appala nayudu
-
బయటపడిన ఖాకీల ‘బండారం’
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు విషయంలో త్రీ టౌన్ పోలీసుల బండారం బయటపడింది. ఈ కేసు విషయంలో వారు అపకీర్తిని మూటగట్టుకున్నారు. బీచ్‌రోడ్డులో బీభత్సం సృష్టించి బైకుపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడడానికి కారకుడైన అప్పలనాయుడుని సకాలంలో అరెస్టు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో అప్పలనాయుడు నడుపుతున్న కారు (ఏపీ31డీపీ 6666) అదుపు తప్పి బైకుని ఢీకొన్న తరువాత ఆర్కేబీచ్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన మెడికల్ విద్యార్థి స్నేహితులు రావడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో అప్పలనాయుడు, అతని స్నేహితులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రోజూ బీచ్‌రోడ్డులో త్రీ టౌన్ పోలీసుల రాత్రి గస్తీ ఉంటుంది. ఏఎస్ఐ రాజేశ్వరరావు, ఇతర పోలీసులు వెళ్లేసరికే నిందితులు పారిపోయారని త్రీటౌన్ పోలీసులు చెబుతున్నారు. పైగా నిందితులు కారు వెనుక వైపు గల నెంబర్ ప్లేట్ సైతం మాయం చేయడానికి ప్రయత్నించారంటే ఎంతగా బరితెగించారో ఇట్టే అర్ధం అవుతుంది. ఆర్కేబీచ్లో గల సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించ లేదంటే ఎంత నత్తనడకన దర్యాప్తు చేశారన్నది తెలుస్తోంది. మీడియాకి తెలియనివ్వకుండా... త్రీ టౌన్ పోలీసులపై ఈ కేసు విషయమై మొదటి నుంచీ తెలుగుదేశం నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు అప్పలనాయుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్టేషన్లో లొంగిపోవడం వల్లనే అరెస్టు చూపించారే తప్ప వారంతట వారు అరెస్టు చేసిన పాపాన పోలేదు. ఫలితంగానే నిందితుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టే అవకాశం లేకపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కారులో ఉన్న వారు మద్యం సేవించి ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు 24 గంటలలోపు అరెస్టు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేస్తే నిజం నిగ్గు తేలేది. ఆదివారం పెందుర్తిలోని అప్పలనాయుడు ఇంటికి పోలీసులు వెళ్లారని చెబుతున్నప్పటికీ... ఎవరు వెళ్లారన్నది మాత్రం మీడియాకి చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా వివాదాస్పద చరిత్ర ఉన్న అప్పలనాయుడుని త్రీటౌన్ పోలీసులు కావాలనే అరెస్టు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ నిందితుడు అరెస్టు అయిన విషయం కూడా పోలీసులు మీడియాకి పొక్కనీయలేదంటే తెలుగుదేశం పారీ్టకి ఎంతగా తొత్తుల్లా వ్యవహరించారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బండారు పరువు పోతే ఎలా అనుకున్నారో ఏమోగానీ పోలీసులు మాత్రం విషయం బయటకు పొక్కనీయలేదు. ఇక సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిందితుడు అప్పలనాయుడుకి 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఈ విషయం కూడా రాత్రి 7.30 గంటల వరకు మీడియాకి చెప్పకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నా చితకా కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తే హడావిడి చేసే త్రీటౌన్ పోలీసులు బడాబాబుల కుమారులను అరెస్టు చేసినపుడు మాత్రం గోప్యంగా ఉంచడం తీవ్ర దుమారం రేపుతోంది. సదరు నిందితుడు మంగళవారం కోర్టులో హాజరవుతాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసుని త్రీ టౌన్ సీఐ కె.రామారావు పర్యవేక్షణలో ఎస్.ఐ.జి.హరీష్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, క్షతగాత్రులలో ఒకరైన మెడికో చంద్రకిరణ్ ఆదివారం రాత్రి మళ్లీ కేజీహెచ్‌లో చికిత్స కోసం చేరారు. కారు ప్రస్తుతం పోలీసుల స్వా«దీనంలో ఉంది. మద్యం విక్రయాలు ఎలా..? ప్రభుత్వం మద్య నియంత్రణలో భాగంగా దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడుతున్నాయి. బార్లు రాత్రి 11 గంటలకు మూతపడుతున్నాయి. మరి బండారు అప్పలనాయుడు మిత్ర బృందం అర్ధరాత్రి ఎలా మద్యపానం చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. మద్యం మత్తులో ఉండడం వల్లనే అదుపు తప్పి ప్రమాదం చేశారని బాధితులు, స్థానికులు అంటున్నారు. ఇకనైనా అర్ధరాత్రి మద్యం విక్రయాలను ఎక్సైజ్ పోలీసులు అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. -
స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరుతో 30 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, ఒక్కరే నామినేషన్ వేసినందున సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం ఉదయం ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. సభా నాయకుడు, ఇతర పక్షాల నేతలు గౌరవప్రదంగా స్పీకర్‌ను సీటు వద్దకు తీసుకువచ్చి కూర్చోబెట్టాలని ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు మంత్రులు, టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు స్పీకర్‌ను ఆయన స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం స్థానం నుంచి లేయలేదు. స్పీకర్ స్థానంలో కూర్చున్న తమ్మినేని సీతారాం సభ్యులందరికీ నమస్కారాలు చేశారు. స్పీకర్‌ను అభినందిస్తూ సభానాయకుడు, ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేత, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి తదితరులు అధికార పక్షాన్ని తప్పుబట్టే యత్నం చేశారు. మీ మైక్ ఇట్లుంది: చంద్రబాబు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక కావడం అభినందనీయమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చిన్నగా మాట్లాడటంతో సరిగ్గా వినిపించలేదు. దీంతో వినిపించలేదని, కొంచెం గట్టిగా మాట్లాడాలని అధికార పక్ష సభ్యులు కోరగా.. ‘‘మీ మైక్ ఇట్లుంది. మీ నిర్వహణలోని మైక్ ఇలా ఉంది’’ అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ మైక్‌లు మీరు (చంద్రబాబు) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవేనని అధికార పక్ష సభ్యులు అనడంతో, నేను వివాదాల జోలికి వెళ్లదలచుకోలేదని బాబు అన్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా స్పీకర్లను అందించే జిల్లాగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. మన శాసనసభ మార్గదర్శకం కావాలి: బుగ్గన ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభను భారతదేశానికే మార్గదర్శకంగా మార్చాలని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. చట్టసభల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పి, పదవులు ఇచ్చి, వారి సొంత పార్టీపైనే విమర్శలు చేయించిందని గుర్తుచేశారు. ఈ పద్ధతిని మార్చి ఉన్నత సంప్రదాయాలు నెలకొల్పడమే సభా నాయకుడి లక్ష్యమని చెప్పారు. శ్రీకాకుళం గౌరవం ఇనుమడించింది: ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నిక కావడంతో శ్రీకాకుళం జిల్లా గౌరవం మరోసారి ఇనుమడించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన పదవి లభించిందనే భావన రాష్ట్రమంతటా వచ్చిందన్నారు. తమ్మినేనికి అరుదైన గౌరవం లభించినందుకు శ్రీకాకుళం జిల్లా వాసిగా తనకెంతో ఆనందంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో శాసనసభలో విలువలు, సంప్రదాయాలు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిని సరిదిద్ది సభ ఔన్నత్యాన్ని పెంచే అవకాశం సభా నాయకుడు జగన్మోహన్రెడ్డి స్పీకర్‌కు ఇచ్చారని, దాన్ని ఆయన సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు: పుష్ప శ్రీవాణి గిరిజన మహిళ అయిన తనను ఉప ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నిక కావడం తనకు, తమ ప్రాంతానికి ఎంతో ఆనందదాయమన్నారు. ‘‘2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను ఎన్నో ఆశలతో ఈ దేవాలయంలోకి అడుగు పెట్టాను. అప్పుడు సభ సజావుగా జరగలేదని బాధపడ్డాను. ఈ సభలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారని ఆశిస్తున్నాం. గిరిజనులు, మహిళల సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలి’’ అని ఆమె కోరారు. అలాంటి ఘటనలు పునరావృతం కారాదు: రాజన్నదొర గత శాసనసభలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కారాదన్నదే సభా నాయకుడి ఆశయమని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. తమ్మినేని సీతారాం చాలా అనుభవజ్ఞుడు, రాజ్యాంగం, సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి అని, సభ గౌరవాన్ని, ప్రమాణాలను ఆయన పెంచుతారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. గత పాలకులు స్పీకర్ పదవికి అపకీర్తి తెచ్చారు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశించినట్లే స్పీకర్‌గా తమ్మినేని మంచి పేరుతెచ్చుకుంటారన్న విశ్వాసం తనకు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ‘‘గతంలో ప్రతిపక్ష నాయకుడికి ఐదు నిమిషాలైనా మైక్ ఇచ్చేవారు కాదు. మైక్ ఇచ్చిన వెంటనే కట్ చేసేవారు. మేమంతా నిరసనగా పోడియంలోకి వెళ్లగానే మంత్రులతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఏవేవో మాట్లాడించేవారు. గత పాలకులు స్పీకర్ పదవికి ఇలా అపకీర్తి తెచ్చారు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కొత్త సభ్యులకు అవకాశం కల్పించాలి: వసంత కృష్ణ ప్రసాద్ కొత్త సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. కొత్తగా సభలోకి వచ్చిన తమలాంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఒకవేళ ప్రతిపక్షం పారిపోతే సభ ఉప్పులేని పప్పులా చప్పగా మారుతుందని వ్యాఖ్యానించారు. సభ ఔన్నత్యాన్ని పెంచాలి: బొత్స సత్యనారాయణ ‘‘నేను ఎంపీగా పార్లమెంట్లో, ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా అసెంబ్లీని చూశాను. గత సభలో నేను లేనుగానీ టీవీల్లో ఇక్కడ జరిగినవన్నీ చూశాను. ఏమిటిలా సభా సంప్రదాయాలు దిగజార్చుతున్నారని బాధపడ్డా. స్పీకర్ తమ్మినేని సీతారాం సభ ఔన్నత్యం పెంచుతారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్వేచ్ఛను హరిస్తే చర్యలు తీసుకోవాలి: కోటంరెడ్డి గత ప్రభుత్వాల తీరు వల్లే స్పీకర్ల వ్యవస్థ దిగజారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలు నెలకొల్పే స్వేచ్ఛను స్పీకర్‌కు ఇచ్చారని వివరించారు. ఆ స్వేచ్ఛను హరిస్తే అధికార పక్షమా, ప్రతిపక్షమా అని చూడకుండా చర్యలు తీసుకుని సభ ఔన్నత్యాన్ని పెంచాలని స్పీకర్‌ను ఆయన కోరారు. సభాపతి స్థానం క్లిష్టమైనది: అంబటి రాంబాబు సభాపతిగా బాధ్యతల నిర్వహణ చాలా క్లిష్టమైన వ్యవహారమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గతంలో సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాలనేది సభా నాయకుడే నిర్ణయించేవాడని చెప్పారు. గతంలో సభాపతులు వ్యవహరించిన తీరు బాగోలేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కనీస విలువలు పాటించకుండా స్పీకర్‌ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టేందుకు రాకపోవడం బాధాకారమని అంబటి అన్నారు. చెడిపోయిన వ్యవస్థను బాగు చేస్తున్నారు: భూమన చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మార్పు తీసుకొస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు వేరే పార్టీ నుంచి తమ పార్టీలోకి రావాలంటే ముందుగానే వారి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని సీఎం ప్రకటించారని గుర్తచేశారు. చెడిపోయిన వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దడానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఫిరాయింపుల నిషేధ చట్టంపై చర్చ జరగాలి: బుచ్చయ్య చౌదరి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంపై చర్చ జరగాలని, మంచి చట్టం తేవాలని టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి అనగా మరోసారి దీనిపై చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. అచ్చెన్నాయుడు వర్సెస్ శ్రీకాంత్‌రెడ్డి సభాపతి తమ్మినేని సీతారాంను అభినందించేందుకు లేచిన టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను అధికార పక్షం ఖండించింది. రెండో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక కావడం శ్రీకాకుళం జిల్లా వాసిగా తనకెంతో సంతోషదాయకమన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తప్పుబట్టింది. ‘‘గతంలో ఎవరు అధికారంలో ఉన్నా ఫలానా వారిని స్పీకర్‌గా చేద్దామంటూ ప్రతిపక్షం వారికి ప్రతిపాదన పంపే సంప్రదాయం ఉంది. అలాగే ఇప్పుడు కూడా చేస్తే సంతోషించేవాళ్లం. కోడెల శివప్రసాదరావును స్పీకర్‌గా ఎన్నిక చేసే సమయంలో మేం ఈ సంప్రదాయాన్ని పాటించాం. ప్రస్తుత స్పీకర్‌ను సీటు వద్దకు తీసుకెళ్లేప్పుడు సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని కూడా పిలిస్తే సంతోషించేవాళ్లం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. ‘‘నిజాలు మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందని తెలుగుదేశం నాయకులకు ముని శాపం ఉన్నట్లుంది. అందుకే అబద్ధాలు మాట్లాడుతున్నారు. స్పీకర్‌ను సీటు వద్దకు తీసుకెళ్లాలని సభా నాయకుడికి, అన్ని పక్షాల నాయకులకు ప్రోటెం స్పీకర్ సూచించారు. వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను స్పీకర్ స్థానంలోకి తీసుకెళ్లడం ఇష్టం లేకే చంద్రబాబు రానట్లుంది’’ అని శ్రీకాంత్‌రెడ్డి చురక అంటించారు. -
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మేము
సాక్షి, విజయనగరం: రాష్ట్ర శాసనసభలో విజయనగరం జిల్లా కళకళ లాడింది. జిల్లాకు చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీవారే కావడం ఒక ఎత్తయితే... అందులో ఒకరు డిప్యూటీ సీఎం కావడం మరో ప్రత్యేకత. అంతేకాదు... రాష్ట్రంలోని సీఎం, ప్రతిపక్షనేతతో సహా అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ శంబంగి మన జిల్లావారు కావడం మరో విశేషం. మొత్తమ్మీద రాష్ట్ర శాసనసభ చరిత్ర పుటల్లో మరోసారి విజయనగరం జిల్లాకు సముచిత స్థానం లభించడం ఈ జిల్లావాసులకు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదిహేనవ శాసన సభ బుధవారం కొలువుతీరింది. విజయనగరం జిల్లాకు ఆదినుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా నుంచే ఉద్దండులైన ఎందరో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇన్నాళ్లూ జిల్లాకు ఉన్న గుర్తింపు ఒకెత్తయితే ఇప్పుడు వచ్చిన గుర్తింపు మరొకెత్తు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జిల్లాలోని విజయనగరం పార్లమెంట్‌తో పాటు, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించింది. క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాకు రెండు మంత్రి పదవులను ఇచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారు. అక్కడితో ఆగిపోకుండా ఉపముఖ్యమంత్రి పదవిని కూడా జిల్లాకే కేటాయించి మరింత గౌరవాన్ని పెంచారు. అప్పటికీ సరిపెట్టకుండా సీఎంతో పాటు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ బాధ్యతను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అప్పగించి రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించారు. దీంతో శాసనసభలో విజయనగరం జిల్లా ప్రత్యేకంగా కనిపించింది. జిల్లా మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు చేత ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. నిలిచిన శంబంగి ఆత్మగౌరవం రాష్ట్ర శాసనసభలో ప్రమాణస్వీకారోత్సవాన్ని మాత్రమే అందరూ చేశారు. అయితే ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాత్రం తన ఆత్మగౌరవాన్ని తలెత్తుకునేలా చేశారు. విషయం ఎమిటంటే శంబంగి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. అప్పట్లో హైదరాబాద్‌లో ఒక ఎమ్మెల్యే, తెర్లాంలో ఒక ఎమ్మెల్యే చనిపోయారు. బై ఎలక్షన్ వచ్చింది. నామినేషన్‌కు ఆఖరి రోజు వరకు టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు అభ్యర్థి పేరు ప్రకటించలేదు. నామినేషన్ ముందురోజు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని అభ్యర్థిగా వేస్తున్నట్లు శంబంగికి చెప్పారు. ఆయనకు ఏ ప్రాతిపదికన టిక్కెట్ ఇచ్చారని, మీరు తీసుకున్న నిర్ణయం కూడా తప్పని చంద్రబాబుకి చెప్పినా వినలేదు. ఒకసారి వచ్చి సమస్య పరిష్కరించాల్సిందిగా అర్థించారు. రావడానికి తనకు ఖాళీ లేదన్నారు చంద్రబాబు. ఇది రాజకీయ సమస్య కాబట్టి మీరు ఒకసారి ఖాళీ చేసుకుని రావాల్సిందేనని శంబంగి నచ్చజెప్పినా తనకు ఖాళీ అయ్యాక చెబుతానంటూ నిర్లక్ష్యంగా చంద్రబాబు బదులిచ్చారు. ఆ మాటకు నొచ్చుకున్న శంబంగి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీలో కొనసాగలేనంటూ టీడీపీని వదిలి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ హోదాలో ఉన్న శంబంగి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు ప్రొటెం స్పీకరైన శంబంగి వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని మరీ అభివాదం చేశారు. -
ప్రొటెం స్పీకర్‌గా శంబంగి?
సాక్షి, అమరావతి : నూతనంగా సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులవుతారని విశ్వసనీయ సమాచారం. శంబంగి బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావును ఓడించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైతే శంబంగి శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన పదవీకాలం ముగుస్తుంది. -
ఎంతటి వారైనా..ఏడుకు తలొంచాల్సిందే..
సాక్షి, నెల్లిమర్ల: నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడోసారి సెంటిమెంట్ బలంగా ఉంది. ఆరుసార్లు ఓటమి లేకుండా వరుసగా ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజకీయ ఉద్ధండులు సైతం ఏడోసారి ఓటమి చవిచూశారు. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటివరకు సతివాడ, భోగాపురం నియోజకవర్గాలుండేవి. సతివాడ నియోజకవర్గంలో సీనియర్ నేత, ప్రస్తుత వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తిరుగులేని విజయం సాధించారు. అయితే 1994లో ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన టీడీపీ అభ్యర్థి పొట్నూరు సూర్యనారాయణ చేతిలో మొట్టమొదటి సారిగా ఓటమి చూశారు. అనంతరం 1999, 2004 లోనూ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. అలాగే భోగాపురం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా పేరున్న పతివాడ నారాయణస్వామి నాయుడుకు కూడా ఏడు సెంటిమెంట్ తగిలింది. ఆ నియోజకవర్గంలో 1983 నుంచి 2009 వరకు ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ ఓడిపోలేదు. అయితే 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఏడోసారి బరిలో దిగిన పతివాడ అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇప్పటి వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014 ఎన్నికల్లో పతివాడ కూడా గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో ఏడు సెంటిమెంటు బాగా పనిచేసిందని ఓటర్లు ఇప్పటికీ చర్చించుకుంటారు. మంత్రులుగా.. ప్రోటెం స్పీకర్లుగా పనిచేసిన నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు రాజకీయ ఉద్ధండులు ఏడోసారి ఓడిపోవడం నిజంగానే ’సెంటిమెంటేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
చెప్పింది వినాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: ఈ మధ్య కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తనయులు, కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేల మాదిరిగా అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. అసలై ఒత్తిడితో పనిచేస్తున్న అధికారులు వీరు తీరుతో మనోవేదనకు గురవుతున్నారు. ఓ పక్క ఎమ్మెల్యేలకు మరో పక్క వారి కుటుంబ సభ్యులకు కూడా జీ హుజూర్ అంటూ భయపడి ఎంతకాలం విధులు నిర్వర్తిస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా అధికారులపై పెత్తనం చలాయిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే తనయునిగా పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటే ఎవరు తప్పు పట్టరు కానీ.. అధికారి కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నింటా పెత్తనం వెలగబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ముదపాక భూముల వ్యవహారంలో కానీ.. నియోజకవర్గంలో జరిగే భూ కబ్జాలు, దందాలపై ఎవరైనా విమర్శిస్తే చాలు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఒంటికాలుపై విరుచుకుపడుతుంటారు. మిత్ర పక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేనైనా సరే కడిగిపారేస్తుంటారు. తాజాగా తానేమి తీసిపోలేదన్నట్టుగా ఆయన తనయుడు బండారు అప్పలనాయుడు కూడా షాడో ఎమ్మెల్యే తరహాలో అధికారులపై విరుకుపడుతున్నారు. ఎమ్మెల్యే మాదిరిగా అన్నీ తానై అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు... అధికార యంత్రాంగంపై అడుగడుగునా పెత్తనం చలాయిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే చెబితే వింటాం.. ఏదైనా మాట అంటే పడతాం. కానీ ఆయన తనయుడు కూడా చీటికిమాటికి తమపై పెత్తనం చలాయిస్తే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మందు చులకన చేసేలా మమ్మల్ని నిలదీస్తుంటే ఏ విధంగా సమాధానం చెబుతామని వాపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యే బండారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే.. శనివారం అధికారులను వెంటేసుకొని ఆయన తనయుడు పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. సుజాతనగర్‌లోని పలు కాలనీల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల ఎదుటే వారిని కడిగి పారేశారు. స్థానికులు డ్రైనేజీ సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నారు. నిధులు మంజూరు చేయాల్సింది పోయి.. ఇంకా ఎందుకు పనులు చేపట్టలేదంటూ కాలనీ వాసుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేయడంతో చిన్న బుచ్చుకోవడం అధికారులు వంతైంది. ఇలా ఎమ్మెల్యే బండారు లేని రోజుల్లో ఆయన తనయుడు ఇలా సమావేశాలు, సమీక్షల నిర్వహించేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సభావేదిక లెక్కేస్తున్నారు. ఎమ్మెల్యేల తరహాలో ఉపన్యాసాలిచ్చేస్తున్నారు. సీఎం పర్యటనల్లోనే కాదు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సైతం అన్నింటా తానై పెత్తనం చలాయిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు చేస్తున్న పెత్తనం తట్టుకోలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా అయితే తాము పని చేయలేమంటూ వాపోతున్నారు. ఎమ్మెల్యే ఊళ్లో లేనప్పుడు జిల్లా స్థాయి అధికారులు, జెడ్సీ స్థాయి అధికారులను ఇంటికి పిలిపించుకొని సమీక్షలు నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెబితే వెళ్లాల్సిన అధికారులు వారు కుమారులు పిలిచినా వెళ్లడం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంస్కృతికి అధికారులు బ్రేక్ చేయాలని పలువురు కోరుతున్నారు. -
శ్రీకాకుళం టీడీపీలో ముసలం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నేతలు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. టీడీపీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.