‘కమలం’ దిద్దుబాట | BJP party loses power in Karnataka | Sakshi
Sakshi News home page

‘కమలం’ దిద్దుబాట

Published Sun, Mar 30 2014 2:18 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

‘కమలం’ దిద్దుబాట - Sakshi

‘కమలం’ దిద్దుబాట

కన్నడ తీర్పు ఎటువైపు?
 '   అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్ నేతలు
'    మోడీ గాలితో బీజేపీలో కదనోత్సాహం
'    రాష్ర్టమంతటా పుంజుకోని జేడీఎస్
 
 వి. సురేంద్రన్, సాక్షి, బెంగళూరు: అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలు.. వీటి కారణంగానే గత ఏడాది కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఇవే అంశాలు లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను దెబ్బతీస్తాయన్న ఆశతో కమల దళం ఉంది.  రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఘట్టం కూడా ముగిసిపోవడంతో అన్ని పార్టీలూ ప్రచారంలో తలమునకలుగా ఉన్నాయి. దక్షిణాదిలో అధికారానికి కర్ణాటకను సింహద్వారంగా అభివర్ణిస్తూ వచ్చిన బీజేపీ, 2008లో అధికారం చేపట్టినా, తర్వాత ఐదేళ్లూ నానా అవలక్షణాలతో అభాసు పాలైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయే నాటికి ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. అవినీతి ఆరోపణలతో పార్టీ నుంచి నిష్ర్కమించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి బి.శ్రీరాములు సొంత కుంపట్లు పెట్టుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పుట్టి మునిగింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ‘కమల’నాథులు ‘దిద్దు’బాటలో పడ్డారు. యడ్యూరప్పను, శ్రీరాములును కూడా తిరిగి పార్టీలోకి రప్పించుకున్నారు. యడ్యూరప్పను శివమొగ్గలో, శ్రీరాములును బళ్లారిలో బరిలోకి దించింది.
 
 మోడీ జోష్..
 రాష్ట్రంలోని ముంబై-కర్ణాటక, కోస్తా, మలెనాడు   ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో సంఘ్ పరివార్ క్రియాశీలంగా ఉంది. బీజేపీకి ఆది నుంచీ ఇదే శ్రీరామ రక్ష. మోడీ జోష్ కారణంగా ఈ జిల్లాల్లో పార్టీకి పునరుత్తేజం కలిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేవలం పదకొండు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు తరుముకొచ్చిన నేపథ్యంలో బీజేపీ నేతలు తమ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి మోడీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ కంటే ముందుగానే అభ్యర్థులను సైతం ప్రకటించారు. మోడీ ప్రభంజనానికి తోడు కేంద్రంలోని యూపీఏ-2 సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలు తమకు ఓట్ల వర్షం కురిపిస్తాయని బీజేపీ నాయకులు గట్టి విశ్వాసంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండు సంస్థలు ఇదివరకే రాష్ట్రంలో సర్వే ఫలితాలను వెలువరించాయి. ఇవి తమకు అనుకూలంగా ఉండడం కమలనాథుల్లో ఉత్సాహం నింపింది. యడ్యూరప్ప పునరాగమనంతో  లింగాయత్‌లతో కూడిన ఓటు బ్యాంకు తిరిగి పదిలం కావడం బీజేపీకి కలిసొచ్చే అంశం.
 
 కాంగ్రెస్‌లో విభేదాలు
రాష్ట్రంలో గతేడాది  అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో అదే ఊపును ప్రదర్శించలేకపోతోంది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సిద్ధరామయ్యను కాంగ్రెస్ వాదులు ఇప్పటికీ ‘వలస జీవి’గానే పరిగణిస్తున్నారు. గతంలో జనతా పరివార్‌కు చెందిన సిద్ధ రామయ్య... మంత్రివర్గంలో తన అనుయాయులకే కీలక శాఖలను కట్టబెట్టడం కాంగ్రెస్‌వాదులకు మింగుడు పడడం లేదు. దీనికి తోడు అనాదిగా పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు కూడా సీఎం పదవిని తమ సామాజిక వర్గానికి ఇవ్వలేదని పార్టీపై గుర్రుగా ఉన్నారు. మరో వైపు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కూడా పార్టీలో అసంతృప్తి తేనెతుట్టెను కదిల్చింది.
 
  బెంగళూరు సెంట్రల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ కేంద్ర మంత్రి జాఫర్ షరీఫ్ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సంఘ్ పరివార్ బలంగా ఉన్న ఎనిమిది జిల్లాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లభించకపోవడం కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతోంది. పాత మైసూరులో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నా.. జేడీఎస్ నుంచి సవాళ్లు  ఎదుర్కోవాల్సి వస్తోంది. హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదాను ఇచ్చినా.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఆ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో నమ్మకంగా గెలిచే స్థానం ఒక్కటీ కనిపించడం లేదు. గుల్బర్గాలో రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గేతో పాటు చిక్‌బళ్లాపూర్‌లో కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఏటికి ఎదురీదుతున్నారు.
 
 తృతీయ ఫ్రంట్ కలలు
 మాజీ ప్రధాని దేవెగౌడ మళ్లీ తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నారు. అయితే, ఆయన సారథ్యంలోని జేడీఎస్ బలం నానాటికీ క్షీణిస్తోంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో మాండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు సమర్పించుకుంది. 26 స్థానాల్లో పోటీ చేస్తున్న ఈ పార్టీ రెండు లేదా మూడు స్థానాలతో తృప్తి పడాల్సి రావచ్చు. చిక్‌బళ్లా పూర్‌లో దేవెగౌడ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, వీరప్ప మొయిలీతో తలపడుతున్నారు. పాత మైసూరులో... ఒక్కలిగ సామాజిక వర్గంలో మాత్రమే పట్టు ఉండడం వల్ల జేడీఎస్ ఏ మాత్రం పురోగతి సాధించలేక పోతోంది.
 
 విలక్షణ ఓటరు
 కర్ణాటకలో 4.62 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.55 శాతం, జేడీఎస్‌కు 20.09, బీజేపీకి 19.97, యడ్యూరప్ప నాయకత్వంలోని కేజేపీకి 9.83 శాతం ఓట్లు పోలయ్యాయి. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా యూపీఏకి మద్దతు లభించినా.. కర్ణాటకలో బీజేపీ 19 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను వేర్వేరుగా చూడడంలో కన్నడ ఓటర్లు విలక్షణమైన తీరు ప్రదర్శిస్తున్నారు. మరి ఈసారి యూపీఏ వైపు మొగ్గుతారా లేదా ఎన్డీఏను ఆదరిస్తారో చూడాలి.
 
 బిగ్ ఫైట్‌కు సిద్ధం
 దిగ్గజ నేతలపై పోటీకి సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన ‘అనధికారిక ఒప్పందా’నికి తెరపడినట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఇరుపార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలపై బలమైన అభ్యర్థులను పోటీకి నిలపొద్దనేదే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఆ అనధికారిక ఒప్పందం. అయితే, ఈ సారి ఆ పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. రెండు పార్టీలూ ప్రత్యర్థి దిగ్గజాలపై గట్టి అభ్యర్థులనే బరిలో నిలపాలనుకుంటున్నాయి.
 
 గుజరాత్‌లోని వదోదర నుంచి పోటీలో ఉన్న నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాహుల్‌కు సన్నిహితుడైన మధుసూదన్ మిస్త్రీని కాంగ్రెస్ బరిలో దింపింది. వారణాసి నుంచి కూడా మరో సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను పోటీకి నిలపాలని ఆలోచిస్తోందని సమాచారం. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ బరిలో ఉన్న అమృతసర్ నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్‌ను పోటీకి నిలిపింది. దాంతో బీజేపీ కూడా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలపై బలమైన అభ్యర్థులనే పోటీలో నిలపాలనుకుంటోంది. రాహుల్ పోటీ చేస్తున్న అమేథీలో బీజేపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, టీవీనటి ‘స్మృతి ఇరానీ’ని పోటీకి దింపాలనుకుంటోంది.
 
 ద్వేష వ్యాపారులు..
‘మోడీని ముక్కలుగా నరికేస్తా’ అంటూ ఆవేశంగా మాట్లాడి చిక్కుల్లో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ సహ్రాన్‌పూర్ (యూపీ) అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ ఆగ్రహాన్ని కూడా బీజేపీ తనకనుకూలంగా మలచుకుంటోంది. దానితో సహా ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు మోడీపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలన్నింటినీ కలిపి బీజేపీ ‘నఫ్రత్ కే సౌదాగర్’ (ద్వేష వ్యాపారులు) పేరుతో ఒక చిన్న ప్రచార చిత్రాన్ని రూపొందించింది. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీని విమర్శిస్తూ సోనియాగాంధీ చేసిన ‘మృత్యు బేహారీ’(2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ) వ్యాఖ్యను, ఈ ఫిబ్రవరిలో చేసిన ‘అధికారం కోసం మోడీ దేశంలో విషబీజాలు నాటుతున్నాడు’ అన్న వ్యాఖ్యను, గతంలో సల్మాన్ ఖుర్షీద్ చేసిన ‘నపుంసకుడు’ వ్యాఖ్యలను ఈ చిత్రంలో పొందుపర్చారు.
 
 రాప్.. ఇది రాఖీ పార్టీ
 వివాదాల్ని ఇంటిపేరుగా పెట్టుకున్న బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ ‘రాష్ట్రీయ ఆమ్ పార్టీ(రాప్)’ పేరుతో ఓ పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరఫున వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పార్టీకి తాను ఉపాధ్యక్షురాలినని, అధ్యక్షులు వేరే ఉన్నారని చెబుతున్నారు. తన హాట్ ఇమేజ్‌కి గుర్తుగా ఎన్నికల చిహ్నంగా ఆమె ‘పచ్చి మిర్చీ’ని కోరుకుంటున్నారట! లక్షలాదిగా అభిమానులు మీరు రాజకీయాల్లో చేరి, ఎన్నికల్లో పోటీ చేసి దేశాన్ని ఉద్ధరించాల్సిందే అంటూ ఒత్తిడి చేయడంతో తప్పనిసరై రాఖీ ఎన్నికల బరిలో నిలిచారట. పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేయాలని బీజేపీ కోరినా.. బెంగాలీ రాదు.. వారి సమస్యలను అర్థం చేసుకోలేనని చెప్పి తిరస్కరించారు. గెలిస్తే.. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమని, వారికి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తానని రాఖీ చెబుతున్నారు. రాఖీ రంగంలో దిగడంతో మోడీ పోటీలో ఉన్న వారణాసి తర్వాత రెండో పాపులర్ నియోజకవర్గంగా వాయవ్య ముంబై నిలిచింది. ఇప్పటికే ఇక్కడి నుంచి బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్(మహారాష్ట్ర నవనిర్మాణసేన), గురుదాస్ కామత్(కాంగ్రెస్), సినీ నిర్మాత కమాల్ ఆర్ ఖాన్(ఎస్పీ), మయాంక్ గాంధీ(ఆప్)లు బరిలో ఉన్నారు.
 
 ఫేస్‌బుక్ పంచ్‌లు...!
 ఎన్నికల వేళ సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో నెటిజన్లు చురుకుగా ఉన్నారు.  రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తున్నారు. అలాంటి వాటిలో బాగా లైకులు పొందుతున్న, షేర్ అవుతున్న కామంట్‌లు!
 ‘అన్నది పోస్టు పెయిడ్ పార్టీ,
 తమ్ముడిది ప్రీ పెయిడ్‌పార్టీ’
 (చిరంజీవి ఎన్నికల అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందే పార్టీని బీజేపీకి అనుబంధం చేయడంపై.)
 వద్దనుకొంటే ఏం నొక్కాలి బాబూ?!
 ఐవీఆర్‌ఎస్ ద్వారా అభ్యర్థుల ఎంపిక - చంద్రబాబు నాయుడు
 ఫోన్‌లో బాబు: ‘చంబులింగం కావాలంటే ఒకటి, ఏకలింగం కావాలంటే రెండు, జంబులింగం కావాలంటే మూడు, టింగులింగం కావాలంటే నాలుగు నొక్కండి’
 జనం: వీళ్లలో ఎవరూ మాకొద్దు,
 మీ పార్టీనే వద్దు... దానికి ఏం నొక్కాలి?!
 బీజేపీ వాళ్లు ‘ఓట్ ఫర్ మోడీ’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే తీరా పోలింగ్ బూత్‌లో మోడీ బొమ్మ కనపడకపోతే ఓటర్లు గందరగోళానికి గురవుతారేమో!
 (ప్రస్తుత కమలదళం ప్రచారాన్ని చూస్తుంటే మౌడీస్వామ్యం పుణ్యమా అని ఆ పార్టీ గుర్తు ‘కమలం’ అని మరిచిపోయే పరిస్థితి వచ్చిదంటూ ఒక నెటిజన్ సెటైర్)
 
 కామెంట్ ప్లీజ్...!
 తెలుగుదేశం పార్టీని
 గెలిస్తే చంద్రబాబు నాయుడు...
 సీమాంధ్రను అమ్మి సింగపూర్‌ను కొనుక్కొంటాడు!
 కిరణ్‌ను చూస్తే ఏమినిపిస్తోంది?
 
 హింసించే రాజు
 23వ పులకేశి గుర్తుకొస్తున్నాడు!
 బాబును చూస్తే ఏమనిపిస్తోంది?
 మీడియాకు ముద్దుబిడ్డడు అనిపిస్తోంది!
 చంద్రబాబు సోనియాగాంధీని గాడ్సే
 అని అంటున్నాడు!
 మరి రామారావుగారు చంద్రబాబును గాడ్సేతోనూ, ఔరంగజేబుతో పోల్చాడుగా!
 - సేకరణ: జీవన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement