రాత్రి అశ్వవాహనంపై విహరించిన ఆనందనిలయుడు
నేడు చక్రస్నానం
తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామి మహారథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఈ రథోత్సవం వేడుకగా సాగింది. అనంతరం సుమారు గంట పాటు పండితులు నిర్వహించిన వేదగోష్ఠితో తిరుమల సప్తగిరులు పులకించాయి. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం రథాన్ని లాగారు.
అశ్వవాహనంపై ఆనంద నిలయుడి దర్శనం
రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై భక్తులను పరవశింపజేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలు, విశేష పుష్పాలంకరణాంతరం స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తురగ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.
నేడు చక్రస్నానం
శనివారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇది ముగిసాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం ఉదయం 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment