ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి
సాక్షి, విజయనగరం: రాష్ట్ర శాసనసభలో విజయనగరం జిల్లా కళకళ లాడింది. జిల్లాకు చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలూ వైఎస్సార్‌సీపీవారే కావడం ఒక ఎత్తయితే... అందులో ఒకరు డిప్యూటీ సీఎం కావడం మరో ప్రత్యేకత. అంతేకాదు... రాష్ట్రంలోని సీఎం, ప్రతిపక్షనేతతో సహా అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ శంబంగి మన జిల్లావారు కావడం మరో విశేషం. మొత్తమ్మీద రాష్ట్ర శాసనసభ చరిత్ర పుటల్లో మరోసారి విజయనగరం జిల్లాకు సముచిత స్థానం లభించడం ఈ జిల్లావాసులకు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదిహేనవ శాసన సభ బుధవారం కొలువుతీరింది.
విజయనగరం జిల్లాకు ఆదినుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా నుంచే ఉద్దండులైన ఎందరో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇన్నాళ్లూ జిల్లాకు ఉన్న గుర్తింపు ఒకెత్తయితే ఇప్పుడు వచ్చిన గుర్తింపు మరొకెత్తు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జిల్లాలోని విజయనగరం పార్లమెంట్‌తో పాటు, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించింది. క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాకు రెండు మంత్రి పదవులను ఇచ్చి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పించారు. అక్కడితో ఆగిపోకుండా ఉపముఖ్యమంత్రి పదవిని కూడా జిల్లాకే కేటాయించి మరింత గౌరవాన్ని పెంచారు.
అప్పటికీ సరిపెట్టకుండా సీఎంతో పాటు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ బాధ్యతను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అప్పగించి రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించారు. దీంతో శాసనసభలో విజయనగరం జిల్లా ప్రత్యేకంగా కనిపించింది. జిల్లా మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు చేత ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.
నిలిచిన శంబంగి ఆత్మగౌరవం
రాష్ట్ర శాసనసభలో ప్రమాణస్వీకారోత్సవాన్ని మాత్రమే అందరూ చేశారు. అయితే ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాత్రం తన ఆత్మగౌరవాన్ని తలెత్తుకునేలా చేశారు. విషయం ఎమిటంటే శంబంగి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. అప్పట్లో హైదరాబాద్‌లో ఒక ఎమ్మెల్యే, తెర్లాంలో ఒక ఎమ్మెల్యే చనిపోయారు. బై ఎలక్షన్ వచ్చింది. నామినేషన్‌కు ఆఖరి రోజు వరకు టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు అభ్యర్థి పేరు ప్రకటించలేదు. నామినేషన్ ముందురోజు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని అభ్యర్థిగా వేస్తున్నట్లు శంబంగికి చెప్పారు.
ఆయనకు ఏ ప్రాతిపదికన టిక్కెట్ ఇచ్చారని, మీరు తీసుకున్న నిర్ణయం కూడా తప్పని చంద్రబాబుకి చెప్పినా వినలేదు. ఒకసారి వచ్చి సమస్య పరిష్కరించాల్సిందిగా అర్థించారు. రావడానికి తనకు ఖాళీ లేదన్నారు చంద్రబాబు. ఇది రాజకీయ సమస్య కాబట్టి మీరు ఒకసారి ఖాళీ చేసుకుని రావాల్సిందేనని శంబంగి నచ్చజెప్పినా తనకు ఖాళీ అయ్యాక చెబుతానంటూ నిర్లక్ష్యంగా చంద్రబాబు బదులిచ్చారు. ఆ మాటకు నొచ్చుకున్న శంబంగి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీలో కొనసాగలేనంటూ టీడీపీని వదిలి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ హోదాలో ఉన్న శంబంగి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు ప్రొటెం స్పీకరైన శంబంగి వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని మరీ అభివాదం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment