సాక్షి, అమరావతి: గత శాసనసభలో అధికార టీడీపీ చేసిన అన్యాయాలకు దేవుడు, ప్రజలు కలిసి సరైన జడ్జిమెంట్ ఇచ్చారని, అయినా కుక్క తోక వంకర అన్న చందంగా టీడీపీ తీరు మారడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత శాసనసభలో 23మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని, ముగ్గురు ఎంపీలను కూడా కొనుగోలు చేశారని, చివరకు ఏం జరిగిందని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. పైన దేవుడు, ప్రజలు కలిసి గూబ గూయ్‌మనే రీతిలో ఈ అన్యాయాలను తిప్పికొట్టారని, అన్యాయం చేసిన మాదిరిగానే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇచ్చారని, అదీ కూడా సరిగ్గా 23వ తారీఖు నాడే ఇచ్చారని, దేవుడు, ప్రజలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్ ఇదని, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ ఉండదని పేర్కొన్నారు. స్పీకర్‌కు ధన్యవాద తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.
చంద్రబాబు మాదిరిగా ప్రలోభాలు పెట్టి.. మంత్రి పదవులు ఇస్తానని ఆశ పెట్టి ఉంటే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కి ఉండేది కాదని అన్నారు. ఎంతమంది టీడీపీ సభ్యులు తనతో టచ్‌లో ఉన్నారో చెప్పడం లేదని, అందుకు సంతోషపడాలని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులనే ఈ అన్యాయమైన సంప్రదాయం కొనసాగవద్దని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని, ప్రతిపక్ష సభ్యులు కొనసాగాలని, పరిస్థితులు పూర్తిగా మారిపోయి కొత్త సంప్రదాయం రావాలని తాము కోరుకుంటుంటే.. దానిని కూడా వక్రీకరించి.. టీడీపీ సభ్యులు అన్యాయంగా మాట్లాడుతున్నారని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment