AP Assembly Session: CM YS Jagan Comments On Chandrababu Amaravati Corruption - Sakshi
Sakshi News home page

అది దొంగల రాజ్యం: సీఎం జగన్‌

Published Fri, Mar 24 2023 5:00 PM | Last Updated on Sat, Mar 25 2023 8:29 AM

AP Assembly: CM YS Jagan On Chandrababu Amaravati Corruption - Sakshi

సాక్షి, అమరావతి: ‘అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్‌ కంపెనీలు సృష్టించి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఇది మనం చెబుతోంది కాదు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో బట్టబయలైన అవినీతి బాగోతం. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ వెల్లడించిన వాస్తవం’ అని వెల్లడించారు.

‘అమరావతిలో భవన నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తే ఈ అవినీతి బండారం బయట పడింది. అందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది’ అని తెలిపారు. అమరావతి నిర్మాణాల విషయంలో చంద్రబాబు అవినీతిపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన అంశంపై శాసనసభలో శుక్రవారం నిర్వహించిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రసంగించారు. ‘చంద్రబాబు తమను బెదిరించడంతోనే ఆయన చెప్పిన బోగస్‌ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. మరో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కంపెనీ నుంచి తామే నిధులు వసూలు చేసి, చంద్రబాబుకు అందించామని వెల్లడించార’ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిధులను కొల్లగొట్టిన తీరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఇలా వివరించారు. 

ఐటీ దాడులతో వెలుగులోకి..
► మొట్టమొదటగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ మొత్తం సమాచారం లభించింది.  ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారు. దాంతో మరింత సమాచారం లభించింది. 

► ఆదాయ పన్ను శాఖ పరిశోధన విభాగం ఆ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి ఆదాయ పన్ను అప్రైజల్‌ రిపోర్ట్‌ను తయారు చేసింది. తాము నిర్వహించిన దాడుల్లో లభించిన ఆధారాల ప్రకారం సంబంధిత వ్యక్తులను పిలిపించారు. తాము సేకరించిన ఆధారాలను ఆ వ్యక్తులకు చూపించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వాంగ్మూలాలపై వారు సంతకాలు కూడా పెట్టారు. వాటన్నింటి ఆధారంగా ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపారు. 

చంద్రబాబు అవినీతి బాగోతం ఇలా..
► అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. అందుకోసం పక్కాగా స్కెచ్‌ వేశారు. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాఫూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారు. దాంతో మనోజ్‌.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను కలిశారు. 

► షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు చేసింది. అందులో తన కమీషన్లు వసూలు చేసేందుకు బాబు.. శ్రీనివాస్‌ను రంగంలోకి దింపారు. వినయ్‌ నంగల్లా, విక్కీ జైన్‌ అనే ఇద్దరిని మనోజ్‌కు శ్రీనివాస్‌ అటాచ్‌ చేశారు. వీరిలో వినయ్‌ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్‌ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ మనోజ్‌తో చెప్పారు. 

► దాంతో వినయ్‌ నంగల్లా హయగ్రీవమ్, అన్నై షలాఖా అనే కంపెనీలను మనోజ్‌కు అటాచ్‌ చేశారు. విక్కీ జైన్‌.. నయోలిన్, ఎవరెట్‌ అనే రెండు కంపెనీలను అటాచ్‌ చేశారు. మనోజ్‌కు వాళ్లెవరో కూడా తెలియదు. తాము ఇలా డబ్బులు ఇవ్వలేమని, కావాలంటే పార్టీకి ఫండ్‌ ఇస్తామని షాపూర్జీ పల్లోంజీ కంపెనీ చెప్పింది. తాము చెప్పినట్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మనోజ్‌ను శ్రీనివాస్‌ బెదిరించారు. ఆ విషయాన్ని మనోజ్‌ ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వెల్లడించారు. ఆ వాంగ్మూలం కాపీలు కూడా ఉన్నాయి. 

► ఆ కంపెనీలకు బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వసూలు చేసి చంద్రబాబుకు అప్పగించే బాధ్యతను ఆర్వీఆర్‌ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికేత్‌ బలోటాలకు అప్పగించారు. ఇదీ ఈ మోడస్‌ ఆఫ్‌ ఆపరెండీ. ఐటీ అధికారులు ఈ సమాచారాన్ని అంతా ఆ కంపెనీల ప్రతినిధుల నుంచి వాంగ్మూలంగా తీసుకుని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. దాన్ని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు చూపించారు. అదంతా వాస్తవమేనని శ్రీనివాస్‌ అంగీకరించి సంతకాలు కూడా చేశారు.

► శ్రీనివాస్‌తోపాటు రఘు, మిగిలిన వారిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. వాళ్లు కూడా అదంతా వాస్తవమేనని అంగీకరించి సంతకాలు కూడా చేశారని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌ వెల్లడిస్తోంది. 

► చంద్రబాబుకు దుబాయిలో కూడా రూ.15.14 కోట్లను దినార్ల రూపంలో క్యాష్‌గా ఇచ్చినట్టు ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో మనోజ్‌ అంగీకరించారు. దాంతోనే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో రూ.371 కోట్లు అందాయి. ఆ కుంభకోణంలో చంద్రబాబుకు డబ్బులు చేర్చిన యోగేశ్‌ గుప్తానే ఈ వ్యవహారంలో కూడా ఉన్నారు. 

కోట్ల మళ్లింపునకు కోడ్‌ భాష 
► ఆర్‌వీఆర్‌ రఘు వాట్సాప్‌ చాట్‌లను ఐటీ అధికారులు పరిశీలించగా.. ఈ అక్రమ ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మనోజ్‌ వాసుదేవ్‌ సన్నిహితుడు యోగేశ్‌ గుప్తా నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో నిధుల మళ్లింపులో కూడా యోగేశ్‌ గుప్తా కీలక పాత్ర పోషించారు. బోగస్‌ ఇన్వాయిస్‌లు సృష్టించి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో ఆయనదే ప్రధాన భూమిక. 

► ఈ అక్రమ లావాదేవీలను మనోజ్‌ కోడ్‌ భాషలో తన ఈ–మెయిల్‌ ఐడీకే మెయిల్‌ చేసుకుని భద్ర పరిచినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించింది కోడ్‌ భాష ‘టన్నుల’ రూపంలో పేర్కొన్నట్టుగా పూర్తి వివరాలు వెల్లడ­య్యా­యి. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబాయికి 3.5 టన్నులు.. ఇలా భారీగా నిధులను మళ్లించిన గుట్టును ఐటీ అధికారులు ఛేదించారు.

ఇది రూ.2 వేల కోట్ల దోపిడీ 
► ఐటీ అధికారులు విశాఖపట్నం, విజయవాడ, కడప, ఢిల్లీ, పూణేల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌తోపాటు మరికొందరిపై జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.రెండు వేల కోట్లు దొరికినట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ 2020 ఫిబ్రవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. 40 చోట్ల జరిపిన తనిఖీల్లో బోగస్‌ సబ్‌ కాంట్రాక్ట్‌ కంపెనీలు, ఇన్వాయిసులు, బిల్లులు ఇతర ఆధారాలు లభించాయని చెప్పింది. 

► రెండో దశ దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు 2022 సెప్టెంబర్‌ 28న చంద్రబాబుకు నోటీస్‌ ఇచ్చారు. ఈ కేసును డీసీఏసీ–సెంట్రల్‌ సర్కిల్‌కు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో త్వరలో చంద్రబాబును కూడా విచారణకు పిలవనున్నారు. 

► 2019లో అర్జంటుగా డబ్బులు ఇవ్వాలని మనోజ్‌ వాసుదేవ్‌కు చంద్రబాబు చెప్పారు. హయగ్రీవా, అన్నై షలాఖా అనే సంస్థలకు రూ.52.50 కోట్లు.. నవోలిన్, ఎవరెట్‌ కంపెనీలకు రూ.62.90 కోట్లు చొప్పున మనోజ్‌ చెల్లించారు. చంద్రబాబు ఆదేశాలతో మనోజ్‌.. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఇప్పించారు. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ప్రతినిధులు అతుల్‌ సోని, బాల వెంకటేశ్‌ ఫినిక్స్‌ ఇన్‌ఫ్రా, ఫోర్‌ ట్రేడింగ్, లక్‌ స్టోన్‌ అండ్‌ కో బోగస్‌ కంపెనీల ఖాతాల్లో రూ.41.90 కోట్లు జమ చేశారు. మొత్తం రూ.157.3 కోట్లు మళ్లించారు. 

► ఈనాడు రామోజీరావు కుమారుడు కిరణ్‌ వియ్యంకుడు ఆర్‌వీఆర్‌ రఘుతోపాటు కృష్ణ, నారాయణ, శ్రీకాంత్, అనికెత్‌ బల్దోటాలకు ఈ రూ.157.3 కోట్లు చేరాయి. వారు ఆ నిధులను నేరుగా చంద్రబాబుకు చేర్చారు. ఈ వ్యవహారంలో నారా లోకేశ్‌ పీఏ రాజేశ్‌ కిలారి కీలక పాత్ర పోషించారు. 

ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్‌ 
► ఇంతకు ముందు కూడా ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్‌. అప్పటి ప్రభుత్వం కన్నా అప్పుల గ్రోత్‌ రేటు ఇప్పుడు తక్కువ. ఇదే బడ్జెట్‌తో మన ప్రభుత్వం నేరుగా బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా ప్రతి అక్క, చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి ప్రయోజనం కలిగిస్తోంది. నాలుగేళ్లు పూర్తికాక ముందే మన ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసింది. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా బటన్‌ నొక్కిన వెంటనే అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. 

► ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇదే బడ్జెట్‌. అయినప్పటికీ ఎందుకు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి, వారి కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లలేదు? ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ స్కీం ఎలా చేశారో మొన్న కూడా చెప్పాం. ఈ రోజు మళ్లీ చెబుతున్నాం. గత ప్రభుత్వం ఎలా ఉండేది.. మనందరి ప్రభుత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందో, ఎంత మంచి జరుగుతోందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి.  

ఈడీ పట్టుకోదనే కేడీ చంద్రబాబు ధీమా 
ఇంతగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినా, తనను ఏ ఈడీ కూడా పట్టుకోదనే ఈ కేడీ చంద్రబాబు ధీమా. సీమెన్స్‌ కేసులో రూ.371 కోట్లు దోచేసిన చంద్రబాబు ఈ కేసులో రూ.172.44 కోట్లు దోపిడీ చేసినట్లు ఇప్పటిదాకా తేలింది. అమరావతి పేరిట ఏదో చేస్తున్నానని ప్రజలను మభ్యపెడుతూ ఇక్కడ చేసింది గోరంత.. కొట్టేసింది కొండంత. దోపిడీ ఆధారాలతో బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రజలకు ముఖం ఎలా చూపిస్తావ్‌ చంద్రబాబూ.. అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణానికి చ.అడుగుకు రూ.12 వేలు చొప్పున దోచి పెట్టారు. ఇలా దోచేసిన డబ్బును ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనులను చంద్రబాబు ఖర్చు చేస్తున్నారు. ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా ఎమ్మెల్యేలు 23 మందిని కొన్నారు. నేడు మరో నలుగురిని ప్రలోభాల ద్వారా లాక్కున్నారు. బాబు దోపిడీలో దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) బ్యాచ్‌లోని రామోజీరావుకూ వాటాలు అందాయి. అందుకే చంద్రబాబు ఎంత అవినీతికి పాల్పడినా ఈనాడు పత్రికలో రామోజీ రాయరు. ఈటీవీలో చూపరు. చంద్రబాబు, రామోజీరావు తోడు దొంగలు. 
– గుడివాడ అమర్‌నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement