ఇంతవరకు సాఫీగా..సిద్ధు పాలన
* సిద్ధు పాలనకు ఏడాది పూర్తి
* శుక్రవారం వెలువడనున్న ‘లోక్‌సభ’ ఫలితాలు
*20 స్థానాల్లో గెలిచి తీరాలని అధిష్టానం లక్ష్యం
*12 సీట్లు మాత్రమేనని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్
*బస్సు, కరెంటు చార్జీల పెంపుపై సర్వత్రా విమర్శలు
*కళంకితులను అందలమెక్కించారంటూ బీజేపీ ధ్వజం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే వారికి ఎప్పుడూ ముళ్ల బాటే. అసమ్మతి ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటిది.. పూర్వాశ్రమంలో జనతాదళ్‌కు చెందిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా మంగళవారం నాటికి ఏడాది పాలనను సాఫీగా పూర్తి చేసుకున్నారు. ఇన్నాళ్లూ సాగిన పాలన ఓ ఎత్తై ఇకమీదట సాగబోయేది మరో ఎత్తుగా భావించవచ్చు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మొత్తం 28కి గాను 20 స్థానాల్లో గెలిచి తీరాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్దేశం చేశారు. అయితే సోమవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశాలున్నాయి. కనుక అధిష్టానంతో పాటు పార్టీలోని వ్యతిరేకుల నుంచి ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పలు సంక్షేమ పథకాలను ఏకపక్షంగా ప్రకటించడంపై పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో చర్చించకుండా, సీనియర్లను సంప్రదించకుండా పథకాలను ప్రకటించేశారని అనేక మంది ఆయనపై ఒంటి కాలిపై లేచారు.
అయితే తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఆయన ఆ విమర్శలను అలవోకగా తిప్పి కొట్టారు. బీజేపీ అవినీతి గురించి విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అదే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ మంత్రి వర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడ్డామని సీఎం అనుకుంటున్న తరుణంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లను మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది. తన చర్యను సమర్థించుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగానే బస్సు చార్జీలు, కరెంటు చార్జీల పెంపు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఒకే ఏడాదిలో అన్నీ పూర్తి చేసేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ‘జన్మతః’ కాంగ్రెస్‌కు చెందని సిద్ధరామయ్య ఆ పార్టీలో నెగ్గుకు వస్తూ ఉండడం విశేషమే.
విపక్ష నేత విసుర్లు
సిద్ధరామయ్య ఏడాది పాలన నిష్క్రియా పరత్వంతో సాగిందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ విమర్శించారు. కళంకితులకు అధికారం ఇచ్చి పాలనను అపవిత్రం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మంగళవారం ఆయనిక్కడ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో వారు ప్రవేశ పెట్టిన పలు పథకాలు ప్రజల పాలిట దౌర్భాగ్యంగా పరిణమించాయని ఆరోపించారు. అన్న భాగ్య...కన్న భాగ్యగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాదిలో మూడు సార్లు బీఎంటీసీ, రెండు సార్లు ఆర్టీసీ బస్సు, నిన్న విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని ఆయన విమర్శించారు.
ఘనంగా మారెమ్మ జాతర ఉత్సవాలు
పావగడ, న్యూస్‌లైన్ : పట్టణ సమీపంలోని రొప్పం గ్రామంలో గ్రామ దేవత మారెమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మారెమ్మ అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదం అందించారు.