
సాక్షి, విజయవాడ : దశలవారీ మద్య నిషేధంలో భాగంగానే ధరలను క్రమబద్దీకరించామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. కొందరు పేదలు శానిటైజర్లు తాగి చనిపోవడం చాలా బాధాకరమని, అందుకే చీప్ లిక్కర్‌పై ధరలను తగ్గించామని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 వేల బెల్ట్ షాపులు తొలగించామని, ఇప్పటికే 33 శాతం మద్యం షాపులు, బార్లను తగ్గించామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశల వారిగా మద్య నిషేధానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ కేంద్రాల్లో అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబడిన విషయాన్ని ఉపముఖ్యమంత్రి గుర్తుచేశారు. (ఇంగ్లిష్ లేకుంటే మీ ముందు ఇలా మాట్లాడగలిగేవాడినా?)
దాదాపు 80 శాతం మంది టీడీపీ నేతలు అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న సంగతి వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచినట్లే ఇప్పుడు కూడా చంద్రబాబు అలాగే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందన్నారు. కానీ, సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని ఏర్పాటు చేశారని నారాయణ స్వామి వెల్లడించారు. దీని ద్వారా మూడు నెలల్లో 36 వేల కేసులుపెట్టి 46 వేల మందిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. (తొలుత ఉత్తర్వులు.. ఆపై సవరణ)
Comments
Please login to add a commentAdd a comment