బయటపడిన ఖాకీల ‘బండారం’ | Police Neglected To Arrest The Son Of Former TDP MLA Bandaru | Sakshi
Sakshi News home page

బయటపడిన ఖాకీల ‘బండారం’

Published Tue, Dec 17 2019 8:07 AM | Last Updated on Tue, Dec 17 2019 12:25 PM

Police Neglected To Arrest The Son Of Former TDP MLA Bandaru - Sakshi

బండారు అప్పలనాయుడు- బీచ్‌రోడ్డులో డివైడర్‌పైకి దూసుకెళ్లి ధ్వంసమైన అప్పలనాయుడు కారు (ఫైల్‌)

సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు విషయంలో త్రీ టౌన్‌ పోలీసుల బండారం బయటపడింది. ఈ కేసు విషయంలో వారు అపకీర్తిని మూటగట్టుకున్నారు. బీచ్‌రోడ్డులో బీభత్సం సృష్టించి బైకుపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడడానికి కారకుడైన అప్పలనాయుడుని సకాలంలో అరెస్టు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో అప్పలనాయుడు నడుపుతున్న కారు (ఏపీ31డీపీ 6666) అదుపు తప్పి బైకుని ఢీకొన్న తరువాత ఆర్‌కేబీచ్‌ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన మెడికల్‌ విద్యార్థి స్నేహితులు రావడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.

దీంతో అప్పలనాయుడు, అతని స్నేహితులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రోజూ బీచ్‌రోడ్డులో త్రీ టౌన్‌ పోలీసుల రాత్రి గస్తీ ఉంటుంది. ఏఎస్‌ఐ రాజేశ్వరరావు, ఇతర పోలీసులు వెళ్లేసరికే నిందితులు పారిపోయారని త్రీటౌన్‌ పోలీసులు చెబుతున్నారు. పైగా నిందితులు కారు వెనుక వైపు గల నెంబర్‌ ప్లేట్‌ సైతం మాయం చేయడానికి ప్రయత్నించారంటే ఎంతగా బరితెగించారో ఇట్టే అర్ధం అవుతుంది. ఆర్‌కేబీచ్‌లో గల సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించ లేదంటే ఎంత నత్తనడకన దర్యాప్తు చేశారన్నది తెలుస్తోంది.

 మీడియాకి తెలియనివ్వకుండా... 
త్రీ టౌన్‌ పోలీసులపై ఈ కేసు విషయమై మొదటి నుంచీ తెలుగుదేశం నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు అప్పలనాయుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్టేషన్‌లో లొంగిపోవడం వల్లనే అరెస్టు చూపించారే తప్ప వారంతట వారు అరెస్టు చేసిన పాపాన పోలేదు. ఫలితంగానే నిందితుడిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు పెట్టే అవకాశం లేకపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కారులో ఉన్న వారు మద్యం సేవించి ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని త్రీ టౌన్‌ పోలీసులు 24 గంటలలోపు అరెస్టు చేసి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్ష చేస్తే నిజం నిగ్గు తేలేది. ఆదివారం పెందుర్తిలోని అప్పలనాయుడు ఇంటికి పోలీసులు వెళ్లారని చెబుతున్నప్పటికీ... ఎవరు వెళ్లారన్నది మాత్రం మీడియాకి చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

గతంలో కూడా వివాదాస్పద చరిత్ర ఉన్న అప్పలనాయుడుని త్రీటౌన్‌ పోలీసులు కావాలనే అరెస్టు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ నిందితుడు అరెస్టు అయిన విషయం కూడా పోలీసులు మీడియాకి పొక్కనీయలేదంటే తెలుగుదేశం పారీ్టకి ఎంతగా తొత్తుల్లా వ్యవహరించారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బండారు పరువు పోతే ఎలా అనుకున్నారో ఏమోగానీ పోలీసులు మాత్రం విషయం బయటకు పొక్కనీయలేదు. ఇక సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిందితుడు అప్పలనాయుడుకి 41 నోటీస్‌ ఇచ్చి పంపించేశారు.

ఈ విషయం కూడా రాత్రి 7.30 గంటల వరకు మీడియాకి చెప్పకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నా చితకా కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తే హడావిడి చేసే త్రీటౌన్‌ పోలీసులు బడాబాబుల కుమారులను అరెస్టు చేసినపుడు మాత్రం గోప్యంగా ఉంచడం తీవ్ర దుమారం రేపుతోంది. సదరు నిందితుడు మంగళవారం కోర్టులో హాజరవుతాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసుని త్రీ టౌన్‌ సీఐ కె.రామారావు పర్యవేక్షణలో ఎస్‌.ఐ.జి.హరీష్‌ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, క్షతగాత్రులలో ఒకరైన మెడికో చంద్రకిరణ్‌ ఆదివారం రాత్రి మళ్లీ కేజీహెచ్‌లో చికిత్స కోసం చేరారు. కారు ప్రస్తుతం పోలీసుల స్వా«దీనంలో ఉంది. 

మద్యం విక్రయాలు ఎలా..?
ప్రభుత్వం మద్య నియంత్రణలో భాగంగా దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడుతున్నాయి. బార్లు రాత్రి 11 గంటలకు మూతపడుతున్నాయి. మరి బండారు అప్పలనాయుడు మిత్ర బృందం అర్ధరాత్రి ఎలా మద్యపానం చేశారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. మద్యం మత్తులో ఉండడం వల్లనే అదుపు తప్పి ప్రమాదం చేశారని బాధితులు, స్థానికులు అంటున్నారు. ఇకనైనా అర్ధరాత్రి మద్యం విక్రయాలను ఎక్సైజ్‌ పోలీసులు అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement