నవశకానికి నాంది | Pushpa Srivani Given Allotment Letter To Grama Sachivalaya Job Candidates | Sakshi
Sakshi News home page

నవశకానికి నాంది

Published Tue, Oct 1 2019 8:21 AM | Last Updated on Tue, Oct 1 2019 8:21 AM

Pushpa Srivani Given Allotment Letter To Grama Sachivalaya Job Candidates - Sakshi

అభ్యర్థికి నియామక పత్రాన్ని అందజేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యేలు, అధికారులు

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి నాంది పలికింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సాక్షిగా సచివాలయ వ్యవస్థ అమలుకు శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలోని రాజీవ్‌ క్రీడాప్రాంగణంలో సోమవారం గ్రామ/వార్డు సచివాలయాల్లో పలు రకాల ఉద్యోగాలకు ఎంపికైన 4,283 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో మైదానంలో పండగ సందడి కనిపించింది. నియామక పత్రాలు అందుకున్న నిరుద్యోగులు చిరునవ్వులు చిందించారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం, ఉద్యోగాల విప్లవం సృష్టించడంతో చిరకాల వాంఛతీరిందంటూ మురిసిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పాముల పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు జ్యోతిప్రజ్వలన చేసి నియామకపత్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన  ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వినూత్న రీతిలో ఆలోచిస్తూ సుమారు ఒక లక్షా 26 వేల పోస్టులను శాశ్విత ప్రాతిపదికన భర్తీ చేసి నిరుద్యోగులకు కొత్త జీవితాలు ప్రసాదించారన్నారు.

మరోవైపు ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లే  శాశ్వత యం త్రాంగం అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. కేవలం 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరించే ఒక చక్కని సుపరిపాలనా వ్యవస్థను తెరపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా  గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అంకిత భావంతో విధులను నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరుతేవాలని ఆమె విజ్ఞప్తిచేశారు. జిల్లాలో ప్రసుత్తం భర్తీ చేసిన 4,283 పోస్టుల్లో సగానికి పైగా మహిళలనే ఎంపిక చేయడం మహిళా శక్తిపై ప్రభుత్వానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా నిర్వహించిన జిల్లా యంత్రాగానికి అమె శాల్యూట్‌ చేశారు. అందరి ముఖాలలో చిరునవ్వులు చూడాలన్నదే సీఎం ధ్యేయంగా పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి,  ప్రజల సంక్షేమం కోసం  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ ఒక్కడుకు ముందుకు వేసి పాలన సాగిస్తే యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండడుగులు ముందుకు వేసి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కష్టపడి చదివి ఎంపికైన నిరుద్యోగులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవాకులు, చవాకులు పేలుస్తూ.. పేపర్‌లీక్‌ అయ్యిందంటూ నిరుద్యోగల్లో అలజడి రేపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఉద్యోగాల భర్తీ ఎలా సాగిందో నిరుద్యోగ అభ్యర్థులకు తెలుసన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. 

లక్షా 26 వేల ఉద్యోగాలను శాశ్విత ప్రాతిపదికన భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిలచారన్నారు. నిరుద్యోగుల ప్రతిభకు పట్టం కట్టారన్నారు. జేసీ కె.వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ  గ్రామ, వార్డు సచివా లయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను 92 శాతం మేర అందజేసి రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమస్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగుల నియామకం జరిగిందన్నారు. ఉద్యోగులుగా నియామకం అయిన వారంతా అంకిత భావంతో విధులను నిర్వర్తిస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీ–2 ఆర్‌.కూర్మనాథ్, డీఆర్వో జె.వెంకటరావు, డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు, డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఆర్డీవో సాల్మన్‌రాజు,  జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, పశుసంవర్దక శాఖ జేడీ నరసింహులు, సెట్విజ్‌ సీఈఓ నాగేశ్వరరావు, విజయనగరం కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ, పలు  శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

చరిత్ర సృష్టించారు.. 
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ  చరిత్ర సృష్టిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నీ అమలు చేసే దిశగా సీఎం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలి. రాష్ట్ర భవిష్యత్‌ మీ పైనే ఆధారపడి ఉంది.  గత పాలకుల్లా డబ్బు సంపాదన కోసం రాజకీయంచేసేవాళ్లం మేము కాదు. మంత్రులు బొత్స, శ్రీవాణి, బెల్లాన నాయకత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. 
– కోలగట్ల వీరభధ్రస్వామి, ఎమ్మెల్యే, విజయనగరం నియోజకవర్గం 

నూతన శకం ఆరంభం 
రాష్ట్రంలో జిల్లాలో నూతన శకం ఆరంభమైంది. 4 నెలల వ్యవధిలోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనదైన మార్కు చూపించారు. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పారదర్శకమైన పాలనకు శ్రీకారం చుట్టారు. గత 5 ఏళ్లలో కుళ్లిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి మహాత్మా గాంధీ 150వ జయంతి రోజున నాంది పలకడం శుభపరిణామం.  నిరుద్యోగుల ప్రతిభకు పట్టంకట్టే రోజులు వచ్చాయి. 
శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గం 

నమ్మకాన్ని నిలబెట్టండి 
గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్ధులకు అభినందనలు. జగన్‌మోహన్‌రెడ్డి మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా చిత్తశుద్ధితో పని చేయాలి.  చక్కని చిరునవ్వుతో అందరికీ సేవలందించాలి. లక్షలాది ఉద్యోగాలు  ఒకే సారి భర్తీ చేయటం చాలా గర్వంగా ఉంది. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కాపాడుకుందాం. ఆయన ఆశయాలను అందరూ కలసిగట్టుగా నెరవేర్చుదాం.
– బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్యే, నెల్లిమర్ల నియోజకవర్గం 

సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, తదితరులు  సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, తదితరులు భాగస్వాములు కావాలి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఓ చారిత్రాత్మక ఘట్టా నికి తెరలేపారు. అందులో మనందరినీ భాగస్వాములు చేయడం గొప్ప అనుభూతిగా మిగులుతుంది. తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేనైనా, ఎంపీనైనా క్షమించేది లేదని గెలిచిన కొద్ది రోజుల్లోనే  చెప్పిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. అటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి నమ్మకాన్ని మనందరం నిలబెట్టాలి.        
 – కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, ఎస్‌.కోట 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement