
పెనుమత్స సాంబశివరాజు, పతివాడ నారాయణస్వామి
సాక్షి, నెల్లిమర్ల: నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడోసారి సెంటిమెంట్ బలంగా ఉంది. ఆరుసార్లు ఓటమి లేకుండా వరుసగా ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజకీయ ఉద్ధండులు సైతం ఏడోసారి ఓటమి చవిచూశారు. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటివరకు సతివాడ, భోగాపురం నియోజకవర్గాలుండేవి. సతివాడ నియోజకవర్గంలో సీనియర్ నేత, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1967 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తిరుగులేని విజయం సాధించారు. అయితే 1994లో ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన టీడీపీ అభ్యర్థి పొట్నూరు సూర్యనారాయణ చేతిలో మొట్టమొదటి సారిగా ఓటమి చూశారు. అనంతరం 1999, 2004 లోనూ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. అలాగే భోగాపురం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా పేరున్న పతివాడ నారాయణస్వామి నాయుడుకు కూడా ఏడు సెంటిమెంట్ తగిలింది. ఆ నియోజకవర్గంలో 1983 నుంచి 2009 వరకు ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ ఓడిపోలేదు. అయితే 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఏడోసారి బరిలో దిగిన పతివాడ అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇప్పటి వైఎస్సార్‌సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014 ఎన్నికల్లో పతివాడ కూడా గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో ఏడు సెంటిమెంటు బాగా పనిచేసిందని ఓటర్లు ఇప్పటికీ చర్చించుకుంటారు. మంత్రులుగా.. ప్రోటెం స్పీకర్లుగా పనిచేసిన నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు రాజకీయ ఉద్ధండులు ఏడోసారి ఓడిపోవడం నిజంగానే ’సెంటిమెంటేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.