
సాక్షి, విజయవాడ: పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సూచించారు. విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకున్న సత్యనారాయణమూర్తికి వైఎస్సార్‌సీపీ నాయకులపై అవాకులు, చవాకులు పేలే అర్హత లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణ అరాచకాలపై బహిరంగ చర్చకు తమ పార్టీ మండల అధ్యక్షుడు వస్తాడని, ఆయన స్థాయికి మండలాధ్యక్షుడు చాలని ఎద్దేవా చేశారు. సత్యనారాయణ, ఆయన కుమారుడే జెర్రిపోతులపాలెం ఘటనలో అసలు సూత్రధారులని ఆరోపించారు. నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జెర్రిపోతులపాలెం ఘటనపై సత్యనారాయణ, ఆయన కుమారుడిపై ప్రైవేటు కేసు పెడతామన్నారు. ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. సత్యనారాయణపై వెంటనే కేసులు పెట్టకపోతే చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని మేరుగ నాగార్జున అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment