చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజైన బుధవారం ఉదయం హరి అంతరంగ అలిమేలు మంగ సర్వభూపాలునిపై ఉట్టి కృష్ణుడు అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు.
ఉదయం ఏడు గంటలకు అమ్మవారిని అద్దాల మహల్ నుంచి వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర స్వర్ణాభరణాలతో అమ్మవారిని చేతితో ఉట్టి కొడుతున్న శ్రీకృష్ణుడిగా అలంకరించారు. ఎనిమిది గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు సర్వభూపాల వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.
స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మి
అమ్మవారు సాయంత్రం సౌభాగ్యలక్ష్మిగా స్వర్ణరథంపై తిరువీధుల్లో భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ముందు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపిణిగా అలంకరించి రథ మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు.
సాయంత్రం 4.20 గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు నడుమ సర్వతేజోమయి అయిన అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి గరుడ వాహనంపై శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు తిరువీధుల్లో విహరించారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment