బొత్సకు మరో దెబ్బ!
నెల్లిమర్ల, న్యూస్‌లైన్ : నెల్లిమర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. నాలుగు మండలాలకు చెందిన ప్రముఖ నేతలు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా నేతలు అయోమయంలో పడ్డారు. మొన్నటి వరకు పార్టీకి కాస్తోకూస్తో పట్టున్న నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ మండలాలకు చెందిన నేతలు, క్యాడర్ కూడా సోమవారం వైఎస్సార్ సీపీలో చేరడంతో దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా నేడో రేపో ఆ పార్టీకి చెందిన మరికొంత మంది ముఖ్య నేతలు కూడా వైఎస్సార్ సీపీలో చేరే అవకాశముంది. దీంతో సాధారణ ఎన్నికల మాట అటుంచితే.. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు సైతం కరువయ్యే పరిస్థితి దాపురిం చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో పాటు క్యాడర్ కూడా వైఎస్సార్ సీపీలో చేరడంతో ఆ పార్టీ క్యాడర్‌లో ఎన్నికల జోష్ మొదలైంది.
నియోజకవర్గంలోని నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు కాస్తోకూస్తో పట్టుండేది. ఈ మండలాల్లోని తాజా మాజీ నేతలంతా ఆ పార్టీకి చెందిన వారు కావడంతో త్వరలో జరిగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా అనుకున్న ఫలితాలు సాధించవచ్చునని ఆ పార్టీ నేతలు ఆశించారు. ఈ మూడు మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ పదవులను కూడా తమ పార్టీనే కైవసం చేసుకుంటుందని పార్టీ అధిష్ఠానం భావించింది. అంతేగాకుండా స్థానిక ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తే త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సైతం సునాయాసంగా గెలుపొందుతారని అంచనాలు వేశారు.
అయితే ఆ పార్టీ అధిష్ఠానం అంచ నా లు తలకిందులయ్యాయి. తాజాగా రాజకీయ పరిణామాలు పార్టీని పూర్తిగా దెబ్బతీశాయి. నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నేతలు, క్యాడర్ భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం మండలాలకు చెందిన ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలు సైతం పార్టీని వీడడంతో నియోజకవర్గంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయింది. నెల్లిమర్ల మండలానికి చెందిన డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, విజయనగరం ఏఎంసీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములనాయుడులతో పాటు మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు భారీస్థాయిలో సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడి, వైఎస్సార్‌సీపీలో చేరారు.
అలాగే భోగాపురం మండలానికి చెందిన మాజీ ఎంపీ కొమ్మూరు అప్పలస్వామి, ఆయన అల్లుడు కందుల రఘుబాబులు వారి అనుచర గణంతో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే డెంకాడ మండలంలో రాజకీయంగా మంచిపట్టున్న రాము మాస్టారు సైతం ఆయన అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్‌లో త్వరలో చేరనున్నారు. దీంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సైతం ఆపార్టీకి అభ్యర్థులు దొరకని సరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ఆస్కారముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.