కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి: బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి కొనియాడారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరిని తరతరాలవారు స్మరించుకునేలా, సీఎం వైఎస్ జగన్ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టా రని చెప్పారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ అల్లూరి స్ఫూర్తితో, ఆదివాసీల హక్కుల్ని కాపాడటంలోనూ, వారికి అన్నిరకాలుగా అండదండలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు.
గిరిజనులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామని, వారి ఆధీనంలోని పోడు భూముల వ్యవసాయాన్ని ఎవరూ ఆటంకపరచకుండా వ్యవసాయ పట్టాల్ని ఇచ్చామని వివరించారు. శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్‌కుమార్, పార్టీ ఎస్టీ విభాగ అధ్యక్షుడు హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment