* నేడు కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం
* దిగ్విజయ్ సింగ్ రాక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జరుగనుంది. పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఇదివరకే నగరానికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచనప్రాయంగా చెప్పడంతో దిగ్విజయ్ సింగ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఆనేక మంది క్యూకట్టారు. కుమార కృప అతిథి గృహానికి చేరుకున్న వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలుసుకోవడానికి పోటీ పడ్డారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు కేఎన్. రాజన్న, కేబీ. కోళివాడ, అజిత్ సేట్, రమేశ్ జారకిహొళి, మునిరత్నం నాయుడులు కలుసుకుని మంత్రి వర్గంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు.
మరో వైపు మంత్రులు డీకే. శివ కుమార్, రోషన్ బేగ్, ఉమాశ్రీలు కూడా ఆయనను కలుసుకుని కాసేపు చర్చించారు. నాయకులు, కార్యకర్తలు తనను స్వేచ్ఛగా కలుసుకోవడానికి అవకాశం కల్పించిన దిగ్విజయ్ సింగ్, తర్వాత వారిని అక్కడి నుంచి బయటకు పంపడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర సమన్వయ కమిటీ సమావేశంలో కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్షుల నియామకంపై చర్చిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చిస్తామన్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చించబోమన్నారు. దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల కారణంగా పాలన మందగతిన సాగిందని, ఇకమీదట జోరందుకుంటుందని వివరించారు.
పదవుల కోసం పైరవీలు
Published Wed, May 14 2014 3:29 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement