స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక | Tammineni Sitaram Elected unanimously as Speaker of AP Assembly | Sakshi
Sakshi News home page

స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక

Published Fri, Jun 14 2019 4:15 AM | Last Updated on Thu, Jul 11 2019 9:04 PM

Tammineni Sitaram Elected unanimously as Speaker of AP Assembly - Sakshi

స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సభాపతి స్థానానికి తోడ్కొని వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ప్రొటెం స్పీకర్‌ శంబంగి తదితరులు. అభివాదం చేస్తున్న తమ్మినేని

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరుతో 30 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, ఒక్కరే నామినేషన్‌ వేసినందున సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం ఉదయం ప్రొటెం స్పీకర్‌ శంబంగి వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. సభా నాయకుడు, ఇతర పక్షాల నేతలు గౌరవప్రదంగా స్పీకర్‌ను సీటు వద్దకు తీసుకువచ్చి కూర్చోబెట్టాలని ప్రొటెం స్పీకర్‌ ప్రకటించగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు మంత్రులు, టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌ తదితరులు స్పీకర్‌ను ఆయన స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం స్థానం నుంచి లేయలేదు. స్పీకర్‌ స్థానంలో కూర్చున్న తమ్మినేని సీతారాం సభ్యులందరికీ నమస్కారాలు చేశారు. స్పీకర్‌ను అభినందిస్తూ సభానాయకుడు, ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేత, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి తదితరులు అధికార పక్షాన్ని తప్పుబట్టే యత్నం చేశారు. 

మీ మైక్‌ ఇట్లుంది: చంద్రబాబు 
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రెండో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక కావడం అభినందనీయమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చిన్నగా మాట్లాడటంతో సరిగ్గా వినిపించలేదు. దీంతో వినిపించలేదని, కొంచెం గట్టిగా మాట్లాడాలని అధికార పక్ష సభ్యులు కోరగా.. ‘‘మీ మైక్‌ ఇట్లుంది. మీ నిర్వహణలోని మైక్‌ ఇలా ఉంది’’ అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ మైక్‌లు మీరు (చంద్రబాబు) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవేనని అధికార పక్ష సభ్యులు అనడంతో, నేను వివాదాల జోలికి వెళ్లదలచుకోలేదని బాబు అన్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా స్పీకర్లను అందించే జిల్లాగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

మన శాసనసభ మార్గదర్శకం కావాలి: బుగ్గన 
ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను భారతదేశానికే మార్గదర్శకంగా మార్చాలని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కోరారు. చట్టసభల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పి, పదవులు ఇచ్చి, వారి సొంత పార్టీపైనే విమర్శలు చేయించిందని గుర్తుచేశారు. ఈ పద్ధతిని మార్చి ఉన్నత సంప్రదాయాలు నెలకొల్పడమే సభా నాయకుడి లక్ష్యమని చెప్పారు. 

శ్రీకాకుళం గౌరవం ఇనుమడించింది: ధర్మాన ప్రసాదరావు
తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నిక కావడంతో శ్రీకాకుళం జిల్లా గౌరవం మరోసారి ఇనుమడించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన పదవి లభించిందనే భావన రాష్ట్రమంతటా వచ్చిందన్నారు. తమ్మినేనికి అరుదైన గౌరవం లభించినందుకు శ్రీకాకుళం జిల్లా వాసిగా తనకెంతో ఆనందంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో శాసనసభలో విలువలు, సంప్రదాయాలు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిని సరిదిద్ది సభ ఔన్నత్యాన్ని పెంచే అవకాశం సభా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు ఇచ్చారని, దాన్ని ఆయన సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారు: పుష్ప శ్రీవాణి  
గిరిజన మహిళ అయిన తనను ఉప ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నిక కావడం తనకు, తమ ప్రాంతానికి ఎంతో ఆనందదాయమన్నారు. ‘‘2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను ఎన్నో ఆశలతో ఈ దేవాలయంలోకి అడుగు పెట్టాను. అప్పుడు సభ సజావుగా జరగలేదని బాధపడ్డాను. ఈ సభలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారని ఆశిస్తున్నాం. గిరిజనులు, మహిళల సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలి’’ అని ఆమె కోరారు. 

అలాంటి ఘటనలు పునరావృతం కారాదు: రాజన్నదొర
గత శాసనసభలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కారాదన్నదే సభా నాయకుడి ఆశయమని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. తమ్మినేని సీతారాం చాలా అనుభవజ్ఞుడు, రాజ్యాంగం, సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి అని, సభ గౌరవాన్ని, ప్రమాణాలను ఆయన పెంచుతారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు.

గత పాలకులు స్పీకర్‌ పదవికి అపకీర్తి తెచ్చారు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆశించినట్లే స్పీకర్‌గా తమ్మినేని మంచి పేరుతెచ్చుకుంటారన్న విశ్వాసం తనకు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ‘‘గతంలో ప్రతిపక్ష నాయకుడికి ఐదు నిమిషాలైనా మైక్‌ ఇచ్చేవారు కాదు. మైక్‌ ఇచ్చిన వెంటనే కట్‌ చేసేవారు. మేమంతా నిరసనగా పోడియంలోకి వెళ్లగానే మంత్రులతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఏవేవో మాట్లాడించేవారు. గత పాలకులు స్పీకర్‌ పదవికి ఇలా అపకీర్తి తెచ్చారు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 

కొత్త సభ్యులకు అవకాశం కల్పించాలి: వసంత కృష్ణ ప్రసాద్‌
కొత్త సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ కోరారు. కొత్తగా సభలోకి వచ్చిన తమలాంటి వారికి  మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఒకవేళ ప్రతిపక్షం పారిపోతే సభ ఉప్పులేని పప్పులా చప్పగా మారుతుందని వ్యాఖ్యానించారు. 

సభ ఔన్నత్యాన్ని పెంచాలి: బొత్స సత్యనారాయణ 
‘‘నేను ఎంపీగా పార్లమెంట్‌లో, ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా అసెంబ్లీని చూశాను. గత సభలో నేను లేనుగానీ టీవీల్లో ఇక్కడ జరిగినవన్నీ చూశాను. ఏమిటిలా సభా సంప్రదాయాలు దిగజార్చుతున్నారని బాధపడ్డా. స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభ ఔన్నత్యం పెంచుతారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

స్వేచ్ఛను హరిస్తే చర్యలు తీసుకోవాలి: కోటంరెడ్డి 
గత ప్రభుత్వాల తీరు వల్లే స్పీకర్ల వ్యవస్థ దిగజారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలు నెలకొల్పే స్వేచ్ఛను స్పీకర్‌కు ఇచ్చారని వివరించారు. ఆ స్వేచ్ఛను హరిస్తే అధికార పక్షమా, ప్రతిపక్షమా అని చూడకుండా చర్యలు తీసుకుని సభ ఔన్నత్యాన్ని పెంచాలని స్పీకర్‌ను ఆయన కోరారు. 

సభాపతి స్థానం క్లిష్టమైనది: అంబటి రాంబాబు
సభాపతిగా బాధ్యతల నిర్వహణ చాలా క్లిష్టమైన వ్యవహారమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గతంలో సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాలనేది సభా నాయకుడే నిర్ణయించేవాడని చెప్పారు. గతంలో సభాపతులు వ్యవహరించిన తీరు బాగోలేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కనీస విలువలు పాటించకుండా స్పీకర్‌ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టేందుకు రాకపోవడం బాధాకారమని అంబటి అన్నారు. 

చెడిపోయిన వ్యవస్థను బాగు చేస్తున్నారు: భూమన
చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మార్పు తీసుకొస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు వేరే పార్టీ నుంచి తమ పార్టీలోకి రావాలంటే ముందుగానే వారి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని సీఎం ప్రకటించారని గుర్తచేశారు. చెడిపోయిన వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దడానికి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. 

ఫిరాయింపుల నిషేధ చట్టంపై చర్చ జరగాలి: బుచ్చయ్య చౌదరి
పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంపై చర్చ జరగాలని, మంచి చట్టం తేవాలని టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి అనగా మరోసారి దీనిపై చర్చిద్దామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. 

అచ్చెన్నాయుడు వర్సెస్‌ శ్రీకాంత్‌రెడ్డి 
సభాపతి తమ్మినేని సీతారాంను అభినందించేందుకు లేచిన టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను అధికార పక్షం ఖండించింది. రెండో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక కావడం శ్రీకాకుళం జిల్లా వాసిగా తనకెంతో సంతోషదాయకమన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది. ‘‘గతంలో ఎవరు అధికారంలో ఉన్నా ఫలానా వారిని స్పీకర్‌గా చేద్దామంటూ ప్రతిపక్షం వారికి ప్రతిపాదన పంపే సంప్రదాయం ఉంది. అలాగే ఇప్పుడు కూడా చేస్తే సంతోషించేవాళ్లం.

కోడెల శివప్రసాదరావును స్పీకర్‌గా ఎన్నిక చేసే సమయంలో మేం ఈ సంప్రదాయాన్ని పాటించాం. ప్రస్తుత స్పీకర్‌ను సీటు వద్దకు తీసుకెళ్లేప్పుడు సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని కూడా పిలిస్తే సంతోషించేవాళ్లం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. ‘‘నిజాలు మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందని తెలుగుదేశం నాయకులకు ముని శాపం ఉన్నట్లుంది. అందుకే అబద్ధాలు మాట్లాడుతున్నారు. స్పీకర్‌ను సీటు వద్దకు తీసుకెళ్లాలని సభా నాయకుడికి, అన్ని పక్షాల నాయకులకు ప్రోటెం స్పీకర్‌ సూచించారు. వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను స్పీకర్‌ స్థానంలోకి తీసుకెళ్లడం ఇష్టం లేకే చంద్రబాబు రానట్లుంది’’ అని శ్రీకాంత్‌రెడ్డి చురక అంటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement