చెల్లింపుల్లోనూ ప్రగతి.. ప్రజలకు వాస్తవాలు వివరించిన సీఎం జగన్‌ | CM Jagan explained Facts On Ap Government Payments | Sakshi
Sakshi News home page

చెల్లింపుల్లోనూ ప్రగతి.. అసెంబ్లీ వేదికగా వాస్తవాలు వివరించిన సీఎం జగన్‌

Published Sat, Sep 17 2022 9:33 AM | Last Updated on Sat, Sep 17 2022 9:39 AM

CM Jagan explained Facts On Ap Government Payments - Sakshi

సాక్షి, అమరావతి: చేసిన అప్పులు చెల్లించే విషయంలో, ద్రవ్య లోటు విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం మంచి పరిస్థితిలో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఈ మూడేళ్లలో చాలా మెరుగ్గా ఉందన్నారు. పన్నుల ఆదాయంలో అధిక భాగం రుణాల చెల్లింపులకే సరిపోతోందని దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి గత ప్రభుత్వం కంటే, ఈ ప్రభుత్వం అప్పుల చెల్లింపులో చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

2014 నుంచి 2019 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు ద్రవ్యలోటుతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌ సగటు ద్రవ్యలోటు 6.58 శాతంగా తేలిందని, ఈ మూడేళ్లలో (2019 – 2022) 5.73 శాతం మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిపై శుక్రవారం ఆయన అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ.. అప్పుల చెల్లింపులో వాస్తవాలను ప్రజలముందుంచారు. 2018–19లో చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వం రుణాల తిరిగి చెల్లింపులో వడ్డీ కింద రూ.15,342 కోట్లు, అసలు కింద రూ.13,545 కోట్లు.. మొత్తంగా రూ.28,886.69 కోట్లు చెల్లించిందని చెప్పారు.

అదే మన ప్రభుత్వం వచ్చాక 2021–22లో వడ్డీ కింద రూ.21,449 కోట్లు, అసలు కింద రూ.14,559 కోట్లు.. మొత్తంగా రూ.36,008 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. రాష్ట్ర సొంత ఆదాయం 2018–19లో రూ.62,426 కోట్లు అయితే.. అందులో రూ.28,886.69 కోట్లు.. 46.3 శాతం అప్పుల కోసం చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. 2021–22లో రూ.75,696 కోట్లు ఆదాయం ఉంటే.. అందులో 47.6 శాతం అప్పులు చెల్లించడానికి ఖర్చు చేశామన్నారు. కోవిడ్‌ సమయంలో అంటే 2021–22 ఏప్రిల్, మే నెలలో లాక్‌డౌన్‌ వల్ల మనకు రావాల్సిన ఆదాయానికి గండి పడిందని, అయినప్పటికీ ఇవాళ ఎకానమీ బాగుందని.. గ్రోత్‌ రేట్‌ పరుగులు తీస్తోందని తెలిపారు. ఈ ఐదేళ్లు ముగిసేసరికి గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం కచ్చితంగా మెరుగైన పని తీరు చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

మూల ధన వ్యయం మనమే ఎక్కువ
- రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు, సంపద సృష్టి కోసం కాకుండా ప్రజాకర్షక పథకాలు, కార్యక్రమాలకే నిధులు వ్యయం చేస్తోందని చంద్రబాబు, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే, మనందరి ప్రభుత్వం ఈ మూడేళ్లలో చాలా ఎక్కువ మొత్తాన్ని (క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌) మూల ధన వ్యయం కింద ఖర్చు చేసింది.

- విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న మనందరి ప్రభుత్వం వాటి కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో గణనీయ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇవన్నీ రాష్ట్ర  ప్రజల మంచి కోసం మనం చేస్తున్నాం.  

- మూలధన వ్యయం కింద గత ప్రభుత్వం 2014–15లో రూ.7265 కోట్లు, 2015–16లో రూ.15,042 కోట్లు, 2016–17లో రూ.15,707 కోట్లు, 2017–18లో రూ.16,280 కోట్లు, 2018–19లో రూ.21,845 కోట్లు ఖర్చు చేసింది. ఐదేళ్లలో మొత్తం రూ.76,139 కోట్లు ఖర్చు చేసింది. ఏటా అది సగటున రూ.15,228 కోట్లు.

- మనందరి ప్రభుత్వం వచ్చాక 2019–20లో మూలధన వ్యయంగా చేసిన ఖర్చు రూ.17,601 కోట్లు. 2020–21లో రూ.20,690 కోట్లు, 2021–22లో రూ.16,795 కోట్లు. ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.18,362.07 కోట్ల చొప్పున మొత్తం రూ.55,086 కోట్లు ఖర్చు చేసింది.  

- ఇదే సమయంలో కేంద్ర స్థాయిలో మూలధన వ్యయం (గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ జీఎఫ్‌సీఎఫ్‌) చూస్తే అంతకు ముందు నాలుగేళ్ల కంటే, గత మూడేళ్లలో తగ్గుతూ వస్తోంది.

కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గుదల
- కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటా, అందులో మన రాష్ట్రానికి వచ్చే వాటా కూడా మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 2015 నుంచి 2020 వరకు సెస్, సర్‌చార్జ్‌ మినహాయించి 42 శాతం మొత్తాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. 

- 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఆ పన్నుల్లో 2025 వరకు 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ కేంద్రం ఏనాడూ ఆ మొత్తంలో రాష్ట్రాలకు తమ పన్నుల ఆదాయాన్ని పంచలేదు.

- 2019 నుంచి మన రాష్ట్రానికి ఆ ఆదాయం ఇంకా తగ్గింది. 2015–16లో కేంద్రానికి రూ.14,49,958 కోట్ల ఆదాయం రాగా, అందులో రాష్ట్రాలకు ఇచ్చింది రూ.5,06,193 కోట్లు. అంటే 42 శాతం ఇవ్వాల్సిన చోట  34.91 శాతం మాత్రమే ఇచ్చింది. ఐదేళ్లలో సరాసరి 34, 35 శాతం ఇస్తున్నారు. అందులో మన రాష్ట్రానికి 4.30 శాతం వస్తుంది. ఈ మూడేళ్లలో 35 శాతం కూడా రావడం లేదు. 

- 2015–16లో 34.91 శాతం, 2016–17లో 35.57 శాతం 2017–18లో 35.13 శాతం 2018–19లో 36.63 శాతం వస్తే.. మన ప్రభుత్వం వచ్చాక 2019–20లో 32.41 శాతం, 2020–21లో 29.35 శాతం, 2021–22లో 32.56 శాతం వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ తీసుకురాగలిగాం. 

మన మనిషి సీఎం స్థానంలో లేడని విష ప్రచారం
వాళ్ల మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద బురదజల్లాలన్న మైండ్‌సెట్‌తో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. 2018–19లో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ రూ.2.28 లక్షల కోట్లు. మూడేళ్ల తర్వాత మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్లు. దాదాపు అదే బడ్జెట్‌. చంద్రబాబు కన్నా మనమే తక్కువ అప్పులు చేశాం. 

- మరి బాబు హయాంలో అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలు లేవు. అప్పుడు పెన్షన్‌ కేవలం ముష్టి వేసినట్టు.. రూ.1,000 ఇచ్చారు. ఇవాళ రూ.2,500 ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మూలధన వ్యయం కూడా వాళ్ల కన్నా మన ప్రభుత్వమే ఎక్కువ చేసింది. 

- అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో ఒక్కటే స్కీం. చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. ఎవరెవరికి ఎంత వాటాలు రావాలో అంత పంచుకుంటారు. ఎవరూ రాయరు, ఎవరూ చూపరు. అప్పుడప్పుడూ చంద్రబాబు మీద మా బాబు మంచోడనే రాతలు రాస్తారు. ఇవాళ అవినీతి లేదు, లంచాలు, వివక్ష కూడా లేదు. పాలనలో పారదర్శకత ఉంది. రాష్ట్ర ప్రజలందరూ ఇవన్నీ ఆలోచించాలని, వారి తప్పుడు మాటలు, అబద్ధాలను నమ్మవద్దని, ప్రభుత్వం చేసే మంచిని చూడమని ఈ సభ ద్వారా విన్నవిస్తున్నా.. అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement