sripadmavati Amman
-
సర్వభూపాలునిపై సర్వాంతర్యామి
చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజైన బుధవారం ఉదయం హరి అంతరంగ అలిమేలు మంగ సర్వభూపాలునిపై ఉట్టి కృష్ణుడు అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు అమ్మవారిని అద్దాల మహల్ నుంచి వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర స్వర్ణాభరణాలతో అమ్మవారిని చేతితో ఉట్టి కొడుతున్న శ్రీకృష్ణుడిగా అలంకరించారు. ఎనిమిది గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు సర్వభూపాల వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మి అమ్మవారు సాయంత్రం సౌభాగ్యలక్ష్మిగా స్వర్ణరథంపై తిరువీధుల్లో భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ముందు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపిణిగా అలంకరించి రథ మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. సాయంత్రం 4.20 గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు నడుమ సర్వతేజోమయి అయిన అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి గరుడ వాహనంపై శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు తిరువీధుల్లో విహరించారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. -
గజ వాహనంపై శ్రీమహాలక్ష్మి దర్శనం
చంద్రగిరి(తిరుచానూరు): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఎనిమిది గంటలకు జగన్మోహిని అలంకరణలో తిరువీధుల్లో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారికి వసంతోత్సవం వేడుకగా జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 6.30 గంటలకు అమ్మవారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి గజ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించారు. రాత్రి ఏడు గంటలకు సంప్రదాయ భక్తి సంగీత, భజన, కోలాట బృందాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం, కళాకారుల విచిత్ర వేషధారణల నడుమ అమ్మవారు గజేంద్రునిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు పట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సర్వభూపాల వాహనం సేవ, రాత్రి గరుడ వాహన సేవ జరగనున్నాయి. -
చిన్నశేషునిపై బద్రీనారాయణుడు
చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం రాత్రి చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో వెన్నముద్ద చేతబట్టిన కృష్ణుడి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నేత్రపర్వంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం ఆస్థాన మండపంలో వేడుకగా ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని బద్రీనారాయణుడిగా అలంకరించారు. రాత్రి ఏడు గంటలకు మంగళ వాయిద్యం, భజన బృందాలు, భక్తుల కోలాటాలు, జియ్యర్ స్వాముల దివ్యప్రబంధ పారాయణం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. కాగా, బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రారి్థంచినట్టు తెలిపారు -
వేగంగా మెడికల్ కళాశాల పనులు
తిరుపతి, న్యూస్‌లైన్: స్విమ్స్‌కు అనుబంధంగా శ్రీపద్మావతి అమ్మవారి పేరుతో ఏర్పాటు అవుతున్న తొలి మహిళా మెడికల్ కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 2014-15 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించే లక్ష్యం తో పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రభుత్వ స్థలంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంట విమానాశ్రయం వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం మార్కెట్ ధరకు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని స్విమ్స్‌కు కేటాయిం చారు. అక్కడ టీటీడీ సహకారంతో మెడికల్ కళాశాల, ఫార్మసీ కళాశాల, స్విమ్స్ పరిపాలన భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్విమ్స్ నిధులతో ప్రభుత్వం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కళాశాల కోసం నిర్మాణాలు ప్రారంభించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించేందుకు టీటీడీ గతంలో ఇచ్చిన హామీని విరమించుకుంది. దాంతో పద్మావతి మెడికల్ కళాశాల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు కంచి మఠం ముందుకు వచ్చింది. స్విమ్స్ అధికారులు కంచి మఠం ప్రతినిధులు సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. అయితే ఆ ఒప్పందం కూడా అటకెక్కింది. మెడికల్ కళాశాలను తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ కంచిమఠం నిర్వాహకులు అడ్డం తిరిగారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు టీటీడీ వెనక్కు తగ్గడంతో కంచిమఠం ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటుకు అప్పటి రోశయ్య ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.అయితే అది కూడా వివాదాస్పదమై వ్యవహారం కోర్టుకు చేరింది. తిరుపతిలోనే మెడికల్ కళాశాల ఈ నేపథ్యంలో తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ఏరియాలో మహిళలకోసం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.దాంతో పనులు ప్రారంభించి, వచ్చే విద్యాసంవత్సరానికల్లా పూర్తిచేసి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేసిన అధికారులు ఎస్వీ మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, గతంలో స్విమ్స్ జనరల్ సర్జన్‌గా పనిచేసిన డాక్టర్ పీవీ రామసుబ్బారెడ్డిని డీన్‌గా నియమించారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్లు తదితర వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. కశాళాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టనున్నారు. అంతవరకు స్విమ్స్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పజెప్పారు.