సాక్షి, అమరావతి : అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి సోమవారం శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సభాపతిని ఏకవచనంతో సంభోదిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. చంద్రబాబు తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వంలో సాగిన భూకుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. ఇంతలో చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు లేచి అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబు స్పీకర్‌ను ఉద్దేశిస్తూ ‘నువ్వు ఏ అధికారంతో విచారణ జరపాలని అడుగుతావు’అని గద్దిస్తున్నట్లు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ఏ అంశంపై అయినా విచారణ జరిపించాలని అడిగే అధికారం స్పీకర్‌కు ఉందని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ సభ్యులు గట్టిగా అరుస్తూ సభలో గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. స్పీకర్ మాట్లాడుతూ సభాపతి స్థానాన్నే బెదిరిస్తారా? ఇదేనా ఇన్నాళ్ల మీ అనుభవం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూములపై విచారణ జరపాలనంటే చంద్రబాబుకు ఎందుకంత ఉలికిపాటు? ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయంటే మీకెందుకంత ఉక్రోషం అని స్పీకర్ ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి విచారణ జరిపించాలని ఇంతకుముందే డిమాండ్ చేశారు కదా? మరి ఇప్పుడు ఎందుకు అడ్డుతగులుతున్నారని నిలదీశారు.
ఇలాంటి విపక్షనేత ఉండడం సిగ్గుచేటు: మంత్రి బొత్స సత్యనారాయణ
చంద్రబాబు, టీడీపీ సభ్యులు అదే పనిగా స్పీకర్‌ను కించపరుస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగలడంపై మంత్రి బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతిని ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఏకవచనంతో మాట్లాడమేంటని బొత్స ప్రశ్నించారు. శాసనసభ అన్నా.. సభాపతి అన్నా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని, స్పీకర్‌కు చంద్రబాబు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపక్ష నేత ఉండటం సిగ్గుచేటని, రాష్ట్రం చేసుకున్న ఖర్మని ఆవేదన వ్యక్తం చేశారు. సభాపతి స్థానాన్ని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా తప్పేనని స్పీకర్ సీతారాం అన్నారు. ప్రతిపక్ష నేతే అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక విజ్ఞత ఎక్కడుందని.. సభాపతి స్థానాన్ని , శాసనసభను అందరూ గౌరవించాల్సిందేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment