సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని తెలిపారు.
‘స్కిల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుంది. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్ ఇది. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారు. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. పక్కా స్కిల్‌డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. నారా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్‌లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారు. ఈ స్కామ్ ఏపీలో మొదలై విదేశాలకు పాకింది.
సీఎం జగన్ తన ప్రసంగంలో ఏమన్నారంటే...
నిరుద్యోగుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం.
ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే నిరుద్యోగులు,విద్యార్ధుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం గురించి ఈ సభలోనాలుగు మాటలు చెప్పాలి. స్కిల్ పేరిట ఏ రకంగా గత ప్రభుత్వంలో దోచేశారు అన్నది సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ తెలియాలి. అదే విధంగా సభ ద్వారా ప్రజలకు కూడా అవగతం కావాలి. అందుకనే ప్రత్యేకంగా ఈ అంశంపైన మరింత క్లారిటీ ఇవ్వడంతో పాటు అందరికీ తెలియాలి అన్న ఉద్దేశ్యంతో నాలుగు మాటలు సభ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను.
దోపిడీ– బాబుకి తెలిసిన స్కిల్
స్కిల్లింగ్ ద్వారా నిజంగా పిల్లల స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపర్చాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది... ఇది నిజంగా చంద్రబాబునాయుడు గారికే మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్. ఇటువంటి స్కిల్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది, ఏ రకంగా ఒక వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు ఎలా పడ్డాయి ? అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.
ఈ స్కాం ఎలా ఉందంటే.. రూ.100 పనిచేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకుని దాన్ని కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందో.. ఈస్కాం కూడా అలాగే ఉంటుంది. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. అమెరికాలో కానీ, యూరప్ లో కానీ మీకు లాటరీ తగిలింది. 10 మిలియన్ డాలర్లు మీ పేరుమీద వచ్చాయి. అర్జెంటుగా మీరు రూ.10 లక్షలు డబ్బులు కట్టండి. అది కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన 10 మిలియన్ డాలర్లు వస్తాయని చెప్పి ఆ రూ.10 లక్షలు కట్టించుకుని వాటిని కూడా ఎత్తేసే కార్యక్రమం ఏమాదిరిగా జరుగుతుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ సీమెన్స్ పేరుతో పెద్ద స్కాం జరిగింది.
స్కాం నడిపింది చంద్రబాబే...
ఇలాంటి ఒక స్కాంను నడిపిన వ్యక్తి సాక్షాత్తూ నారా చంద్రబాబునాయుడు గారేనని నా ప్రసంగంలో రకరకాల ఆధారాలతో సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చూపిస్తాను. ప్రభుత్వం సొమ్ము రూ.371 కోట్లు. ఈ డబ్బు హారతి కర్పూరంలా మాయమైపోయింది. ఈ స్కాం గురించి మనం చర్చిస్తున్నాం. ఈ డబ్బు సెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ ద్వారా మరలా సెల్ కంపనీల నుంచి చంద్రబాబునాయుడు గారి దగ్గరకి వచ్చిన పరిస్థితి.
స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం...
ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం. పార్టనర్స్ ఆఫ్ క్రైం ప్రొసీడ్స్ అనే పదానికి అర్ధం కూడా చెబుతుంది. అధికార దుర్వనియోగం పరిధిలోనికి కూడా వస్తుంది. కేబినెట్‌లో ఒకటి చెప్పి.. ఆ మేరకు ఒక జీవో విడుదల చేశారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం, జీవోతో సంబంధం లేకుండా వేరొక ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేసే కార్యక్రమం జరిగింది. ప్రజా ధనాన్ని దోచేయడంలో చంద్రబాబు గారి చాతుర్యం చూడాలంటే... దానికి సరైన ఉదాహరణ సరిగ్గా ఈ స్కిల్ స్కాం. ఇది రాష్ట్రంలో మొదలై విదేశాలకు కూడా సెల్ కంపెనీల ద్వారా పాకిన పరిస్థితి. ఆ తర్వాత అటునుంచి మరలా డబ్బులు మన దేశంలోకి, హైదరాబాద్‌లోకి వచ్చాయి.
ఈ స్కాం మన సీఐడీతో మొదలు పెడితే జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ ఇలా ఏజెన్సీలన్నీ దర్యాప్తు చేస్తున్న స్కాం.
ఇలా దోచేసిన సొమ్మును సెల్ కంపెనీల ద్వారా విదేశాలకు అక్కడ నుంచి మరలా దేశంలోకి తెప్పించి, దేశం నుంచి ఏకంగా చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు తరలించారు.
పద్ధతి ప్రకారం రూ.371 కోట్ల దోపిడీ...
చంద్రబాబు గారు ఆయన మనుషులు ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి ఒకటి కాదు, రెండు కాదు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఏకంగా రూ.371 కోట్లు దోచేశారు. యూత్‌కు శిక్షణ పేరుతో ఈ డబ్బంతా దోచేయడం అన్నింటికన్నా బాధాకరం. ఈ డబ్బు దోచేయడానికి చంద్రబాబుగారి విజన్ ఏంటో బాగా కనిపిస్తోంది. చేయని స్కిల్ డెవలప్‌మెంట్ ఎలా చూపించాలి ? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి ? చట్టానికి దొరక్కుండా ఏయే ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి ? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి ? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి ? ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకుని ఈవిజన్ రూపకల్పన చేసినట్టుగా రకరకాల అడుగుల్లో కనిపిస్తోంది.
అవినీతికి విజన్...
ఇవన్నీ ముందుగానే ఊహించుకుని ఇంత గొప్ప విజన్‌తో ఈ కార్యక్రమాలు చేసిన పరిస్థితులు చూస్తే.. ఒక క్రిమినల్ మాత్రమే ఈ విధంగా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్ అతడు. చంద్రబాబు గారు జూన్ 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈస్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఊపిరి పోసుకుంది. దీనికోసం తమకు కావాల్సిన మనుషులను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వంలో ఒక పూర్తి స్ధాయి చర్చలేదు. ఏదైనా ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు, మనం ఏదైనా అప్రూవ్ చేయాల్సివచ్చినప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయి చర్చ జరగాలి. కానీ అటువంటిది ఎక్కడా చర్చ జరగలేదు.ఒక డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు చేయించాలి. ఒక ఆలోచన ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందనేది పేపర్ మీద పెట్టి డీపీఆర్ చేయించాలి. అది కూడా లేదు. ఖర్చు ఎంతవుతుందనేది నిర్ధారణ చేయించాలి. అది కూడా లేదు. కనీసం టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు.
సీమెన్స్ ఉద్యోగితో లోపాయికారి లాలూచీ...
ఇది ఒక చంద్రబాబునాయుడు గారికి మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది. సీమన్స్ ఇండియా అన్న కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడిని వాడుకుని ఈప్రాజెక్టు పేరుతో దోపిడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లు అయితే.. ఇందులో ప్రభుత్వ వాటా పదిశాతం. అని చెప్పారు. 90 శాతం సీమెన్స్ పెట్టుకుంది అని చెప్పారు. ఒక ప్రైవేటు సంస్ధ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90శాతం పెట్టుకుందని స్కాంలో రూపకల్పన చేశారు. దాదాపుగా రూ.3000 కోట్లు ప్రైవేటు సంస్ధ అయిన సీమెన్స్ ఇస్తుందని ప్రచారం చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రైవేటు కంపెనీ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇస్తుందా ? ఆలోచన చేయడానికైనా సాధ్యపడుతుందా ? చంద్రబాబు నాయుడు గారి అందమైన మొహాన్ని చూసి ఏమైనా ఇస్తున్నారా ?
ఏరకంగా ఒక ప్రయివేటు సంస్ధ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది ? సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టును తీసుకోవాలనంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు ? దీనిలో ప్రభుత్వం వాటా ఎంత ? మిగిలి వారి వాటా ఎంత? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది. మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు ? ప్రతిస్ధాయిలో కూడా ఖర్చు ఎంత ఉంటుంది ? ఏ రకంగా నిధులు వస్తాయి? టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది ? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది ? ఇలా అన్నిరకాల కోణాల్లోనూ ఆధ్యయనం చేసి... అవైలబుల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లోనికి తీసుకుని రావాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను కూడా సర్టిఫైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్ కూడా తయారు చేయలేదు.
ఇదివరకే చెప్పుకున్నట్టు.. ముందస్తుగానే ఆ కంపెనీలో ఉన్న లాలాచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు.. తమకు తాముగా తయారుచేసుకున్న ఒక అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి ఒక నోట్ పెట్టించారు. అంటే వాళ్లంతట వాళ్లే ఒక మనిషిని గుర్తించి, ఆ మనిషి దగ్గర నుంచి ఆ కంపెనీ పేరుతో ఒక ప్రతిపాదన పెట్టించి, దాన్ని ఏమాత్రం కూడా అధ్యయనం చేయకుండా విచారణచేయకుండా ఆ అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి నోట్ పెట్టించారు.
అన్ని రూల్స్‌ను బేఖాతరు చేస్తూ...
ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి కానీ, ఆ పై స్ధాయి కానీ అన్నింటినీ టోటల్‌గా ఓవర్ లుక్ చేశారు. ఏకంగా స్పెషల్ ఐటెంగా కేబినెట్‌లోకి ఈ నోట్‌ని తీసుకొచ్చారు. కేబినెట్‌లోకి రావడం వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అ«ధ్యయనం చేయని ఎవరో ఇచ్చిన డీపీఆర్‌ను ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్ పెట్టడం అన్నది.. నియామకాలకు, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ బాబుగారి పాలనలో ఆన్నీ పూర్తిగా బేఖారు చేసిన పరిస్థితులు. ఆయన పాలనలో రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ బేఖాతర్, పద్దతులు, ట్రెడిషన్స్ అన్నీ కూడా బేఖాతర్. ఆయన చెప్పిందే వేదం అన్నట్టు నడిపించారు.
చంద్రబాబు టైంలోనే బయటపడిన స్కాం...
ఈ స్కాం అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తవ్వింది కాదు. చంద్రబాబు గారు హయాంలోనే దీన్ని సెంట్ కనిపిస్తూ వచ్చింది. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు వీరి దత్తపుత్రుడు కూడా అడగలేదు. ఎవరైనా ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తూ ఉంటే ఎందుకు వీళ్లంతా మౌనంగా ఉన్నారు. ఇంతకముందు నేను చెప్పాను. దోచుకో, పంచుకో, తినుకో ( డీపీటీ ) ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు. ఎవరూ రాయరు. ఎవరూ చూపరు. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు.
ఒప్పందంలో పచ్చి అవినీతి..
ఈ ఒప్పందం గురించి వస్తే.. ఇంతకంటే పచ్చి అవినీతి ఎక్కడా చూసి ఉండం. కారణం కేబినెట్‌లో ఒక విధంగా, ఆ కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇచ్చిన జీవోలో ఒక విధంగా ఉండి.. ఒప్పందం ఇంకో విధంగా ఉంది. కనీసం అదైనా కేబినెట్‌కు వచ్చిందో ?లేదో ? వచ్చిందని జీవో విడుదల చేశావు. కనీసం దాన్నైనా ఒప్పందంలోకి తీసుకువచ్చావా అంటే అదీ లేదు. కేబినెట్‌లోకి తీసుకొచ్చి, జీవో రూపంలో ఇచ్చింది ఒకటైతే, దానికి విరుద్ధంగా ఒప్పందం మరోలా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని 5 టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కేబినెట్ ఆధారంగా జీవో విడుదల చేశారు. ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90శాతం ఖర్చును సీమెన్స్ మరియు డిజైన్ టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని మిగిలిన పది శాతం ఖర్చును అంటే ఒక్కో సెంటర్‌కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగా చెప్పారు.
ఈ లెక్కన ప్రాజెక్టు వ్యయంలో పదిశాతం అంటే పనులతో కలుపుకుని రూ.370 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో రాశారు. మిగిలిన రూ.3వేల కోట్లు సీమెన్స్ సంస్ధ ఈ ఒప్పందం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా... ప్రైవేటు సంస్ధ ఉదారంగా మనకు ఇస్తుందని కేబినెట్‌లోకి తీసుకొచ్చారు. జీవో విడుదల చేశారు.
ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో భాగంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చిందని అంటే.. ఈ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదారంగా మనకు ఉచితంగా ఇచ్చినట్టు అర్ధం.
అయితే కేబినెట్ నిర్ణయానికి ఈ జీవోకు విరుద్ధంగా ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. ఆసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు. ఒప్పందానికి వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. అసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు.
ప్రభుత్వం ఇవ్వవలసిన 10 శాతం కంట్రిబూషన్ కాస్తా ఫైనాన్సియల్ అసిస్టెన్స్‌గా మారిపోయింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం కంట్రిబ్యూషన్‌ను ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌గా మార్చేశారు. మొత్తం ఒప్పందం చూస్తే.. కేబినెట్ నిర్ణయం, తద్వారా వచ్చిన జీవోకు పూర్తిగా విరుద్ధంగా ఒప్పందం స్వరూపమే మార్చివేసారు.
స్లైడ్స్ ద్వారా కేబినెట్ నిర్ణయం, జీవో ఆ తర్వాత ఎంఓయూను అసెంబ్లీలో వివరించిన సీఎం.
కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపి జీవో ఇచ్చారు. జీవో తర్వాత ఒక తప్పుడు వ్యవస్ధను క్రియేట్ చేశారు. ఆ తర్వాత వీళ్ల చేసుకున్న ఒప్పందం చూస్తే.. పదిశాతం కాంట్రిబ్యూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద రూ.330 కోట్లు ఇచ్చేటట్టుగా నామకరణం చేసారు. ఇక్కడ స్కాంకు బీజం పడింది. కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో ఏ లెటర్‌ఆధారంగా ఏ తేదీన జారీ చేసిన ఏ జీవో ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్న వివరాలేవీ పేర్కొనలేదు. అన్నీ ఖాలీలు ఉంచారు.
ఒప్పందం వివరాలూ మాయం....
ఈ వివరాలు నింపాల్సిన చోట నింపకుండా ఖాలీగా విడిచిపెట్టారు. కనీసం ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా డాక్యుమెంట్‌లో రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు ? జీవో వేరు, ఒప్పందం వేరు. చంద్రబాబునారి స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టు పై ఈరకంగా ఒప్పందాలు జరుగుతాయా ? ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా ? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దోచుకో, పంచుకో, తినుకో అన్నదానికి ఏ రకంగా అడుగులు పడ్డాయన్నది ఊహకందని విధంగా జరుగుతుంది.
ప్రభుత్వం నుంచి పదిశాతం డబ్బులు విడుదల చేసినప్పుడు, సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. ఉదారంగా సీమెన్స్ నుంచి మనకు ఇవ్వాల్సింది ఒక్క పైసా కూడా రాకుండానే... ఐదు దఫాల్లో కేవలం మూడు నెలలు కాలంలోనే ప్రభుత్వం రూ.370 కోట్లు విడుదల చేసింది. అంటే ప్రభుత్వం నుంచి ఇన్‌స్టాల్‌మెంట్ పోతుంది ఆ మొత్తం సెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్లీ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తారు.
డబ్బులు ఇవ్వడం వీళ్లు రూట్ చేసుకోవడం.. వీళ్లకు రావాల్సింది తీసుకోవడం, మరలా సెకెండ్ ఇన్‌స్టాల్స్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
నేను బటన్ నొక్కితో డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి, నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు బటన్ నొక్కితే అంతా ప్రభుత్వ ఖాతా నుంచి అటు తిరిగి, ఇటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డీపీటీ కార్యక్రమం. ఇంత దారుణంగా జరిగాయి.
ఈ డబ్బు విడుదలపై ఆర్ధికశాఖ అధికారులు ప్రశ్నిస్తే...ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారంటే. సాక్షాత్తూ చంద్రబాబే. ఈ విషయాన్ని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్‌లో .. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు తాను నోట్ ఫైల్‌లో చెప్పారు. ఇంకోక నోట్ ఫైల్‌లో .. చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్‌పై రాశారు.
ప్రధాన ముద్దాయి చంద్రబాబే...
ఈ స్కాంలో ఇన్ని సాక్ష్యాధారాలు నేను చూపిస్తున్నాను. చంద్రబాబు గారు ప్రధాన ముద్దాయి అవునా ?కాదా ? అని చెప్పడానికి ఇంకా నిదర్శనాలు కావాలా అని అడుగుతున్నాను ?
ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది. తీగలాగితే డొంకంతా కదిలింది. ఇక్కడ మన అధికారులే కాదు. సీమెన్స్ సంస్ధ అధికారులు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు.
సీఆర్పీసీ 164 కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు, తమకు ఎలాంటి సంబధం లేదని కోర్టులో చెప్పారు. ఇది సీమెన్స్ వాళ్లు అంతర్గతంగా విచారణ చేసుకుని ఇచ్చిన రిపోర్టు.
వాళ్లు 164 కింద మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఒక అంశం అయితే... ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు తమకూ ఎలాంటి సంబందం లేదని... వాళ్లు కోర్టుకు తెలిపడం మరొక అంశం అయితే తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజిమెంట్‌కు కానీ, లీగల్ టీంకు కానీ సంప్రదించలేదని సీమెన్స్ కోర్టుకు తెలియజేశారు. అంతే కాకుండా సీమెన్స్ ఎలాంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ ఆర్ధిక సహాయంతో కూడిన కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించలేదని, ఇలాంటి స్కీంలు ఏవీ కూడా తమ సంస్ధలో లేవని చెప్పారు. వాళ్ల అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అధికారికంగా అందజేశారు.
అంటే రూ.370 కోట్లు డబ్బులిచ్చారు. ఆ డబ్బులు మాకు రాలేదని సీమెన్స్ వాళ్లు చెబుతున్నారు. అంటే ఈ డబ్బులు ఎవరికి పోయాయి ? అటు తిరిగి ఇటు తిరిగి సెల్‌కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్‌కి తెప్పించుకునే కార్యక్రమం జరుగుతుంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నామని ఆలోచన చేయమని అడుగుతున్నాను. రూ.370 కోట్లు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఆయన మనుషులు పూర్తిగా తినేశారు. ఈ డబ్బు ఒకటి రెండు కాదు ఇప్పటివరకు ఆనేక సెల్‌కంపెనీల ద్వారా చేతులు మారి మనీల్యాండరింగ్ చేసి వీళ్ల చేతుల్లోకి వచ్చింది.
వాస్తవంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2018 జూన్‌లో అంటే వాళ్ల ప్రభుత్వంలోనే ఒక విజిల్ బ్లోయర్ ఈ స్కాం గురించి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఏసీబీ విచారణ మొదలు పెట్టి.. ఆ తర్వాత వారికి వచ్చిన ఆదేశాలతో విచారణ ముందుకు కొనసాగించకుండా ఏసీబీ ఆ ఫైలును పక్కనపెట్టేశారు.
విచారణనూ అడ్డుకున్నారు...
ఏసీబీని విచారణ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు. ఏసీబీ రిపోర్ట్స్ టు సీఎం. ఇది ఎప్పుడైతే జరిగిందో ఈప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్‌ను మాయం చేశారు. క్లీనింగ్‌ఆపరేషన్ మొదలుపెట్టారు.
ఎంత తెలివైన నేరస్థుడైనా... ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి.
ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్ కట్టకుండా సెన్ వ్యాట్ కోసం క్లెయిమ్ చేశాయి. ఎంత గొప్పగా వీళ్లు రచన చేసినా ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే... దేవుడి మొట్టికాయలు వేయాలనుకున్నప్పుడు ఎక్కడో కచ్చితంగా పడతాయి. ఇన్ని కోట్లరూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. ఈ డబ్బులు బోగస్ ఇన్‌వాయిసెస్‌తో సైఫనాప్ చేసినట్టుగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. 2017లోనే ఇది బయటపడింది. గత ప్రభుత్వంలోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్లు ఇది బోగస్ ఇన్‌వాయిసెస్‌తో సైఫనాప్ చేసినట్లు చెప్పారు. వాళ్లు బయటపెట్టినా బాబుగారి ప్రభుత్వంలో స్పందన లేదు. ఎందుకు స్పందించలేదు అంటే... ఈ స్కాంలో సాక్షాత్తూ చంద్రబాబునాయుడు గారే అడుగులు వేయించారు. చివరకు సీమెన్స్ సంస్ధ అంతర్గత విచారణ చేసి వాళ్లు తేల్చిన విషయాలు కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
ఎల్లో మీడియా గగ్గోలు
ఈ విషయాలన్నింటినీ మన సీఐడీ దర్యాప్తు చేస్తూ.. స్కాంకు సహకరించిన వారిని అరెస్టు చేస్తుంటే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుంది.
ఆసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్ల బాధ వర్ణనాతీతం. ఇంత దారుణమైన స్కాం జరుగుతుంటే... ఇన్ని ఆధారాలతో రుజువయ్యే పరిస్థితులు కనిపిస్తుంటే.. దీని మీద అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా చెబుతున్నాయి. నిజమేమిటంటే ఈ కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురిని అరెస్టు చేసి ఈడీ ట్వీట్ కూడా చేసింది. అందులో ఏముందంటే సీమెన్స్ ఇండస్ట్రీ ఎక్స్ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌ను, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైయివేటు లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్‌ను, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్‌ను అరెస్టు చేసి వాళ్లను పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టి, 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది.
పట్టుబడిన గజదొంగల ముఠా...
ఇంత దారుణంగా స్కామ్ చేసి పట్టుబడిన తర్వాత వీళ్లు దొరికిపోతున్నారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగలముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తట్టుకోలేక ఆక్రోషంతో బాధపడుతున్నారు. బమ్మిని తిమ్మిని చేయడానికి, తిమ్మిని బమ్మిని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇవి వాస్తవాలైతే... ఇవేవీ వాస్తవాలు కాదని అటు తిప్పి, ఇటు తిప్పి కథలు, కథలు అల్లి చంద్రబాబును కాపాడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ గజదొంగల ముఠా ఎంత దారుణంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. డీపీటీ అని నేను చెప్పినదానికి సాక్ష్యాధారాలు.
ఇది చంద్రబాబుగారు చేసిన నిలువుదోపిడీ బాగోతం. ఈ గజదొంగల ముఠా ఇన్ని దారుణాలు చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ఎత్తులు..అన్నీ ఇన్నీ కాదు. నేరగాళ్లకు ఎప్పుడైనా సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తారు. ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. ఇటువంటి గజదొంగల ముఠాను ఇక మళ్లీ ఏరోజు కూడా రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి.
ఈ విషయం మీద చర్చ జరుగుతుంది. వక్రీకరించే కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతున్నాయి. వాళ్ల దగ్గర మీడియా సంస్ధలు ఎక్కువగాఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్దం చేయగలుగుతారు. ఒక అబద్దాన్ని నిజం చేయగలుగుతారు. అంతా స్కిల్డ్ మ్యాన్‌పవర్, స్కిల్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ వాళ్ల దగ్గర ఉంది.
వాస్తవాలు ప్రజలకూ తెలియాలి...
కాబట్టి కనీసం ఈ సభ ద్వారానైనా వాస్తవాలేంటి అన్నది మన ఎమ్మెల్యేలకే కాకుండా, ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా సాక్ష్యాలు, ఆధారాలతో చూపించాం అని సీఎం తన ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment