దళితులను ముందుపెట్టి టీడీపీ చిల్లర రాజకీయాలు | YSR Congress Party Leaders Fires On TDP Leaders Politics | Sakshi
Sakshi News home page

దళితులను ముందుపెట్టి టీడీపీ చిల్లర రాజకీయాలు

Published Wed, Dec 2 2020 3:20 AM | Last Updated on Wed, Dec 2 2020 7:45 AM

YSR Congress Party Leaders Fires On TDP Leaders Politics - Sakshi

పోడియం వద్ద చుట్టిముట్టి స్పీకర్‌ను బెదిరిస్తున్న విపక్ష సభ్యులు

సాక్షి, అమరావతి: దళితులను ముందుకు ఎగదోసి తెలుగుదేశం పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని అధికార పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే ప్రతిరోజూ సభా కార్యక్రమాలు అడ్డుకుంటోందని మండిపడ్డారు. మార్షల్స్‌పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్లపై మంగళవారం టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే చర్చ జరగాల్సిందేనని టీడీపీ పట్టుబట్టింది. దీనితో పాటు వ్యవసాయ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సహా మంత్రులు స్పష్టం చేసినా తెలుగుదేశం సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. ఎవరి మాటా విన్పించకుండా గందరగోళం సృష్టించారు  ఆ పార్టీ సభ్యుడు బాల వీరాంజనేయ స్వామి ఏకంగా స్పీకర్‌ స్థానం వద్దకెళ్ళి పేపర్‌ ఇచ్చి దీన్ని చదవమంటూ ఆదేశించడంతో స్పీకర్‌ మండిపడ్డారు.

ఇదేం మర్యాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన సభా సమయాన్ని ఉద్ధేశపూర్వకంగా వృధా చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ప్రతి వ్యవహారంలోనూ దళితులను ముందుకు నెట్టి రాజకీయం చేయడం టీడీపీకి అలవాటైందని విమర్శించారు. దళితులను అవమానించడం, బలి చేయడం చంద్రబాబుకు అలవాటైందని మంత్రి నారాయణస్వామి అన్నారు. ప్రతిపక్షం ఏ అంశంపై చర్చకు పట్టుబట్టినా ప్రభుత్వం అంగీకరిస్తోందని, చర్చ జరిగితే వాళ్ళ బండారం బయటకొస్తుందని రోజూ ఏదో గొడవతో సభ నుంచి వెళ్తున్నారని మంత్రి అనిల్‌ మండిపడ్డారు. తాము చర్చిస్తామన్నా ఎందుకీ రగడని సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. అయినా విన్పించుకోకపోవడంతో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడిని ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. మార్షల్స్‌ రామానాయుడిని బయటకు పంపే ప్రయత్నం చేయగా, టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ మార్షల్స్‌పై దౌర్జన్యానికి దిగారు. టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా ఆ తర్వాత సస్పెన్షన్‌కు గురైన టీడీపీ సభ్యులు కూడా మార్షల్స్‌పై దాడి చేశారు.

సీఎంను మాట్లాడనివ్వకుండా గందరగోళం
టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జవాబు ఇచ్చే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం ముందు నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. విపక్షం లేనిపోని ఆరోపణలు కాకుండా విలువైన సూచనలు చేస్తే తీసుకుంటామని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తే వినే ఓపిక లేకపోతే ఎలా అని సీఎం అన్నారు. చంద్రబాబుకు సభలో ఉండే ఓపిక కూడా లేదని, ప్రెస్‌మీట్‌కు టైమ్‌ అయ్యిందని, ఎల్లో మీడియాలో రాయించుకునేందుకు వెళ్లిపోయేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయినా విపక్ష సభ్యులు తీరు మార్చుకోక పోవడంతో వారి సస్పెన్షన్‌కు మంత్రి బుగ్గన ప్రతిపాదించారు.

సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారన్న కారణంతో చంద్రబాబు మినహా 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే వారు సభ నుంచి బయటకు వెళ్లకుండా పోడియం ముందుకు వెళ్లి నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. బయటకు వెళ్లాలని స్పీకర్‌ పదేపదే ఆదేశించినప్పటికీ విన్పించుకోక పోవడంతో మార్షల్స్‌ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ  ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. మార్షల్స్‌ని కొట్టిన వారిలో బాల వీరాంజనేయులు, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌ ఉన్నారు. తర్వాత చంద్రబాబు కూడా సస్పెండ్‌ అయిన తన పార్టీ సభ్యులతో కలసి బయటకు వెళ్లిపోయారు. కాగా మార్షల్స్‌పై దాడి చేసిన విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ సభ్యులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సైతం మార్షల్‌ చొక్కా పట్టుకున్నారని తెలిపారు. దీంతో సీసీ కెమెరాల రికార్డులు పరిశీలిస్తానని స్పీకర్‌ చెప్పారు. 

సస్పెండ్‌ అయిన విపక్ష సభ్యులు వీరే
అచ్చెన్నాయుడు, అశోక్‌ బెందాళం, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జోగేశ్వరరావు, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్, గొట్టిపాటి రవికుమార్‌.  

పలు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు
అసైన్డ్‌ భూముల సవరణ బిల్లు, రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లు, విలువ ఆధారిత పన్ను రెండు, మూడు సవరణ బిల్లులు, వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగులపై పన్ను విధింపు సవరణ బిల్లులను స్పీకర్‌ అనుమతితో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, నారాయణ స్వామి సభలో ప్రవేశపెట్టారు. ఆక్వా ఫీడ్‌ నాణ్యత నియంత్రణ బిల్లుపై సభ చర్చించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement