
చంద్రగిరి(తిరుచానూరు): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఎనిమిది గంటలకు జగన్మోహిని అలంకరణలో తిరువీధుల్లో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
మధ్యాహ్నం స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారికి వసంతోత్సవం వేడుకగా జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 6.30 గంటలకు అమ్మవారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి గజ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించారు.
రాత్రి ఏడు గంటలకు సంప్రదాయ భక్తి సంగీత, భజన, కోలాట బృందాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం, కళాకారుల విచిత్ర వేషధారణల నడుమ అమ్మవారు గజేంద్రునిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు పట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సర్వభూపాల వాహనం సేవ, రాత్రి గరుడ వాహన సేవ జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment