చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం రాత్రి చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో వెన్నముద్ద చేతబట్టిన కృష్ణుడి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నేత్రపర్వంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం ఆస్థాన మండపంలో వేడుకగా ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని బద్రీనారాయణుడిగా అలంకరించారు.
రాత్రి ఏడు గంటలకు మంగళ వాయిద్యం, భజన బృందాలు, భక్తుల కోలాటాలు, జియ్యర్ స్వాముల దివ్యప్రబంధ పారాయణం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. కాగా, బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాల సమర్పణ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు.
ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రారి్థంచినట్టు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment