గురువారం శాసనసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే అనుమతిస్తా మని ఉద్ఘాటించారు. తమ పార్టీ ఆది నుంచి ఇదేరకమైన ఉన్నత సంప్రదాయాన్ని పాటిస్తోందని, దీన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన్ను అభినందించారు. సభాపతి స్థానంలో తమ్మినేని సీతారాం ఆశీనులు కాగానే సభా నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి ప్రసంగం చేశారు. కొత్త స్పీకర్‌కు ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశాం..
‘అధ్యక్షా.. ఇదే సభలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలను మార్చిన పరిస్థితిని చూశాం. వైఎస్సార్ సీపీ తరఫున 67 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఏకంగా 23 మందిని పార్టీ మార్చి ఫిరాయింపులకు ప్రోత్సహించి అందులో నలుగురిని మంత్రులను కూడా చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను ఎలా మంటగలిపారో ఇదే సభలో మనమంతా చూశాం. చివరకు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అప్పటికప్పడు నిబంధనలు మార్చేయడాన్ని కూడా ఇదే సభలో చూశాం. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి సభా మర్యాదను కాపాడాలని, అప్పుడే మేం సభకు వస్తామని చెబితే కనీసం పట్టించుకోని సభను కూడా చూశాం. అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో తాజా ఎన్నికల్లో చూశాం.
గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నేను డోర్ తెరిస్తే...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సభలో చట్టాలకు తూట్లు పొడిచి మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొన్నారో చూశాం. అటువంటి పరిస్థితులు, అటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకర్ ఉన్న చట్టసభ కాకుండా... దేవుడి దయతో మంచి స్పీకర్‌ను కూర్చోబెట్టాం. నేను కూడా చంద్రబాబు మాదిరిగా చేసి ఉంటే ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కూర్చునే వారు కాదు. నేను డోర్ తెరిస్తే.. ఎంతమంది నాతో టచ్‌లో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని, మంచి చేసే దిశగా మాట్లాడుతుంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు.
దేవుడు చాలా గొప్పగా స్క్రిప్టు రాశాడు
దేవుడి స్క్రిప్టు గొప్పగా ఉంటుందనడానికి ఎన్నికలే నిదర్శనం. మా ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లెన్నో తెలుసా? అక్షరాలా 23 సీట్లు. ముగ్గురు ఎంపీలను కొన్న వారికి వచ్చిన సీట్లు మూడు. అది కూడా ఎప్పుడు వచ్చాయో తెలుసా? 23వ తేదీ. దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. బ్యూటీ ఆఫ్ డెమొక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈ చట్టసభలో మళ్లీ ఇవాళ చూస్తున్నాం.
స్పీకర్, సభానేత ఎలా ఉండాలంటే..
అటు టెండర్ల వ్యవస్థలోగానీ, గ్రామస్థాయిలోగానీ, ప్రభుత్వ యంత్రాంగంలోగానీ అవినీతిని తొలగించి విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలకు ఏపీని కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు మా ప్రభుత్వం మొదటి రోజు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే స్పీకర్‌గా సీతారాంను ప్రతిపాదించాం. ఒక స్పీకర్, ఒక సభా నాయకుడు ఎలా ఉండకూడదో గత శాసనసభను చూస్తే అందరికీ అర్థమైంది. వారు ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
ప్రజాస్వామ్యం, చట్టసభలపై నమ్మకం పెరగాలి
గతంలో విలువలు పతనమైన ఇదే సభలో ఉన్నత విలువలు ప్రోదిచేసి సభ ఔన్నత్యాన్ని పెంచుతారనే నమ్మకంతో ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై సౌమ్యుడిగా పేరున్న తమ్మినేని సీతారాంను సభాపతిగా ప్రతిపాదించాం. అయితే స్పీకర్‌గా ఎన్నికయ్యే వారు ఎలా ఉండాలనే మీమాంస నాలో కలిగింది. నేను కూడా అన్యాయమైన సంప్రదాయాన్నే పాటిస్తే ఇక మంచి అనేది ఎక్కడా బతకదు. అందువల్లే శాసనసభ సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి తెలిసిన వ్యక్తి అయితే న్యాయం చేస్తారని భావించాం. ప్రజాస్వామ్యం, చట్టసభల మీద మళ్లీ నమ్మకం పెంచేందుకు, వ్యవస్థలో మార్పు తేవటానికి సీతారాం సరైన వ్యక్తి అని మనస్ఫూర్తిగా నమ్మి సభాపతిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరా.
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు...
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చుతామని మా పార్టీ ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎప్పుడూ జరగని విధంగా దాదాపు 60 శాతం మందికి మంత్రిమండలిలో స్థానాలు కల్పించడమే కాకుండా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా చేశాం. అందులో నలుగురిని బడుగు, బలహీన వర్గాల నుంచి ఎంపిక చేశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ తమ్మినేనిని ఎన్నుకోవడం ద్వారా అధికారంలోనూ, పరిపాలనలో, శాసనసభ¿¶లోనూ మా కట్టుబాటు, కమిట్‌మెంట్‌ను నిరూపించుకుంటున్నాం. ఈ శాసనసభ పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటున్నా.
విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు..
ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పదలిచా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మందో, 17 మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు, విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. అయితే అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా’’
కళ్లెదుట జరిగిన ఘటనను వక్రీకరిస్తారా?
స్పీకర్‌ను తొలిసారిగా సభాపతి స్థానంలో ఆశీనులను చేసే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందుకు రాకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించనందువల్లే రాలేదని, పిలవని పేరంటానికి ఎలా వస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే తాను అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించినట్లు ప్రొటెం స్పీకర్ చిన అప్పలనాయుడు స్పష్టం చేశారు. ‘ప్రొటెం స్పీకర్ ఆహ్వానాన్ని మన్నించాల్సించిపోయి నాకు బొట్టు పెట్టలేదు, చీరె ఇవ్వలేదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు’ సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ఆన్ రికార్డుగా సాక్షాత్తూ మన కళ్లెదుటే జరిగిన ఘటననే వక్రీకరిస్తున్నారు. చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి అన్యాయంగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సాగదీయడం ఇష్టంలేదు. దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మీ గురించి ఎన్టీఆర్ ఏమన్నారో అసెంబ్లీ టీవీల్లో చూపమంటారా?
సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉందని విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన పార్టీ మారలేదా? గెలిచిన నాలుగు రోజుల్లోనే పార్టీ మారారని అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తి ఘాటుగా విమర్శించారు. అధికార పక్షం సాంప్రదాయాలు పాటించకపోయినా మేం పాటిస్తాం. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటించగానే ప్రొటెం స్పీకర్ మమ్మల్ని కూడా అడుగుతారని భావించా’ అని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకుంటూ ‘చంద్రబాబు గురించి సొంత కూతురిని ఇచ్చిన ఎన్టీఆర్ ఏమన్నారో అసెంబ్లీలో స్పీకర్ అనుమతితో టీవీల్లో వేసి చూపించమంటారా?’ అని సూటిగా ప్రశ్నించారు. బలహీన వర్గాల నుంచి స్పీకర్‌ను ఎంపిక చేస్తే అందులోనూ రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
వివాదం రేపిన చంద్రబాబు వ్యాఖ్యలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. టీడీపీ సర్కారు సంతలో పశువులను కొన్నట్లు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మంత్రి పదవులు కూడా ఇచ్చిందని అధికార పక్ష సభ్యులు అనగా చంద్రబాబు లేచి ‘మీదీ రాజకీయ కుటుంబమే. మీ తండ్రి (వైఎస్ రాజశేఖరరెడ్డి) 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మరి ఆనాడు మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకుంటారా?’ అంటూ చంద్రబాబు సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలుగజేసుకుని, అప్పట్లో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టమే లేదని గుర్తుచేశారు. ‘‘గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వం చేయదని నేను చెబుతుంటే చంద్రబాబు ఏమేమో మాట్లాడుతున్నారు. తప్పు చేసినందుకు వారికి (టీడీపీకి) దేవుడు గొప్పగా స్క్రిప్టు రాశారు. దేవుడి జడ్జిమెంట్ చూసైనా మారాలని చెబితే కుక్కతోక ఎప్పుడూ వంకరే అనే చందంగా వ్యవçహరిస్తున్నారు’’ అని జగన్ తప్పుబట్టారు. మరోసారి చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏదో మాట్లాడబోగా.. ‘‘బాబు మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఎందుకయ్యా హత్య చేశారని అడిగితే గతంలో 15–25 ఏళ్ల కిత్రం హత్యలు జరిగాయి కదా? అని చెప్పినట్లుంది. చంద్రబాబు గతంలో సభా నాయకునిగా ఉండి చేసిందేమిటి? 23 మంది విపక్ష సభ్యులను కొన్నారు. స్పీకర్ స్థానాన్ని నిర్వీర్యం చేశారు. ఇది తప్పు. అన్యాయం. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలను మీరు (స్పీకర్) అవకాశం ఇస్తే వినిపిస్తా’’ అని జగన్ అన్నారు. స్పీకర్ స్పందిస్తూ.. సభ్యులు సంయమనం పాటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment