తిరుపతి, న్యూస్‌లైన్: స్విమ్స్‌కు అనుబంధంగా శ్రీపద్మావతి అమ్మవారి పేరుతో ఏర్పాటు అవుతున్న తొలి మహిళా మెడికల్ కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 2014-15 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించే లక్ష్యం తో పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రభుత్వ స్థలంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంట విమానాశ్రయం వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం మార్కెట్ ధరకు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని స్విమ్స్‌కు కేటాయిం చారు. అక్కడ టీటీడీ సహకారంతో మెడికల్ కళాశాల, ఫార్మసీ కళాశాల, స్విమ్స్ పరిపాలన భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్విమ్స్ నిధులతో ప్రభుత్వం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కళాశాల కోసం నిర్మాణాలు ప్రారంభించారు.
మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించేందుకు టీటీడీ గతంలో ఇచ్చిన హామీని విరమించుకుంది. దాంతో పద్మావతి మెడికల్ కళాశాల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు కంచి మఠం ముందుకు వచ్చింది. స్విమ్స్ అధికారులు కంచి మఠం ప్రతినిధులు సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. అయితే ఆ ఒప్పందం కూడా అటకెక్కింది.
మెడికల్ కళాశాలను తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ కంచిమఠం నిర్వాహకులు అడ్డం తిరిగారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు టీటీడీ వెనక్కు తగ్గడంతో కంచిమఠం ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటుకు అప్పటి రోశయ్య ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.అయితే అది కూడా వివాదాస్పదమై వ్యవహారం కోర్టుకు చేరింది.
తిరుపతిలోనే మెడికల్ కళాశాల
ఈ నేపథ్యంలో తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ఏరియాలో మహిళలకోసం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.దాంతో పనులు ప్రారంభించి, వచ్చే విద్యాసంవత్సరానికల్లా పూర్తిచేసి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేసిన అధికారులు ఎస్వీ మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, గతంలో స్విమ్స్ జనరల్ సర్జన్‌గా పనిచేసిన డాక్టర్ పీవీ రామసుబ్బారెడ్డిని డీన్‌గా నియమించారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్లు తదితర వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. కశాళాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టనున్నారు. అంతవరకు స్విమ్స్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పజెప్పారు.
వేగంగా మెడికల్ కళాశాల పనులు
Published Sat, May 10 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement