విజయనగరం రూరల్: ప్రచారంలో గేయాన్ని ఆలపిస్తున్న ఫృథ్వీ, కృష్ణుడు, ఇతర నటీనటులు
సాక్షి, విజయనగరం రూరల్: కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడని, ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, రాష్ట్రంలో వచ్చేది రాజన్న రాజ్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీనటుడు ఫృథ్వీ, సిని హీరో కృష్ణుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీకి మద్దతుగా జిల్లా పర్యటనకు వచ్చిన ఫృథ్వీ, కృష్ణుడు, జోగినాయుడు, సినీ, టీవీ ఆర్టిస్టుల బృందం పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్‌లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫృథ్వీ మాట్లాడుతూ జననేత జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు ఐదు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నాడన్నారు. ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహాకూటమి అని తెలంగాణలో పోటీ చేసి డిపాజిట్లు గల్లంతు చేసుకున్న చంద్రబాబు, రాష్ట్రంలో ఎన్నికల వేళ మాయాకూటమిని కట్టాడన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులన్నారు.
జిల్లాలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని సినీ నటుడు కృష్ణుడు అన్నారు. విజయనగరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని కోటలో రాణి కావాలో, ఎళ్లవేళలా తోడుండే ప్రజల నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరోయే తప్ప రియల్ హీరో కాదన్నారు. మరో సినీ, టీవీ నటుడు జోగినాయుడు మాట్లాడుతూ కోటల్లో మహారాణులను కాదు మనకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోండని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలకు పొడిచిన వెన్నుపోటుపై ఫృథ్వీ, నటులు ఆలపించిన గేయం ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణతేజ, వర్మ, ఈశ్వర్ కౌషిక్, రాంపండు, తవిటిరాజు, కనకల ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్‌కు మహిళలే అండ
నెల్లిమర్ల: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలే అండ అని ప్రముఖ సినీ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేటలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పృథ్వీరాజ్ తన బృందంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీని దెబ్బ తీసేందుకు కేఏ పాల్‌ని తీసుకొచ్చి, ప్రజాశాంతి పార్టీ తరఫున ఒకేలాంటి పేరుగల అభ్యర్థులను పోటీకి నిలబెట్టారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ప్రముఖ నటులు కృష్ణుడు, జోగినాయుడు మాట్లాడారు.
ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, మండల శాఖ అధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, కె.హర్షవర్ధన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment