bandaru satyanarayanamurty
-
‘రాష్ట్రాన్ని విడిచి వెళ్తా.. రాజకీయాలు వదిలేస్తారా!’
సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మతి భ్రమించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డితో తను తీసుకున్న ఫోటోలు మాజీ మంత్రి దుష్ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పెందుర్తిలో జరిగిన ఒక ఘటనలో భూ ఆక్రమణకు యత్నించిన సూర్య ప్రకాశ్ రెడ్డి.. సీఎం జగన్మోహన్రెడ్డికి సన్నిహితుడని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బండారుపై విరుచుకుపడ్డారు నిజానికి తాను ప్రజా సంకల్ప యాత్రలో కార్యకర్తగా సీఎం జగన్మోహన్రెడ్డితో ఫోటో దిగినట్లు స్పష్టం చేశారు. తనకు భూ ఆక్రమణలతో సంబంధం ఉందని నిరూపిస్తే రాష్ట్రాన్ని విడిచి వెళ్తానని సూర్యప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. నిరూపించలేని పక్షంలో బండారు సత్యనారాయణమూర్తి, అతని తనయుడు రాజకీయాలు విడిచి వెళ్తారా అని ప్రశ్నించారు. చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన ప్రముఖ కన్నడ నటుడు -
బయటపడిన ఖాకీల ‘బండారం’
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు విషయంలో త్రీ టౌన్ పోలీసుల బండారం బయటపడింది. ఈ కేసు విషయంలో వారు అపకీర్తిని మూటగట్టుకున్నారు. బీచ్‌రోడ్డులో బీభత్సం సృష్టించి బైకుపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడడానికి కారకుడైన అప్పలనాయుడుని సకాలంలో అరెస్టు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో అప్పలనాయుడు నడుపుతున్న కారు (ఏపీ31డీపీ 6666) అదుపు తప్పి బైకుని ఢీకొన్న తరువాత ఆర్కేబీచ్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన మెడికల్ విద్యార్థి స్నేహితులు రావడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో అప్పలనాయుడు, అతని స్నేహితులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రోజూ బీచ్‌రోడ్డులో త్రీ టౌన్ పోలీసుల రాత్రి గస్తీ ఉంటుంది. ఏఎస్ఐ రాజేశ్వరరావు, ఇతర పోలీసులు వెళ్లేసరికే నిందితులు పారిపోయారని త్రీటౌన్ పోలీసులు చెబుతున్నారు. పైగా నిందితులు కారు వెనుక వైపు గల నెంబర్ ప్లేట్ సైతం మాయం చేయడానికి ప్రయత్నించారంటే ఎంతగా బరితెగించారో ఇట్టే అర్ధం అవుతుంది. ఆర్కేబీచ్లో గల సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించ లేదంటే ఎంత నత్తనడకన దర్యాప్తు చేశారన్నది తెలుస్తోంది. మీడియాకి తెలియనివ్వకుండా... త్రీ టౌన్ పోలీసులపై ఈ కేసు విషయమై మొదటి నుంచీ తెలుగుదేశం నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు అప్పలనాయుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్టేషన్లో లొంగిపోవడం వల్లనే అరెస్టు చూపించారే తప్ప వారంతట వారు అరెస్టు చేసిన పాపాన పోలేదు. ఫలితంగానే నిందితుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టే అవకాశం లేకపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కారులో ఉన్న వారు మద్యం సేవించి ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు 24 గంటలలోపు అరెస్టు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేస్తే నిజం నిగ్గు తేలేది. ఆదివారం పెందుర్తిలోని అప్పలనాయుడు ఇంటికి పోలీసులు వెళ్లారని చెబుతున్నప్పటికీ... ఎవరు వెళ్లారన్నది మాత్రం మీడియాకి చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా వివాదాస్పద చరిత్ర ఉన్న అప్పలనాయుడుని త్రీటౌన్ పోలీసులు కావాలనే అరెస్టు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ నిందితుడు అరెస్టు అయిన విషయం కూడా పోలీసులు మీడియాకి పొక్కనీయలేదంటే తెలుగుదేశం పారీ్టకి ఎంతగా తొత్తుల్లా వ్యవహరించారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బండారు పరువు పోతే ఎలా అనుకున్నారో ఏమోగానీ పోలీసులు మాత్రం విషయం బయటకు పొక్కనీయలేదు. ఇక సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిందితుడు అప్పలనాయుడుకి 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఈ విషయం కూడా రాత్రి 7.30 గంటల వరకు మీడియాకి చెప్పకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నా చితకా కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తే హడావిడి చేసే త్రీటౌన్ పోలీసులు బడాబాబుల కుమారులను అరెస్టు చేసినపుడు మాత్రం గోప్యంగా ఉంచడం తీవ్ర దుమారం రేపుతోంది. సదరు నిందితుడు మంగళవారం కోర్టులో హాజరవుతాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసుని త్రీ టౌన్ సీఐ కె.రామారావు పర్యవేక్షణలో ఎస్.ఐ.జి.హరీష్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, క్షతగాత్రులలో ఒకరైన మెడికో చంద్రకిరణ్ ఆదివారం రాత్రి మళ్లీ కేజీహెచ్‌లో చికిత్స కోసం చేరారు. కారు ప్రస్తుతం పోలీసుల స్వా«దీనంలో ఉంది. మద్యం విక్రయాలు ఎలా..? ప్రభుత్వం మద్య నియంత్రణలో భాగంగా దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడుతున్నాయి. బార్లు రాత్రి 11 గంటలకు మూతపడుతున్నాయి. మరి బండారు అప్పలనాయుడు మిత్ర బృందం అర్ధరాత్రి ఎలా మద్యపానం చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. మద్యం మత్తులో ఉండడం వల్లనే అదుపు తప్పి ప్రమాదం చేశారని బాధితులు, స్థానికులు అంటున్నారు. ఇకనైనా అర్ధరాత్రి మద్యం విక్రయాలను ఎక్సైజ్ పోలీసులు అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. -
‘సినిమా టిక్కెట్లు అమ్ముకునే నువ్వా విమర్శించేది?’
సాక్షి, విజయవాడ: పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సూచించారు. విజయవాడలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకున్న సత్యనారాయణమూర్తికి వైఎస్సార్సీపీ నాయకులపై అవాకులు, చవాకులు పేలే అర్హత లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ అరాచకాలపై బహిరంగ చర్చకు తమ పార్టీ మండల అధ్యక్షుడు వస్తాడని, ఆయన స్థాయికి మండలాధ్యక్షుడు చాలని ఎద్దేవా చేశారు. సత్యనారాయణ, ఆయన కుమారుడే జెర్రిపోతులపాలెం ఘటనలో అసలు సూత్రధారులని ఆరోపించారు. నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జెర్రిపోతులపాలెం ఘటనపై సత్యనారాయణ, ఆయన కుమారుడిపై ప్రైవేటు కేసు పెడతామన్నారు. ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. సత్యనారాయణపై వెంటనే కేసులు పెట్టకపోతే చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని మేరుగ నాగార్జున అన్నారు. -
అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే.. రాజీనామా బాటలో మరొకరు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అధికార టీడీపీలో తీవ్ర అసంతృప్తి రాజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అలిగారు. పార్టీ కోసం పనిచేస్తున్నా మంత్రి పదవి ఇవ్వరా అని ఆక్రోశం వ్యక్తం చేశారు. బోండా ఉమాను బుజ్జగించేందుకు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. బోండా రాజీనామా చేయడానికి సిద్ధపడినట్టు సమాచారం. చంద్రబాబు కాపుల గొంతు కోశారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. చంద్రబాబు కేశినేనికి ఫోన్ చేసి బోండా ఉమను తన వద్దకు తీసుకురావాలని చెప్పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ వైఖరిపై అలకబూనారు. ఆయన గన్మెన్లను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కూతురు శిరీష.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. చాలా జిల్లాల్లో టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేసి, సీనియర్లను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.