ బలంగా ఉంది. ఆరుసార్లు ఓటమి లేకుండా వరుసగా ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజకీయ ఉద్ధండులు సైతం ఏడోసారి ఓటమి చవిచూశారు. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటివరకు సతివాడ, భోగాపురం నియోజకవర్గాలుండేవి. సతివాడ నియోజకవర్గంలో సీనియర్ నేత, ప్రస్తుత వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తిరుగులేని విజయం సాధించారు. అయితే 1994లో ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన టీడీపీ అభ్యర్థి పొట్నూరు సూర్యనారాయణ చేతిలో మొట్టమొదటి సారిగా ఓటమి చూశారు. అనంతరం 1999, 2004 లోనూ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. అలాగే భోగాపురం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా పేరున్న పతివాడ నారాయణస్వామి నాయుడుకు కూడా ఏడు సెంటిమెంట్ తగిలింది. ఆ నియోజకవర్గంలో 1983 నుంచి 2009 వరకు ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ ఓడిపోలేదు. అయితే 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఏడోసారి బరిలో దిగిన పతివాడ అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇప్పటి వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014 ఎన్నికల్లో పతివాడ కూడా గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో ఏడు సెంటిమెంటు బాగా పనిచేసిందని ఓటర్లు ఇప్పటికీ చర్చించుకుంటారు. మంత్రులుగా.. ప్రోటెం స్పీకర్లుగా పనిచేసిన నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు రాజకీయ ఉద్ధండులు ఏడోసారి ఓడిపోవడం నిజంగానే ’సెంటిమెంటేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
-
బొత్సకు మరో దెబ్బ!
నెల్లిమర్ల, న్యూస్‌లైన్ : నెల్లిమర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. నాలుగు మండలాలకు చెందిన ప్రముఖ నేతలు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా నేతలు అయోమయంలో పడ్డారు. మొన్నటి వరకు పార్టీకి కాస్తోకూస్తో పట్టున్న నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ మండలాలకు చెందిన నేతలు, క్యాడర్ కూడా సోమవారం వైఎస్సార్ సీపీలో చేరడంతో దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా నేడో రేపో ఆ పార్టీకి చెందిన మరికొంత మంది ముఖ్య నేతలు కూడా వైఎస్సార్ సీపీలో చేరే అవకాశముంది. దీంతో సాధారణ ఎన్నికల మాట అటుంచితే.. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు సైతం కరువయ్యే పరిస్థితి దాపురిం చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో పాటు క్యాడర్ కూడా వైఎస్సార్ సీపీలో చేరడంతో ఆ పార్టీ క్యాడర్లో ఎన్నికల జోష్ మొదలైంది. నియోజకవర్గంలోని నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు కాస్తోకూస్తో పట్టుండేది. ఈ మండలాల్లోని తాజా మాజీ నేతలంతా ఆ పార్టీకి చెందిన వారు కావడంతో త్వరలో జరిగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా అనుకున్న ఫలితాలు సాధించవచ్చునని ఆ పార్టీ నేతలు ఆశించారు. ఈ మూడు మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ పదవులను కూడా తమ పార్టీనే కైవసం చేసుకుంటుందని పార్టీ అధిష్ఠానం భావించింది. అంతేగాకుండా స్థానిక ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తే త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సైతం సునాయాసంగా గెలుపొందుతారని అంచనాలు వేశారు. అయితే ఆ పార్టీ అధిష్ఠానం అంచ నా లు తలకిందులయ్యాయి. తాజాగా రాజకీయ పరిణామాలు పార్టీని పూర్తిగా దెబ్బతీశాయి. నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నేతలు, క్యాడర్ భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం మండలాలకు చెందిన ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలు సైతం పార్టీని వీడడంతో నియోజకవర్గంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయింది. నెల్లిమర్ల మండలానికి చెందిన డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, విజయనగరం ఏఎంసీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములనాయుడులతో పాటు మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు భారీస్థాయిలో సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడి, వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే భోగాపురం మండలానికి చెందిన మాజీ ఎంపీ కొమ్మూరు అప్పలస్వామి, ఆయన అల్లుడు కందుల రఘుబాబులు వారి అనుచర గణంతో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే డెంకాడ మండలంలో రాజకీయంగా మంచిపట్టున్న రాము మాస్టారు సైతం ఆయన అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్‌లో త్వరలో చేరనున్నారు. దీంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సైతం ఆపార్టీకి అభ్యర్థులు దొరకని సరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ఆస్కారముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
అలో....లక్ష్మణా !
నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు బొత్స సోదరుడు లక్ష్మణరావు ఇప్పుడు గుదిబండగా మారారు. ఎమ్మెల్యే తీరు పై గుర్రుగా ఉన్న నాయకులను తనవైపు తిప్పుకొనేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. అవసరమైతే టీడీపీ నేతలను కూడా మం చి చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. అప్పలనాయుడికి చెక్ పెట్టి నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు లక్ష్మణరావు స్కెచ్ గీస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయం గమనించిన కార్యకర్తలు, నేతలు అయోమయానికి గురవు తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం :నెల్లిమర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సోదరుడు లక్ష్మణరావు మధ్య చిచ్చు రేగుతోంది. రానున్న ఎన్నికల నాటికి ఎమ్మెల్యే బడ్డుకొండకు ఎసరు పెట్టే పరిస్థితి కనిపిస్తోం ది. ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో లక్ష్మణరావు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను పార్టీ శ్రేణులు నిశితంగా గ మనిస్తున్నాయి. వీరి స్వార్థ రాజకీయాల కోసం మనమంతా పనిచేయాలా? అన్న ఆలోచనలో కేడర్ ఉన్నట్టు తెలిసింది. విసిగివేశారిన వారు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. అసలే రోజురోజుకూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇందులో ఉంటే భవి ష్యత్ ఉండదని కేడర్ పక్కచూపు చూస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో వలే నెల్లిమర్లలో కూడా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న పార్టీకి ఇప్పుడు గ్రూపుల గోల మొదలైంది. పాత నాయకులను చిన్న చూపు చూస్తూ కొత్త వారిని ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రోత్సహిస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికన్నా కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్లలో ఇద్దరు, పూసపాటిరేగలో ముగ్గురు, డెంకాడలో ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. వారంతా ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదే అదనుగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సోదరుడు లక్ష్మణరావు రంగ ప్రవేశం చేసి, బడ్డుకొండకు వ్యతిరేకంగా ఉన్న వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పలనాయుడు, లక్ష్మణరావు ఒకప్పుడు సన్నిహితంగా ఉండేవారు. ఎక్కడ చెడిందో లేదంటే లక్ష్మణరావుకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక పెరిగిందో తెలియదు గాని, కొంతకాలంగా వారి మధ్య సఖ్యత లేదన్నది పార్టీ వర్గాల భోగట్టా. అభిప్రాయ బేధాలు పెరిగి గ్రూపులు కట్టే పరిస్థితికి చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇంకో విశేషమేమిటంటే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలన్న యోచనతో టీడీపీ నేతల్ని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో లక్ష్మణరావు నిమగ్నమయ్యారని, తనకంటూ బలాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ కూడా అందుకు ప్రతివ్యూహాలతో వెళ్తున్నారని తెలిసింది. అసలే పార్టీ పరిస్థితే అయోమయంగా ఉంటే ఇప్పుడీ గ్రూపుల గోల ఏంటని కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. ఎంతసేపూ తమ కుటుంబంలోని వారికే పదవులు పంచుకుంటున్నారు తప్పా, చాలా ఏళ్లగా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి మధ్య నలిగిపోవడం, ఒకే కుటుంబానికి ఊడిగం చేయడం కన్నా, ప్రజాదరణ గల వైఎస్సార్ సీపీలో చేరడమే మంచిదన్న ఆలోచనకు కేడర్ వస్తోంది. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు అడుగులు వేస్తున్నారు.